మోసం చేయడంలో కేసీఆర్‌ను మించిన వారే లేరు: రేవంత్ రెడ్డి
మోసం చేయడంలో సీఎం కేసీఆర్‌ను మించిన వారే లేరని, ఆయన మనుషులనే కాదు దేవుళ్లను సైతం మోసం చేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు.
దిశ, వెబ్‌డెస్క్: మోసం చేయడంలో సీఎం కేసీఆర్‌ను మించిన వారే లేరని, ఆయన మనుషులనే కాదు దేవుళ్లను సైతం మోసం చేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ విజయభేరి సభ నిర్వహించారు. ఈ సభకు హాజరైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కుర్చీ వేసుకుని ప్రాజెక్టుల దగ్గర కుర్చుంటానన్న కేసీఆర్ చేసేందేమిటీ.. నల్లవాగుపై లిఫ్ట్ పెడతామన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను బెదిరించి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. గ్రామాలు బాగుపడాలంటే బీఆర్ఎస్ను గద్దెదించాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే కేసీఆర్‌ను ఇంటికి పంపాలని కోరారు.
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ రావడం పక్కా అని, నారాయణఖేడ్, జహీరాబాద్‌లో కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని దీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం రాబోతోంది, తెలంగాణలో కచ్చితంగా ఇందిరమ్మ రాజ్యం తెచ్చి చూపిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్ రాగానే తండాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే మహిళల సమస్యలు తీరుతాయని అన్నారు. ప్రజల సొమ్ముతో కేసీఆర్ ప్రగతి భవన్ గడీ కట్టుకుని.. ఆ ప్రగతి భవన్లో పేదలకు ప్రవేశం నిషేదించారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పవర్లోకి రాగానే నారాయణఖేడ్‌ను దత్తతా తీసుకుంటానని రేవంత్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.