CM Revanth: ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం సీరియస్.. అధికారులకు కీలక ఆదేశాలు

విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో పొరపాట్లు జరగకుండా చూడాలని పలుమార్లు ఆదేశాలిచ్చినా.. మళ్లీ అలాంటి ఘటనలే జరుగుతుండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల‌కు ఆహారం అందించే విష‌యంలో ఉదాశీనంగా వ్యవ‌హ‌రించే అధికారులు, సిబ్బందిపై చ‌ర్యలు తప్పవని హెచ్చరించారు.

Update: 2024-11-28 05:43 GMT

దిశ, వెబ్ డెస్క్: వసతి గృహాల్లో వెలుగు చూస్తున్న ఫుడ్ పాయిజన్ (Food Poison ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో నాణ్యత పాటించాలని ఎన్నిసార్లు సూచించినా.. నాణ్యత లేని ఆహారం అందించడంపై సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ స్కూల్స్, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల్ని కన్నబిడ్డల్లా చూసుకోవాలని, పౌష్టిక ఆహారం అందించే విషయం అలసత్వానికి, ఆలస్యానికి తావు ఇవ్వొద్దని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. తరచూ పాఠశాలలు, గురుకులాలను తనిఖీ చేయాలని తెలిపారు. అలాగే.. మాగనూర్ ఘటనలో బాధ్యులైన వారిపై వేటు వేసి, సంబంధిత నివేదికలను సమర్పించాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.

విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో పొరపాట్లు జరగకుండా చూడాలని పలుమార్లు ఆదేశాలిచ్చినా.. మళ్లీ అలాంటి ఘటనలే జరుగుతుండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల‌కు ఆహారం అందించే విష‌యంలో ఉదాశీనంగా వ్యవ‌హ‌రించే అధికారులు, సిబ్బందిపై చ‌ర్యలు తప్పవని హెచ్చరించారు. లేని వార్తలను ప్రచారం చేస్తూ విద్యార్థుల త‌ల్లిదండ్రుల్లో భ‌యాందోళ‌న‌లు సృష్టిస్తున్నార‌ని.. వారిపైనా క‌ఠిన చ‌ర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌కు ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యార్థుల‌కు ఆహారం అందించే విష‌యంలో ఎవ‌రైనా నిర్లక్ష్యంగా వ్యవ‌హ‌రించిన‌ట్లు రుజువైతే వారిని ఉద్యోగాల నుంచి తొల‌గించేందుకు వెనుకాడ‌మ‌ని సీఎం స్పష్టం చేశారు.

విద్యార్థుల‌కు మంచి విద్య అందించాల‌నే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉపాధ్యాయుల నియామ‌కాలు చేప‌ట్టడంతో పాటు వారికి పౌష్టికాహారం అందించేందుకు డైట్ ఛార్జీలు పెంచిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు. విద్యార్థుల విష‌యంలో తాము సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ కొంద‌రు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయ‌త్నిస్తున్నార‌ని, అటువంటి శ‌క్తుల విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని, బాధ్యులైన వారిని చ‌ట్టప్రకారం శిక్షిస్తామ‌ని ముఖ్యమంత్రి హెచ్చరించారు. వ‌స‌తిగృహాల్లో ఆహారం విష‌యంలో కొంద‌రు ఉద్దేశ‌పూర్వకంగా పుకార్లు సృష్టించ‌డంతో పాటు లేని వార్తలను ప్రచారం చేస్తూ విద్యార్థుల త‌ల్లిదండ్రుల్లో భ‌యాందోళ‌న‌లు సృష్టిస్తున్నార‌ని.. వారిపైనా క‌ఠిన చ‌ర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.


Similar News