ఆడపిల్లలకు మూసీ నది పేరును ఎందుకు పెట్టడం లేదు? : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్(Hyderabad) లోని శిల్పకళావేదికలో ఆదివారం ఏర్పాటు చేసిన 'కొలువుల పండుగ' కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పాల్గొన్నారు.

Update: 2024-10-06 13:33 GMT

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) లోని శిల్పకళావేదికలో ఆదివారం ఏర్పాటు చేసిన 'కొలువుల పండుగ' కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మూసీ నది గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా.. కొత్తగా నియమితులు అవుతున్న ఇంజనీర్లు తెలంగాణ అభివృద్దిలో భాగం కావాలని పిలుపునిచ్చారు. మీ చేతుల మీదుగా.. రీజినల్ రింగ్ రోడ్, ఫార్మసిటీ, ఫ్యూచర్ సిటీ నిర్మితం కాబోతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. తెలంగాణలో వందేళ్లు నిలిచిపోయే ప్రాజెక్టులలో నిలిచిపోయే గొప్ప పేరు సంపాదించుకోవాలని సూచించారు. ఇది మీకు కేవలం ఉద్యోగం కాదని ఉద్వేగం అని అన్నారు.


మూసీ నదికి పూర్వ వైభవం తెస్తాం..

మూసీ(Musi) డెవలప్మెంట్ ప్రాజెక్టును కొత్తగా నియమితులవుతున్న మీ ఇంజనీర్ల సహాయంతో అతి త్వరలోనే పూర్తి చేస్తానని తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి.. మూసీ నది గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నర్మదా, గోదావరి, యమునా వంటి నదుల పేర్లు మాత్రమే ఆడపిల్లలకు పెడతారు గాని, మూసీ నది పేరు ఏ తండ్రి కూడా తన బిడ్డకు ఎందుకు పెట్టుకోవడం లేదంటూ ప్రశ్నించారు. మూసీ అంటేనే మురికి కూపంగా ముద్ర పడిపోయిందని.. మూసీని మురికి కూపంగా చూస్తున్నారు తప్పా, ఆ నది ఒకప్పుడు హైదరాబాద్ నగర ప్రజల దాహం తీర్చిందని ఎవ్వరికీ తెలియదన్నారు. త్వరలోనే మూసీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని..  మూసీ నదికి ఉన్న మురికి నది అనే పేరును తొలగించే బాధ్యతను విజయవంతంగా నెరవేరుస్తామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలియ జేశారు.


Similar News