ప్రభుత్వానికి డిజిటల్ హెల్త్ కార్డుల తెలుగు ఫార్మేట్ తో సంబంధం లేదు

Update: 2024-10-07 10:53 GMT

దిశ, వెబ్ డెస్క్ : డిజిటల్ హెల్త్ కార్డుల కోసం తెలుగు దరఖాస్తుల ఫార్మేట్ ను ప్రభుత్వం విడుదల చేయలేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ తేల్చిచెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్న తెలుగు దరఖాస్తుల ఫారాలకు ప్రభుత్వానికి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు కమిషనర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డు దరఖాస్తు డిజైన్ ఇప్పటి వరకు ఫైనల్ కాలేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియా, పలు మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై ప్రభుత్వంతో సంబంధ లేదని తేల్చి చెప్పింది. ఫేక్ దరఖాస్తులపై వస్తున్న వార్తలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాంటి తప్పుడు వార్తలపై ప్రజలు స్పందించవద్దని పేర్కొంది. ఇలాంటి ఫేక్ వార్తలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందజేసే డిజిటల్ కార్డుపై ఆ ఇంటి మహిళనే యజమానిగా గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా అధికారులకు సూచించారు. కుటుంబంలోని సభ్యుల పేర్లు, ఇతర వివరాలను కార్డు వెనుక భాగంలో ఉండే విధంగా కార్డుల రూపకల్పన జరగాలని చెప్పారు. ఈనెల 3 నుంచి రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కోచోట ఒక గ్రామీణ, ఒక పట్టణ ప్రాంతాన్ని మొత్తంగా 238చోట్ల ఎంపిక చేసి పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టాలని సూచించారు.


Similar News