Tiger terror : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాను వణికిస్తున్న పులి
మ్యాన్ ఈటర్ గా మారిన పెద్దపులి(Tiger)కుమరం భీం ఆసిఫాబాద్(Komuram Bheem Asifabad district)జిల్లా వాసులను హడలెత్తిస్తోంది.
దిశ, వెబ్ డెస్క్ : మ్యాన్ ఈటర్ గా మారిన పెద్దపులి(Tiger)కుమరం భీం ఆసిఫాబాద్(Komuram Bheem Asifabad district)జిల్లా వాసులను హడలెత్తిస్తోంది. పులి జాడ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో, డ్రోన్ కెమెరాలతో గాలిస్తున్నారు. పులి ఎప్పుడు ఎక్కడికి వస్తుందో తెలియక బాధిత గ్రామాల ప్రజలు కంటిమీద కునుకులేకుండా భయంతో వణికిపోతున్నారు. కాగజ్‌నగర్ మండలంలోని ఓ పత్తి చేనులో శుక్రవారం ఓ యువతిని పొట్టనపెట్టుకున్న పెద్ద పులి.. సిర్పూరు టౌన్ దుబ్బగూడ సమీపంలో తన పొలంలో పత్తి ఏరుకుంటున్న రౌతు సురేశ్ అనే రైతుపై వెనుక నుంచి దాడి చేసింది. పక్కనే ఉన్న సురేశ్ భార్య వేసిన కేకలకు సమీపంలోని పొల్లాల్లో ఉన్నవారు కూడా అక్కడి చేరుకుని గట్టిగా కేకలు వేయడంతో పులి పారిపోయింది. మంచిర్యాల ఆస్పత్రిలో సురేశ్ కోలుకుంటున్నారు. పులి లేగ దూడను చంపి ఎద్దుపై దాడి చేసింది. పెద్దపులి వరుస దాడులతో అప్రమత్తమైన రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు పులి జాడ కోసం గాలింపు ముమ్మరం చేశారు.
పులి సంచరించే అవకాశమున్న గ్రామాల్లో 144 సెక్షన్ అమలు చేస్తునే పులి జాడ కోసం డ్రోన్ల సాయంతో వెతుకుతున్నారు. ప్రజలకు పులి దాడుల నుంచి రక్షించుకునేందుకు మాస్కులను పంపిణి చేస్తున్నారు. పులి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారుల సూచనలను పాటించాలని పిలుపునిచ్చారు. సిర్పూర్ టి మండలం ఇటిక్యాల పహాడ్ శివారులో పులి సంచారం కలకలం రేపుతోంది. ఈ క్రమంలో కెనాల్ ఏరియాలో పులి పాద ముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పులి మానిటరింగ్ కోసం 10 ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేశారు. మహారాష్ట్రకు రెండు కిలో మీటర్లు దూరంలో పులి ఉన్నట్లు గుర్తించారు. కాగజ్ నగర్ అటవీ శాఖ రేంజ్ పరిధిలోని సిర్పూర్ టీ అటవీ ప్రాంతంలో 25 బృందాలు, 30 ట్రాప్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో అటవి ప్రాంతాలను అటవీ శాఖ అధికారులు జల్లెడ పడుతున్నారు.