Assembly : టీజీఐసీకి భూముల బదిలీపై అసెంబ్లీలో రచ్చ!

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి కంచ గచ్చిబౌలి భూములు(Kancha Gachibowli lands) 400ఎకరాల భూములను ఎకరాకు 75కోట్ల చొప్పున టీజీఐసీ(TGIC)కి బదిలీ చేయడం.. మర్చంట్ బ్యాంకర్ కు 3శాతంకమిషన్ ఇచ్చేందుకు సిద్ధపడిందన్న ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలపై అసెంబ్లీ(Assembly)లో రచ్చ రేగింది.

Update: 2024-12-19 12:11 GMT

దిశ, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి కంచ గచ్చిబౌలి భూములు(Kancha Gachibowli lands) 400ఎకరాల భూములను ఎకరాకు 75కోట్ల చొప్పున టీజీఐసీ(TGIC)కి బదిలీ చేయడం.. మర్చంట్ బ్యాంకర్ కు 3శాతంకమిషన్ ఇచ్చేందుకు సిద్ధపడిందన్న ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలపై అసెంబ్లీ(Assembly)లో రచ్చ రేగింది. ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలు, మంత్రుల ప్రతిస్పందనలతో సభ వేడెక్కింది. రాష్ట్ర అప్పులపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అప్పులపై బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎఫ్ఆర్బీఎం నిబంధనలను అతిక్రమిస్తూ అడ్డగోలుగా అప్పులు చేస్తుందన్నారు. 1లక్ష 27వేలు కోట్లు అప్పు తీసుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి, 64కోట్లు అప్పు తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డిలు భిన్నమైన ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. భూములను అమ్మి మరి రుణాలు తెస్తున్నారని, కంచ గచ్చిబౌలి భూములు 400ఎకరాలను టీజీఐసీకి బదిలీ చేశారని ఆరోపించారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ యూపీ ప్రభుత్వం కూడా ఈ రకంగా భూముల బదలాయింపు, తాకట్టు పెట్టిందన్నారు.

శ్రీధర్ బాబు వ్యాఖ్యలను ఖండించిన మహేశ్వర్ రెడ్డి మీలా యూపీ ప్రభుత్వం భూములను అమ్మకానికి పెట్టలేదన్నారు. ప్రభుత్వం కేవలం కమిషన్లు వచ్చే పనులకే అప్పుల, ఆదాయ నిధులు ఖర్చు చేస్తు రాష్ట్ర సంపదను కాంట్రాక్టర్లకు దోచుపెడుతుందన్నారు. కేటీఆర్ జోక్యం చేసుకుంటూ మంత్రి శ్రీధర్ బాబు ఈ రకంగా శాసన సభను, ప్రజలను తప్పుదోవ పట్టించడం సరైందికాదన్నారు. కంచ గచ్చిబౌలి భూములు 400ఎకరాల భూములను అమ్మినట్లుగా ప్రభుత్వం ఇచ్చిన జీవో ఎంఎస్.54విడుదల చేశారని, సర్వే నెంబర్ 25లోని భూములను ఐటీ డెవలప్మెంట్ కోసం బదిలీ చేసిందని జీవో కాపీని చదివి వినిపించారు. యూపీ ప్రభుత్వం తప్పు చేస్తే మీరు తప్పు చేస్తరా అని కేటీఆర్ ప్రశ్నించారు. నాకు ఇప్పుడే మా ఎమ్మెల్యేల ద్వార ఫార్ములా ఈ రేసు పై నాపై కేసు నమోదు చేశారని తెలిసిందని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే అసెంబ్లీలో దీనిపై చర్చ పెట్టాలని తాను డిమాండ్ చేస్తున్నానన్నారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కూడా అప్పులు చేసిందన్నారు. రాష్ట్రాన్ని నడిపించడంలో ప్రభుత్వాలు అప్పులు, సర్థుబాట్లుతో ముందుకేళ్లడం సహజమేనన్నారు. జీఎస్టీలో కేంద్రానికి అధిక మొత్తం వెలుతుందని, కేంద్రం నుంచి నిధుల కోసం కాళ్లరిగేలా ఢిల్లీ చుట్టు తిరిగినా కేంద్రం నిధులివ్వడం లేదన్నారు. మహేశ్వర్ రెడ్డి ప్రతిస్పందిస్తూ తెలంగాణకు కేంద్రం 6లక్షల కోట్ల నిధులు ఇచ్చిందన్న సంగతి మరువరాదన్నారు. 

Tags:    

Similar News