తెలుగు రాష్ర్టాల్లో పెరిగిపోతున్న మద్యం బానిసలు.. ఆ లెక్కలు చూస్తే కళ్లు తిరగాల్సిందే..!

తెలుగు రాష్ర్టాల్లో మద్యం బానిసలు పెరిగిపోతున్నారు. ఎనీటైం.. తెగ తాగేస్తున్నారు. గుంటూరు జీజీహెచ్‌లోని డీ అడిక్షన్​సెంటర్‌లో ఓపీ పెరగడమే ఇందుకు ఉదాహరణ.

Update: 2024-10-15 11:54 GMT

తెలుగు రాష్ర్టాల్లో మద్యం బానిసలు పెరిగిపోతున్నారు. ఎనీటైం.. తెగ తాగేస్తున్నారు. గుంటూరు జీజీహెచ్‌లోని డీ అడిక్షన్​సెంటర్‌లో ఓపీ పెరగడమే ఇందుకు ఉదాహరణ. 2020లో 343 మంది ఉన్న ఓపీ 2023 నాటికి ఆ సంఖ్య 4913కు చేరింది. అంటే దాదాపు 1300 శాతం పెరిగిందన్నమాట. గత నెలలో అసెంబ్లీలో సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంలోని లెక్కలివి. అనారోగ్యం పాలవుతున్నారంటే వీరంతా ఏదో సరదాకి, ఎప్పడో ఒకసారి తాగేవారు కాదని స్పష్టమవుతున్నది. మానలేకపోతున్న వ్యసనం, నాసిరకం మద్యం.. రెండూ కలిసి ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి. వీరిలో చాలామందికి మానాలనే ఉంటుంది. మళ్లీ తాగను అంటూ ఇంట్లో వారికి ఒట్టు వేసిన వారు కూడా.. మత్తు అలవాటును మానలేకపోతున్నారు. = అనిల్ శిఖా

ఇరు తెలుగు రాష్ట్రాల్లో మద్యం ప్రియులు ఎంతమంది ఉన్నారు..? ఎంత తాగుతున్నారు..? మద్యం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత? అనే విషయాలను పరిశీలిస్తే విస్తుపోయే అంశాలు కనిపిస్తున్నాయి. మద్యం ఆదాయం లేనిదే ప్రభుత్వాలు మనుగడ సాగించలేవన్నది సత్యం. ఆయా రాష్ట్రాలకు మద్యంపై వస్తున్న ఆదాయమే మూడో అతిపెద్ద ఆదాయ వనరుగా ఉందని సర్వేలు చెబుతున్నాయి. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం.. అని ఎన్ని ప్రకటనలు చేసినా వినేవారు లేరు. పైగా తాగుబోతుల శాతం పెరిగిపోతున్నది. దీంతో మద్యం ప్రియులు ఏం కోరుకుంటున్నారో ఆరా తీసి, వారికి కావలసిన మద్యాన్ని అందించేందుకు ప్రభుత్వాలు సిద్ధం అవుతున్నాయి.

ఎంతమంది తాగుతున్నరంటే..

గత అధ్యయనాల ప్రకారం తెలంగాణలో 19 శాతం, ఏపీలో 11.5 శాతం మంది మద్యం తాగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 43.4% మంది పురుషులు మద్యం తాగుతున్నారు. మహిళల్లో 6.7 శాతం మందికి మద్యపానం అలవాటు ఉంది. దేశంలో మద్యం తాగేవారి సగటున 9.9శాతంగా ఉంది.

ఎందుకిలా..?

మద్యం వినియోగం పెరగడం కారణాలను విశ్వేషిస్తే.. ప్రజల ఆదాయం పెరగడం, పట్టణ జనాభా పెరగడం కూడా ఒక కారణంగా తెలుస్తున్నది. మానసిక, కుటుంబ సమస్యలు కూడా కారణాలే. అయితే సంపన్నులతో పోల్చితే పేదలే మద్యానికి ఎక్కువగా బానిసలయ్యారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. రోజువారి జీవితంలో ఒత్తిడిని ఎదుర్కోవడం ఇందుకు కారణం. కొన్ని వర్గాల్లో మద్యం తాగడాన్ని అంగీకరిస్తారు. నగరాల్లో కంటే గ్రామాల్లో నివసించే వారే ఎక్కువ తాగుతున్నారని సర్వేల్లో వెల్లడైంది. దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 16.5శాతం మంది, గ్రామీణ ప్రాంతాల్లో 19.9శాతం మంది మద్యం తాగుతున్నారు. దేశంలో 16 కోట్ల మందికి పైగా పురుషులు, 54 లక్షల మంది మహిళలు మందు కొడుతున్నారు.

న్యూ ఇయర్​ రోజుల్లో..

డిసెంబర్ 31, కొత్త సంవత్సరం ప్రారంభం రోజుల్లో అయితే తెగ తాగేశారు. గత ఏడాది చివరి మూడు రోజుల్లో తెలంగాణలో రూ.658 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి. 4.76 లక్షల కేసుల మద్యం, 6.31 లక్షల కేసుల బీరు అమ్మకాలు జరిగాయి. ఏపీలో గత డిసెంబరు 31వ తేదీ, ఒకటో తేదీన రూ.250 కోట్ల మద్యం వ్యాపారం జరిగింది. కేవలం 31న 1.51 లక్షల కేసుల లిక్కర్, 67 వేల కేసుల బీరు విక్రయాలు జరిగాయి.

పెరిగిన తలసరి మద్యం వినియోగం

మద్యం వినియోగంపై నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (నిపెప్) ఓ అధ్యయనాన్ని విడుదల చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ వార్షిక సగటు తలసరి వినియోగ వ్యయం రూ.1,623 గా పేర్కొంది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో మద్యంపై వార్షిక సగటు తలసరి వినియోగ వ్యయం రూ.1,306గా ఉందని తెలిపింది.

మద్యం తాగడం అనర్థమే..

మద్యం తాగడం వల్ల అనేక శారీరక, మానసిక సమస్యలు వస్తాయి. ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల 200 కంటే ఎక్కువ రకాల వ్యాధులు సంభవిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 30 లక్షల మంది మద్యం సేవించడం వల్ల మృత్యువాత పడుతున్నారు. కాబట్టి మద్యం సేవించడం మానుకోవడం ఉత్తమం.

వాళ్లని తిడితే మారరు

తాగకుండా ఉండలేకపోవడం, పరిమితి పాటించకపోవడం, పగలు రాత్రి అనే తేడా చూడకుండా మద్యానికి అలవాటు పడటం వ్యసనపరుల లక్షణాలు. అయితే వీరిని కుటుంబ సభ్యులు తిట్టడం, కొట్టడం, చులకన చేయడం వల్ల ఆ వ్యవసనం నుంచి బయటపడరని మానసిక వైద్య నిపుణులు కచ్చితంగా చెప్తున్నారు. వారిని సైకాలజిస్ట్, డీ ఎడిక్షన్​సెంటర్​ఎక్స్‌పర్ట్​ వద్దకు తీసుకు వెళ్లాలని సూచిస్తున్నారు. అవసరమైతే రీహాబిలిటేషన్​ సెంటర్‌లో కొంతకాలం ఉంచాలని.. ఆధ్యాత్మిక చింతన కూడా వ్యసనాల నుంచి బయట పడడానికి సహాయపడుతుందని పేర్కొంటున్నారు.

అతిగా తాగి జబ్బుల బారిన..

అతిగా తాగడం వల్ల, కాలేయం, క్లోమ గ్రంధి దెబ్బతింటుంది. గుంటూరు జీజీహెచ్‌కి ఉదరకోశ వ్యాధికి సంబంధించి వస్తున్న పేషెంట్లలో 40శాతం మంది మద్యం అలవాటు ఉన్నవారేనని లెక్కలు చెప్తున్నాయి. విజయవాడ జీజీహెచ్‌లో ఈ వ్యాధికి సంబంధించిన రోగుల ఓపీ సగటున 100 నుంచి 150 వరకు ఉంటున్నది. గత ఐదేళ్లలో ఏపీలో నాసిరకం మద్యం వల్ల ఈ సంఖ్య పెరుగుతున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. 2020లో 343 మంది ఉన్న డీ అడిక్షన్​ సెంటర్​ ఓపీ 2023 నాటికి ఆ సంఖ్య 4913కు చేరిందంటే పరిస్థితి తీవ్రత ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మద్యం అలవాటు మానుకోవాలని ఉంటే..

మద్యం వ్యవసనం నుంచి బయటపడేందుకు ఆల్కహాలిక్స్ ఎనానిమస్ ఇండియా సంస్థ చాలాకాలంగా సేవలను అందిస్తున్నది. ఈ సంస్థకు సంబంధించిన nfo@aagsoindia.org వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీకు దగ్గరలో ఉన్న గ్రూపు వివరాలను తెలుసుకోవచ్చు. మద్యం అలవాటు ఉండి, మానుకోవాలని ప్రయత్నిస్తున్న వారు, మానేసినవారు ఈ గ్రూపుల్లో ఉంటారు. ఇక్కడి సేవలు ఉచితంగానే అందుతాయి. ఆల్కహాలిక్స్ ఎనానిమస్ హైదరాబాద్ హెల్ప్‌లైన్ నంబర్- 06301637867. విజయవాడ నంబర్- 83096 11905. ఇవి కాక ఏపీ, తెలంగాణ ప్రభుత్వ వైద్యశాలల్లో డీ అడిక్షన్ కేంద్రాలు కూడా ఉన్నాయి.



 



Similar News