తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. సమగ్ర సర్వేకు ఆదేశం
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌ఎండీఏ(HMDA) పరిధిలో చెరువులపై సమగ్ర సర్వేకు ఆదేశించింది.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌ఎండీఏ(HMDA) పరిధిలో చెరువులపై సమగ్ర సర్వేకు ఆదేశించింది. ఈ మేరకు సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని చెరువుల విస్తీర్ణంతో పాటు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించాలని నిర్ణయం తీసుకుంది. మూడు నెలల్లోనే సర్వే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. సర్వే పూర్తయిన వెంటనే అధికారిక వెబ్‌సైట్‌లో చెరువుల వివరాలు పొందుపర్చాలని సూచించింది. కాగా, ఇప్పటికే నగరంలోని చెరువులను పరిరక్షించేందుకు ప్రభుత్వం హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి) అనే కొత్త వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
హైడ్రా(Hydraa)కు మరింత బలాన్ని చేకూర్చేందుకు వీలుగా బల్దియా చట్టంలో కొత్త సెక్షన్ చేర్చుతూ ఇటీవలే ఆర్డినెన్స్ సైతం జారీ అయింది. దీనికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలపగా రాజ్‌భవన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల సంరక్షణే లక్ష్యంగా.. ఆక్రమణదారులకు నోటీసులివ్వడం, విచారణ చేపట్టడం, అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం వంటి అధికారాలతో హైడ్రా దూసుకెళ్లనుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సర్వేకు ఆదేశించడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.