గొర్రెల స్కీమ్‌లో కేంద్రం ఇస్తున్న వాటాను దాస్తున్న స్టేట్ సర్కా్ర్!
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గొల్ల కుర్మలకు సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 5న సెకండ్ ఫేజ్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నది.
గొర్రెల పంపిణీ పథకం పూర్తిగా తమ స్కీమ్‌గానే చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం అందులో కేంద్రం ఇస్తున్న వాటాను మాత్రం దాస్తున్నది. పథకంలో సెంట్రల్ షేర్ 20%, లబ్ధిదారుడి వాటా 25% పోనూ..కేవలం 55 శాతం మాత్రమే స్టేట్ గవర్నమెంట్ భరిస్తున్నది. కానీ 75 శాతం సబ్సిడీ రాష్ట్ర సర్కారే భరిస్తున్నట్లు మంత్రులు చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గొల్ల కుర్మలకు సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 5న సెకండ్ ఫేజ్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నది. అయితే కేంద్ర సహకార మంత్రిత్వశాఖ పరిధిలోని ఎన్సీడీసీ (నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) తరఫున అమలవుతున్న స్కీమ్ ద్వారా వచ్చే సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకానికి వినియోగిస్తున్నది. యాదవ, గొల్ల, కుర్మ కులాలకు చెందినవారికి సహకార సొసైటీల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. ఫస్ట్ ఫేజ్‌లో మొత్తం 3,93,552 మందికి గొర్రెలు, మేకలను పంపిణీ చేశామని, ఇందుకు రూ. 5,001.53 కోట్లను ఖర్చు చేసినట్లు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఈ ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన అసెంబ్లీ వేదికగా బదులిచ్చారు. ఒక్కో యూనిట్‌కు 20 మేకలు, ఒక పొట్టేలు చొప్పున మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 75% సబ్సిడీతో రూ. 3,751.15 కోట్లను ఖర్చు చేసినట్లు ప్రకటించారు. కానీ ఇందులో కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
వాటాలు ఇలా..
గొర్రెల పంపిణీ స్కీమ్ కు 75% సబ్సిడీ ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటున్నది. లబ్ధిదారులు వారి వాటాగా 25% భరిస్తున్నట్లు చెప్తున్నది. కానీ 75% సబ్సిడీలో రాష్ట్ర సర్కారు భరిస్తున్నది కేవలం 55% మాత్రమే. మిగిలిన 20% కేంద్ర ప్రభుత్వం తరఫున గ్రాంటుగా ఎన్సీడీసీ ఇస్తున్నది. ఈ స్కీమ్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వానిదే అని మంత్రులు చెప్పుకుంటూ కేంద్ర గ్రాంట్ విషయం బయటకు రాకుండా తొక్కిపెడుతున్నారు. చివరకు లబ్ధిదారులకు కూడా పూర్తి విషయాలు చేరడంలేదు. రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్‌గా చెప్పుకుని ఆ సెక్షన్ ఓట్లను రాబట్టుకునే ప్రయత్నం జరుగుతున్నది. మొత్తం రెండు ఫేజ్‌లలో కలిపి కేంద్రం నుంచి ఎన్సీడీసీ ద్వారా రూ. 2,225 కోట్లు గ్రాంట్ల రూపంలో ఈ స్కీమ్‌కు చేకూరింది.
మేం వెయ్యి కోట్లు సబ్సిడీ ఇచ్చాం : ఎన్సీడీసీ
గొర్రెల పంపిణీ ఫస్ట్ ఫేజ్ కోసం రూ. వెయ్యి కోట్లను కేంద్ర ప్రభుత్వ సబ్సిడీగా సమకూర్చినట్లు ఎన్సీడీసీ వెల్లడించింది. ఈ విషయాన్ని తన వార్షిక నివేదిక (2021-22)లో పేర్కొన్నది. తెలంగాణ ప్రభుత్వానికి ఈ స్కీమ్ కింద 2016-17లోనే రూ. 4,000 కోట్ల మేర ఆర్థిక సాయాన్ని మంజూరు చేసిందని, ఇందులో వెయ్యి కోట్లు కేంద్ర ప్రభుత్వ (సీఎస్ఐఎస్ఏసీ) కింద సబ్సిడీగా ఇస్తున్నట్లు పేర్కొన్నది. మిగిలిన రూ. 3,000 కోట్లను మాత్రం ఎన్సీడీసీ తరఫున రుణంగా ఇస్తున్నట్లు వివరించింది. మొత్తం స్కీమ్‌కు ఫస్ట్ ఫేజ్‌లో రూ. 5,000 కోట్లు ఖర్చు కానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిందని, రాష్ట్రంలోని 30 జిల్లాల్లోని సుమారు నాలుగు లక్షల మందికి లబ్ధి కలుగుతున్నట్లు పేర్కొన్నదని గుర్తుచేసింది. చివరకు మంజూరు చేసిన మొత్తంలోరూ. 3,955.91 కోట్లను విడుదల చేసినట్లు తెలిపింది.
సబ్సిడీ, రుణాలు
ఫస్ట్ ఫేజ్ కోసం ఎన్సీడీసీ తీసుకున్న రూ. 3,955.91 కోట్లలో వెయ్యి కోట్ల మేర కేంద్ర గ్రాంట్ కింద పోగా మిగిలిన రూ. 2,955.91 కోట్లు తెలంగాణకు రుణంగా వచ్చింది. మొత్తం 16 వాయిదాల్లో దీన్ని చెల్లించాలన్న నిబంధనల్లో భాగంగా రాష్ట్రం 12 ఇన్‌స్టాల్‌మెంట్లలో ఇప్పటికే చెల్లింపు చేసింది. రుణంలో రూ. 2,626 కోట్లు అసలు (ప్రిన్సిపల్) కింద, రూ. 1,442 కోట్లు వడ్డీ కింద చెల్లించింది. ఇంకా నాలుగు వాయిదాలను చెల్లించాల్సి ఉన్నది. మరోవైపు సెకండ్ ఫేజ్ అమలు కోసం ఎన్సీడీసీతో గతేడాది జూన్‌లో జరిగిన సంప్రదింపుల ప్రకారం రూ. 4,563 కోట్లకు అంగీకారం కుదిరింది. ఇందులో 20% మేర కేంద్ర సబ్సిడీగా ఉండనున్నది. మిగిలింది రుణంగా తీసుకుంటుంది. ఇప్పటికింకా ఎన్సీడీసీ నుంచి నిధులు విడుదల కాకపోవడంతో పరిమితంగానే ఈ స్కీమ్‌ను రాష్ట్ర ప్రభుత్వం సొంత వాటా (55%)తో ప్రారంభించనున్నది.
జూన్ 5 నుంచి సెకండ్ ఫేజ్
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెకండ్ ఫేజ్ గొర్రెల పంపిణీ స్కీమ్‌ను జూన్ 5న లాంఛనంగా ప్రారంభించనున్నట్లు షెడ్యూలు ఖరారైంది. ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ నల్లగొండ జిల్లాల్లో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ప్రకటన వెలువడింది. మొదటి ఫేజ్‌లో ఒక్కో లబ్దిదారునికి అందిస్తున్న యూనిట్ ఖర్చు రూ. 1.25 లక్షలుకాగా, సెకండ్ ఫేజ్‌లో మాత్రం దీన్ని రూ. 50 వేల మేర పెంచి రూ. 1.75 లక్షలకు ఖరారు చేసింది. దీంతో లబ్ధిదారులు వారి వాటాగా 25% చొప్పున చెల్లించే మొత్తం, కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ కూడా పెరుగుతున్నది. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ వేదికగానే మంత్రి తలసాని సెకండ్ ఫేజ్‌ను మార్చి నెలలోనే ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. కానీ చివరకు జూన్ 5న ప్రారంభమవుతున్నది.