ఇంటర్ బోర్డులో అనుభవం లేని అధికారులు తిష్ట
రాష్ట్ర ఇంటర్ బోర్డులో అనుభవం లేని కొంతమంది అధికారులు తిష్ట వేసి ఉన్నారని ఇంటర్ విద్యా జేఏసీ విమర్శించింది
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఇంటర్ బోర్డులో అనుభవం లేని కొంతమంది అధికారులు తిష్ట వేసి ఉన్నారని ఇంటర్ విద్యా జేఏసీ విమర్శించింది. ఆ అధికారులు ఇంటర్ పరీక్షల్లో మంచి జరిగితే వారి గొప్పతనంగా చెబుతారని, చెడు జరిగితే జేఏసీపై నెట్టేసి నిందలు వేసేందుకు కుట్రలు పన్నారని జేఏసీ ఆరోపించింది. ఈ మేరకు శుక్రవారం జేఏసీ చైర్మన్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 15న జరగబోయే ఇంటర్ పరీక్షల్లో ఇంటర్ బోర్డుకు ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. ఆన్లైన్ వాల్యూషన్ విధానం పైన కొన్ని సమస్యలు తలెత్తవచ్చని, కావున దశలవారీగా ఆచితూచి వ్యవహరించాలని గుర్తు చేశారు.
అయినా ప్రభుత్వ నిర్ణయమే తమకు శిరోధార్యమని, అధ్యాపకులకు శిక్షణ, ఇతర సాంకేతిక సమస్యలను మరోసారి అధ్యయనం చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం ఈ విషయాలను ఎప్పటికప్పుడు ముందే సమగ్రంగా సమీక్షలు నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంటర్ పరీక్షల నిర్వహణలో చిత్తశుద్ధితో పనిచేసి.. ఇంటర్ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను అంతకుమించి పది లక్షల మంది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు హితోదిక్యంగా శ్రమించాలని శ్రేణులకు మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు.