TG Assembly: అలా చేసుంటే బీఆర్ఎస్‌కు ఈ పరిస్థితి వచ్చేది కాదు.. MLA కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
తమది ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వమని కాంగ్రెస్(Congress) కీలక నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Raj Gopal Reddy) అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: తమది ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వమని కాంగ్రెస్(Congress) కీలక నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Raj Gopal Reddy) అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ప్రజలు పదేళ్లు అవకాశం ఇస్తే.. బీఆర్ఎస్(BRS) నేతలు చేయాల్సిన అక్రమాలన్నీ చేశారని ఆరోపించారు. ఆరుగురం ఎమ్మెల్యేలం అవమానాలు భరిస్తూ ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ఎండగట్టామని అన్నారు. పదేళ్లు పవర్ అనుభవించి.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి.. ఇవాళ అసెంబ్లీకి రోజుకో డ్రెస్ వేసుకొచ్చి నిరసన తెలుపుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతల లాగా తాము కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కోసం ప్రాజెక్టులు కట్టడం లేదని అన్నారు.
అనాలోచితంగా, అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అప్పులు చేయదని అన్నారు. ప్రపంచంలో కాస్ట్లీ వాటర్ ఏదైనా ఉంది అంటే అది కాళేశ్వరం(Kaleswaram) వాటర్. గ్రావిటీ ద్వారా వచ్చే తుమ్మిడి హెట్టిని కాదని మూడు లిఫ్టులు పెట్టి కూలిపోయే ప్రాజెక్టు కట్టి అప్పులు చేశారని మండిపడ్డారు. పది రాష్ట్రాలకు అప్పులు ఇవ్వాల్సిన స్థాయిలో ఉన్న రాష్ట్రాన్ని, అప్పుల కుప్పగా చేశారని అన్నారు. ఇప్పుడిప్పుడే తాము అన్నీ చక్కబెడుతున్నట్లు రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రజలకు ఈ సభ ద్వారా నిజాలు తెలియాలి, మీరు చేసిన నిర్వాకాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉందని అభిప్రాయపడ్డారు. అప్పు తెచ్చి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కట్టారు.
ఇంతవరకు ఎన్జీటీ క్లియరెన్స్ లేదు. అసలు ఏ అప్రూవల్ లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్టు మొదలుపెట్టారని విమర్శించారు. ఆనాడు మంత్రులుగా ఉన్న ఎవరికీ కేసీఆర్‌కు ఎదురు చెప్పే దమ్ము, ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అయినా, యాదాద్రి పవర్ ప్లాంట్ అయినా, రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు అయినా ఒకే ఒక్కడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని నిర్మాణం మొదలుపెట్టాడని ఎద్దేవా చేశారు. పదిమంది సలహాలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి సూచనలు ఇచ్చే స్వేచ్ఛ మాతోపాటు ప్రతిపక్ష సభ్యులకు కూడా ఉందని అన్నారు. కానీ బీఆర్ఎస్ పాలనలో ఈ పరిస్థితి లేదని గుర్తుచేశారు.