ఐఏఎస్‌ల పిటిషన్లపై క్యాట్ లో ముగిసిన వాదనలు..ఇంకాసేపట్లో తీర్పు

ఐఏఎస్‌ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్‌)లో మంగళవారం సాగిన విచారణలో ఐఏఎస్ కౌన్సిల్ వాదనలు ముగిశాయి.

Update: 2024-10-15 11:26 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఐఏఎస్‌ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్‌)లో మంగళవారం సాగిన విచారణలో ఐఏఎస్ కౌన్సిల్ వాదనలు ముగిశాయి. తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లు ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్ట్ చేయాలని డీఓపీటీ ఈనెల 9న ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. డీఓపీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ పలువురు ఐఏఎస్ అధికారులు క్యాట్‌లో పిటిషన్‌ వేశారు. దీనిపై ఈరోజు విచారణ మొదలైంది. డీవోపీటీ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని ఐఏఎస్ అధికారులు కోరారు. ఉత్తర్వులు రద్దు చేయాలని ఐఏఎస్ ల తరుపున ఐఏఎస్ కౌన్సిల్ వాదనలు వినిపించింది. ఐఏఎస్ కౌన్సిల్ వాదనలు ముగియ్యగా... డీవోపీటీ వాదనలు ప్రారంభమయ్యాయి. వాదనలు ప్రారంభం స్వాపింగ్ గైడ్లైన్స్, రిజర్వేషన్లపైనే వాదనలు వినిపించాలని డీవోపీటీకి క్యాట్ సూచించింది. ఇరువురి వాదనలు విన్న క్యాట్ ఇంకాసేపట్లో తీర్పు వెలువరించనుంది.

కాగా ఉమ్మడి రాష్ట్ర విభజన సందర్భంగా చేపట్టిన క్యాడర్‌ కేటాయింపుల ప్రకారం.. ఏపీ, తెలంగాణకు కేటాయించిన అధికారులు ఆయా రాష్ట్రాలకు వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. ఏ రాష్ట్రానికి కేటాయించిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు అదే రాష్ట్రానికి వెళ్లాలంటూ ఈ నెల 9న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన రిలీవింగ్‌ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పలువురు ఐఏఎస్‌ అధికారులు మళ్లీ సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ (క్యాట్‌) హైదరాబాద్‌ను ఆశ్రయించారు. తాము ప్రస్తుతం పని చేస్తున్న రాష్ట్రంలోనే ఉంటామని, కేంద్రం ఇచ్చిన అస్పష్ట ఆదేశాల (నాన్‌ స్పీకింగ్‌ ఆర్డర్‌)ను కొట్టేయాలని కోరారు. ఈ మేరకు కాట ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్‌, గుమ్మడి సృజన, రొనాల్డ్‌రోస్‌.. క్యాట్‌లో వేర్వేరు పిటిషన్‌లు దాఖలు చేశారు. వీరిలో సృజనను తెలంగాణకు కేటాయించగా.. ప్రస్తుతం ఆమె ఏపీలో పనిచేస్తున్నారు. మిగిలిన నలుగురిని ఏపీకి కేటాయించగా.. వారు తెలంగాణలో పనిచేస్తున్నారు.


Similar News