HYD: కదులుతున్న రైలులో చిన్న పిల్లల స్టంట్స్.. వైరల్ వీడియోపై నెటిజన్ల ఫైర్

కదులుతున్న ఎంఎంటీఎస్ రైలులో చిన్న పిల్లలు ప్రమాదకరంగా స్టంట్‌లు చేస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Update: 2024-10-15 12:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కదులుతున్న ఎంఎంటీఎస్ రైలులో చిన్న పిల్లలు ప్రమాదకరంగా స్టంట్‌లు చేస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీడియో ప్రకారం చిన్న పిల్లలు స్టేషన్ వద్దకు వచ్చిన ఎంఎంటీఎస్ ట్రైన్ ఎక్కి నిలుచున్నారు. రైలు స్టేషన్ నుంచి బయలుదేరుతున్న సమయంలో కిందికి దిగి, ప్రయాణికులు రైలు ఎక్కేందుకు ఉపయోగించే హ్యాండిల్ సపోర్టర్ సహాయంతో రైలు వెంట పరిగెడుతూ స్టంట్‌లు చేశారు. మధ్యమధ్యలో రైలు ఎక్కి దిగుతూ ప్రమాదకరమైన ఫీట్లు చేశారు. దీనిని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్ ప్రకారం ఈ ఘటన హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలులో జరిగిందని, కాచిగూడ నుంచి చందానగర్ వెళుతున్న సమయంలో పిల్లలు ఫీట్లు చేశారని రాసుకొచ్చాడు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. రైల్వే అధికారులతో పాటు పిల్లల తల్లిదండ్రులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల చెయ్యి జారితే ప్రాణాలకే ప్రమాదం అని, ఇలాంటి ప్రమాదకర ఘటనలు జరుగుతున్నా.. రైల్వే స్టేషన్ సిబ్బంది ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. అంతేగాక పిల్లలను అజాగ్రత్తగా వదిలివేయడం పట్ల తల్లిదండ్రులపై దుమ్మెత్తి పోస్తున్నారు. పిల్లలకు ప్రమాదం జరిగితే ఎవరిని అడుగుతారని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది కాదా అని ప్రశ్నిస్తున్నారు.


Similar News