Thummala: వారిది ఒక బాధ.. వీరిది ఇంకో బాధ.. విపక్షాలకు మంత్రి తుమ్మల కౌంటర్

గాంధీభవన్‌లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం ప్రారంభమైంది.

Update: 2024-10-07 07:32 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గాంధీభవన్‌లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల వినతులు స్వీకరించేందుకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున గాంధీ భవన్ కు తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రైతురుణమాఫీపై విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. తాము నిత్యం ప్రజల్లో మమేకమై.. రైతులతో తిరుగుతున్నామని, ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే మాకు నిరసన సెగ తగిలిఉండేదని అన్నారు. అలాగే బీఆర్ఎస్, బీజేపీలు ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాయని, అధికారం కోల్పోయిన బాధ ఒకరికి ఉంటే.. అధికారంలోకి రావాలనే బాధ ఇంకొకరికి ఉందని ఎద్దేవా చేశారు.

తెలంగాణలో రైతు రుణమాఫీ జరిగింది ప్రధాని మోదీకి కనిపించట్లేదా అని మండిపడ్డారు. ఇక ప్రజల సమస్యలపై వినతులు స్వీకరిస్తున్న ఆయన కొన్ని సమస్యలకు స్పాట్ లోనే పరిష్కారం చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలానికి చెందిన వృద్ద మహిళ యాదమ్మ తన భూమి సమస్యను మంత్రి దృష్టికి తీసుకొని వచ్చింది. యాదమ్మ వినతిని స్వీకరించిన తుమ్మల వెంటనే సూర్యాపేట జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేశారు. వృద్దురాలి సమస్యను కలెక్టర్ కి వివరించి, తక్షణ పరిష్కారం చూపించాలని ఆదేశాలు ఇచ్చారు. 


Similar News