ఇది బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల కుట్రే.. సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై అర్వింద్ సీరియస్
తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో బీజేపీ దూకుడు పెంచింది. రాష్ట్రంలో ఎలాగైనా డబుల్ డిజిట్ సీట్లను సాధించడమే టార్గెట్ గా పెట్టుకున్న కమలం పార్టీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించింది.
దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో బీజేపీ దూకుడు పెంచింది. రాష్ట్రంలో ఎలాగైనా డబుల్ డిజిట్ సీట్లను సాధించడమే టార్గెట్ గా పెట్టుకున్న కమలం పార్టీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించింది. దీంతో వారంతా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సీరియస్ అయ్యారు. ఇదంతా బీఆర్ఎస్, కాంగ్రెస్ కుట్రేనని, ఇక్కడ తన గెలుపు ఖాయం అని తెలిసే తన విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిజామాబాద్ సెగ్మెంట్ లో విజయం సాధించి నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానిని చేసేందుకు పార్టీ శ్రేణులతో కలిసి సమిష్టిగా ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు.
నా గెలుపు ఖాయమనే అక్కసుతోనే..
ఆంజనేయస్వామి మాలలో ఉన్న జర్నలిస్ట్‌పై ధర్మపురి అర్వింద్ తన అహంకారాన్ని, కోపాన్ని ప్రదర్శించారంటూ ఇటీవల కొంతమంది సోషల్ మీడియాలో ఓ వీడియోను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ వీడియోను చూపిస్తూ తాను హిందూ వ్యతిరేకి.. అంటూ ప్రచారం చేశారు. అయితే ఇదంతా నా గెలుపు ఖాయమనే అక్కసుతో కావాలనే చేస్తున్నారని అర్వింద్ ఖండించారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా పసుపు బోర్డు హామీతో పాటు స్పైస్ బోర్డు తీసుకువచ్చామని, దీంతో ఎక్కడికి వెళ్లినా ప్రజల మద్దతు తనకు లభిస్తుండటంతో ఓర్వలేకే చివరి ప్రయత్నంగా తనను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని ఇలాంటి చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. కాగా ప్రధాన మంత్రి మోడీ అభిమానిగా బీజేపీలో చేరిన ధర్మపురి అర్వింద్ 2019లో నాటి సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఓడించి దేశవ్యాప్తంగా చర్చగా మారారు. ఆ తర్వాత తనదైన శైలితో బీజేపీలో కొత్త జోష్‌ను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రముఖ పారిశ్రామికవేత్త పైడి రాకేశ్‌రెడ్డిని బీజేపీలో జాయిన్ అయ్యేలా చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉండగా అందులో ఒకరు రాకేశ్‌రెడ్డి కావడం విశేషం.
ప్రత్యర్థులు డీలా:
రాష్ట్రం నుంచి నలుగురు సిట్టింగ్ ఎంపీలు ఉండగా పార్టీ వారిలో ముగ్గురికి తిరిగి టికెట్ కేటాయించింది. వీరి పేర్లను మొదటి జాబితాలోనే ప్రకటించింది. దీంతో నిజామాబాద్ నుంచి అర్వింద్ పేరునే మరోసారి ప్రకటించడంతో ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ తరపున ధర్మపురి అర్వింద్, కాంగ్రెస్ తరపున జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ తరపున బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో ఉన్నారు. అయితే అంతకు ముందు అర్వింద్ ఎక్కడి నుంచి పోటీ చేసినా వెంటపడి ఓడిస్తానని చెప్పిన కల్వకుంట్ల కవిత అనూహ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లారు. దీంతో కవిత వ్యవహారంతో బీఆర్ఎస్‌కు భారీ దెబ్బ పడగా ఇక కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి గత రెండు పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ఈసారి బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఏ మేరకు లభిస్తుందనేది చర్చగా మారింది. దీంతో మోడీ హవా, అర్వింద్ స్పీడ్‌తో నిజామాబాద్ గడ్డపై మరోసారి కాషాయజెండా ఖాయం అనే చర్చ తెరపైకి వస్తోంది