ఉమ్మడి జిల్లాపై అగ్రనేతల ఫోకస్.. వరుస సభలతో పొలిటికల్ హీట్!

అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజుల గడువు ఉండడంతో ప్రధాన పక్షాలు దూకుడు పెంచాయి.

Update: 2023-11-24 02:23 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజుల గడువు ఉండడంతో ప్రధాన పక్షాలు దూకుడు పెంచాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లో బస్సుయాత్ర నిర్వహించారు. రేవంత్ రెడ్డి కామారెడ్డి నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పర్యటనను పూర్తి చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ జుక్కల్ నియోజకవర్గంలో ఇది వరకే పర్యటించారు. కామారెడ్డిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించిన విషయం తెల్సిందే.

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బాల్కొండ, ఆర్మూర్, బోధన్ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని చేశారు. గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా నిజామాబాద్ అర్బన్‌లో బహిరంగ సభలో పాల్గొన్నారు. శుక్రవారం ఆర్మూర్‌కు అమిత్ షా రానున్నారు. ఈనెల 25న ఒకే రోజు ప్రధాని మోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలు ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. కామారెడ్డిలో ప్రధాని మోడీ, బోధన్‌లో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది. 26న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిజామాబాద్ అర్బన్‌లో పర్యటనకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. 26న మంత్రి కేటీఆర్ కామారెడ్డిలో పర్యటించనున్నారు.

ఇది వరకే కామారెడ్డి జిల్లాలో పలు దఫాలుగా పర్యటించి రోడ్డుషోలతో పాటు మాచారెడ్డిలో బహిరంగ సభలో పాల్గొన్న కేటీఆర్ కామారెడ్డి నియోజకవర్గ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తుగా కామారెడ్డిలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జుక్కల్ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు షెడ్యూల్ ఖరారు కాలేదు. ఈనెల 28న చివరి రోజు ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డిలో జరిగే ర్యాలీలో పాల్గొనున్నారు.

అదే రోజు రేవంత్ రెడ్డి కూడా కామారెడ్డిలోనే ప్రచారానికి వస్తున్నట్లు సమాచారం. 25న ఇద్దరు జాతీయ పార్టీల నేతలు, 28న ముఖ్యమంత్రితో పాటు జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుల పర్యటన నేపథ్యంలో ప్రచారం పీక్ స్థాయికి చేరనుంది. ఇప్పటికే నియోజకవర్గాల అభ్యర్థులు ప్రచారంలో సర్వశక్తులు ఒడ్డుతున్న విషయం తెల్సిందే. ఐదు రోజుల్లో తమ పర్యటనను పూర్తి చేసుకుని ఓటర్ల ప్రసన్నం కోసం ఎదురు చూస్తున్నారు. రెండు రోజుల పాటు తాయిలాల పంపిణీకి అవకాశం ఉండడంతో మైక్‌లు మూసివేసే 28 సాయంత్రానికి ప్రచారానికి ముగింపు పలకాలని బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ప్రణాళికలు రూపొందించారు.

అందులో భాగంగానే మూడు పార్టీల అగ్రనేతలు ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇద్దరు అగ్రనేతలు పోటీ పడుతున్న కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ సంగతి దేవుడెరుగు కానీ వీఐపీల పర్యటనతో పోలీసు అధికారులకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది. 28 సాయంత్రం వరకు ప్రచారం ముగింపు వరకు మొత్తం ప్రక్రియను ప్రధానంగా ప్రచార ప్రక్రియకు తెర దించేలా కార్యక్రమ రూపకల్పన జరుగుతుంది.


Similar News