ట్రాఫిక్ ఇక్కట్లకు చెక్ పెట్టండి.. స్కూళ్ల యాజమాన్యాలకు ట్రాఫిక్ అదనపు సీపీ సూచన
ఆయా స్కూళ్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడటానికి యాజమాన్యాలు పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ అదనపు కమిషనర్ జి.సుధీర్ బాబు సూచించారు.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఆయా స్కూళ్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడటానికి యాజమాన్యాలు పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ అదనపు కమిషనర్ జి.సుధీర్ బాబు సూచించారు. దీని కోసం ట్రాఫిక్ వాలంటీర్లు, సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలని చెప్పారు. స్కూల్ జోన్లలో ఉదయం, సాయంత్రం వేళల్లో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రాఫిక్ అడిషనల్ సీపీ సుధీర్ బాబు మంగళవారం తన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో వేర్వేరు స్కూళ్ల యాజమాన్యాలతో సమావేశాన్ని నిర్వహించారు. పిల్లలతో స్కూళ్లకు వచ్చే వాహనాలను పార్క్ చెయ్యటానికి ఏర్పాట్లు చెయ్యాలని యాజమాన్యాలకు సూచించారు. అడ్డదిడ్డంగా వాహనాలను పార్క్ చెయ్యకుండా చూడటానికి సెక్యూరిటీ గార్డులు, ట్రాఫిక్ వాలంటీర్లను పెట్టుకోవాలని చెప్పారు. ఒకే ప్రాంతంలో నాలుగైదు స్కూళ్లు ఉంటే పది నిమిషాల తేడాతో పిల్లలు ఉదయం, సాయంత్రం వచ్చి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఇక స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై యాజమాన్యాలు మరింత శ్రద్ద తీసుకోవాలని చెప్పారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా బస్సులు ఉండాల్సిందే అని చెప్పారు. ట్రాఫిక్ వాలంటీర్లకు శిక్షణ ఇవ్వటానికి ట్రాఫిక్ పోలీస్ విభాగం సిద్ధంగా ఉందన్నారు. ట్రాఫిక్ డీసీపీ-1 రాహుల్ హెగ్డే మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులతో స్కూళ్లలో ట్రాఫిక్ క్లబ్బులను ఏర్పాటు చెయ్యాలన్నారు. ట్రాఫిక్ పోలీసులు చెప్పే సూచనలు పాటించేలా చూడాలని చెప్పారు. ట్రాఫిక్ డీసీపీ-3 శ్రీనివాస్ మాట్లాడుతూ స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు. సమావేశానికి హాజరైన స్కూళ్ల ప్రతినిధులు మాట్లాడుతూ తమ వద్ద పని చేస్తున్న సెక్యూరిటీ గార్డులు, టీచర్లు, వాలంటీర్లకు ట్రాఫిక్ రెగ్యులరైజేషన్ లో శిక్షణ ఇవ్వాలని కోరారు. సమావేశంలో ట్రాఫిక్ డీసీపీ-2 అశోక్ కుమార్ తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.