పీపీసీ చీఫ్ ఆలోచన సూపర్ సక్సెస్.. జిల్లాలకూ వెళ్లనున్న స్పెషల్ ప్రోగ్రామ్

హైదరాబాద్ గాంధీభవన్లో ఏర్పాటు చేస్తున్న ‘మంత్రుల ముఖాముఖీ’ కార్యక్రమానికి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది.

Update: 2024-09-27 02:11 GMT

దిశ; తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ గాంధీభవన్లో ఏర్పాటు చేస్తున్న ‘మంత్రుల ముఖాముఖీ’ కార్యక్రమానికి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. పీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆలోచనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం.. పార్టీ కార్యకర్తలతో పాటు, ప్రజల్లోనూ భరోసా కల్పిస్తుందని పీసీసీ నేతలు చెబుతున్నారు. సామాన్యులంతా నేరుగా తమ సమస్యను మంత్రికే చె ప్పుకునేందుకు అవకాశం కల్పించడంతో పబ్లిక్ భారీగా క్యూ కడుతున్నారు. ఫస్ట్ డే ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా హాజరు కాగా, ఏకంగా రెండు వందల మందికి పైగా తమ అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో కొన్ని స్పాట్ లోనే పరిష్కారం కాగా, మరి కొన్నింటిని సంబంధిత శాఖా అధికారులకు మంత్రి నేరుగా రిఫర్ చేశారు. ఈ నెల 25న నిర్వహించిన ముఖాముఖీలో పార్టీ కార్యకర్తలతో పాటు వివిధ జిల్లాలకు చెందిన సాధారణ ప్రజలు కూడా వచ్చారు. ప్రతి అప్లికేషన్ ను క్షుణ్ణంగా పరిశీలించిన మంత్రి దామోదర రాజనర్సింహా.. వైద్యం కొరకు వచ్చిన బాధితులను ఉస్మానియా, నిమ్స్, గాంధీ ఆసుపత్రులకు సిఫారసు చేశారు.

అప్లికేషన్లు ఎంట్రీ.. ఫాలో అప్?

మంత్రుల దృష్టికి వచ్చిన ప్రతి అప్లికేషన్ ను ఎంట్రీ చేస్తున్న ప్రత్యేక స్టాఫ్, పరిష్కారం కోసం ఫాలో అప్ కూడా చేస్తుందని టీపీసీసీ పేర్కొంది. సదరు స్టేటస్ ను మంత్రికి కూడా తెలియజేస్తున్నట్లు పార్టీ వర్గాలు వివరించారు. ఒకే మంత్రి దగ్గర్నుంచి అన్ని శాఖలకు ఆదేశాలు సులువుగా వెళ్తుండటంతో కార్యకర్తలు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన ఓ సీనియర్ కార్యకర్త తన ఆరోగ్యం బాగోలేక మంత్రికి తెలిపారు. ఇది అద్భుతమైన కార్యక్రమమని పలువురు కార్యకర్తలు సోషల్ మీడియాల్లోనూ అభినందనల వర్షం కురిపిస్తున్నారు.

జిల్లాల్లోనూ..?

గాంధీభవన్ లో మొదలైన మంత్రుల విజిట్ కార్యక్రమం, త్వరలో జిల్లాల్లోనూ నిర్వహించాలని పార్టీ ప్లాన్ చేస్తున్నది. జిల్లా పార్టీ కార్యాలయాల్లో ఇన్చార్జీ మంత్రి, జిల్లా మంత్రులు, డీసీసీల నేతృత్వంలో కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లనున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొత్తపార్టీ కార్యాలయాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం స్థలం కొనుగోలు, సేకరణ వంటి అంశాలపై కొత్త పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక వినతి పత్రాన్ని అందించనున్నారు.

సీఎం ఆరా..?

‘మంత్రుల ముఖాముఖీ ప్రోగ్రామ్ అనుభవం, స్పందన ఎలా ఉన్నదే అన్నా’’ అని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహాను సీఎం రేవంత్ రెడ్డి అడిగినట్లు సమాచారం. మంత్రి దాదాపు మూడు గంటలకు పైనే గాంధీభవన్ లో కూర్చొని పబ్లిక్, కార్యకర్తలను అడ్రస్ చేస్తూ, సమస్యలపై అప్లికేషన్లు తీసుకోవడంపై సీఎం సంతోషించారు. మంత్రి దామోదర రాజనర్సింహను అభినందించారు. తమకు ఈ పదవులు రావడానికి కారణమైన కార్యకర్తలను కాపాడుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం అంటూ సీఎం గుర్తు చేసినట్లు తెలిసింది. అయితే పదేళ్ల పెండింగ్ సమస్యలు భారీగా వస్తుండటంతో, వేగంగా పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని ఉన్నతాధికారులకు సీఎం, మంత్రి ఆదేశాలిచ్చినట్లు సమాచారం. పదేళ్ల నుంచి కార్యకర్తలు ఎదుర్కొన్న కష్టాలను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహాలు ఒకరికి ఒకరు షేర్ చేసుకున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్లస్...?

కార్యకర్తలను కాపాడుకుంటేనే స్థానిక సంస్థల్లో బలంగా కొట్లాడవచ్చని పార్టీ భావిస్తోంది. పదేళ్ల నుంచి పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు ప్రభుత్వం అండగా నిలిచి, హెల్త్, వెల్ఫేర్ ను అందించాలని పార్టీ నిర్ణయం తీసుకున్నది. తద్వారా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో జరిగే లోకల్ బాడీ ఎన్నికల్లో కార్యకర్తలంతా మరింత సీరియస్ గా పనిచేస్తారనేది పార్టీ ఆలోచన. దీంతోనే మంత్రుల ముఖాముఖీ కార్యక్రమాన్ని సీరియస్ గా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే నెల రోజుల షెడ్యూల్ ను కూడా గాంధీభవన్ వర్గాలు విడుదల చేశాయి.

పదేళ్లు పిప్పిచేశారు: మంత్రి దామోదర

“బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడమే కా కుండా, ప్రజలను పిప్పి చేసింది. అసలు సమస్యలను వినేందుకు కనీసం ఒక్క నేత కూడా ముం దుకు రాలేదు. గడీలలో దాచుకొని పాలించారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు కేసీఆర్ అండ్ టీమ్ ను గడీల నుంచి బయటకు రాకుండా బూడిద చేశారు. ఇప్పుడు తమ ప్రభుత్వం రావడంతో కార్యకర్తలను, ప్రజలను సమన్వయంతో కాపాడుకుంటున్నాం. ఈ ప్రోగ్రాం ద్వారా మేలు జరుగుతుంది. మాకు తృప్తిని ఇస్తుంది’’


Similar News