Telangana: ఆడుకుంటూ రైలెక్కిన చిన్నారులు.. చివరికి ఏం జరిగిందంటే..?

లోకం తెలియని పసిపిల్లలకి ఆటలే ప్రపంచం.

Update: 2024-07-03 08:29 GMT

దిశ వెబ్ డెస్క్: లోకం తెలియని పసిపిల్లలకి ఆటలే ప్రపంచం. అలా ఆడుకుంటూ ఎక్కడికంటే అక్కడికి వెళ్లిపోయి ప్రమాదంలో చిక్కుకుంటూ ఉంటారు. ఇలా చిన్నారులు ఆడుకుంటూ అదృశ్యమైన ఘటనలు కోకొల్లలు. అలాంటి ఘటనే తాజాగా మరోసారి తెలంగాణలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇద్దరు చిన్నారులు బుద్వేల్‌ రైల్వేస్టేషన్‌ బయట ఎక్కెక్కి ఏడుస్తూ, ఎటు వెళ్లాలో తెలియక అటు ఇటు తిరుగుతుండగా, వారిని ట్రాఫిక్ పోలీసులు రక్షించారు.

ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ బిల్లా కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు శంషాబాద్‌ నుండి ఉందానగర్‌ మీదుగా వచ్చిన రైలు నుండి కార్తిక్‌(6), అఖిల్‌(4) అనే ఇద్దరు బాలురు బుద్వేల్‌ రైల్వేస్టేషన్‌లో దిగినట్టు తెలిపారు. అనంతరం ఆ ఇద్దరు పిల్లలు రైల్వేస్టేషన్‌ నుండి బయటకు వచ్చారని.. ఆ సయమంలో వారికి ఎటు పోవాలో అర్థంకాక ఏడుస్తూ ఆరాంఘర్‌ చౌరస్తా దాటుతున్న తరుణంలో ఓ ఆటోవాల నడుచుకుంటూ వస్తున్న పిల్లల్ని అపహరించేందుకు ప్రయత్నించారని, కాగా అక్కడే డ్యూటీ చేస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లు యాదయ్య, వెంకట్‌రెడ్డి, శివలు గమనించి ఆ ఆటోవాలని పట్టుకునేందుకు యత్నంచగా అతను పారిపోయినట్టు పేర్కొన్నారు.

ఈ క్రమంలో ఈ పిసివాళ్లను రక్షించిన కానిస్టేబుల్ వారిని విచారించినా, వాళ్ల నుండి స్పష్టమైన సమాధానం రాలేదు. అయితే ఆ ఇద్దరిలో పెద్దవాడైన కార్తిక్ శంషాబాద్‌‌లో రైలు ఎక్కినట్టు తెలిపాడు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్‌ పోలీసులు హుటాహుటీన అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. అదే సమయంలో శంషాబాద్‌ శివారుకు చెందిన శైలజ కొడుకులు కనిపించకపోవడంతో కుమారుల కోసం గాలించింది.

ఎంతగా వెతికినా బిడ్డల జాడ తెలియకపోవడంతో ఆమె పోలీసులను సంప్రధించింది. కాగా అప్పటికే సమాచారం అందుకుని ఉన్న శంషాబాద్ పోలీసుల సాయంతో ఆమె రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో ఆ మహిళకి కౌన్సిలింగ్‌ పిల్లల్ని అప్పగించారు. 


Similar News