CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో తప్పిన భారీ ప్రమాదం
సీఎం రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో భారీ ప్రమాదం తప్పింది

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టిస్తోంది. పలు జిల్లాల్లో వడగళ్లు ప్రజలను బెంబేలెత్తించాయి. గాలి తీవ్రతకు భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. అయితే హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నివాసానికి సమీపంలో ఓ భారీ కట్టడం కుప్పకూలడం కలకలం రేపింది. మాదాపూర్ మెట్రో సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ ఎలక్ట్రానిక్ షో రూమ్ ఎలివేషన్ పనుల కోసం నిర్మించిన సపోర్ట్ ఐరన్ రాడ్స్ (Collapsed iron rods) గత అర్థరాత్రి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటన సీఎం నివాసానికి కూతవేటు దూరంలో జరిగింది. అప్పటి వరకు అక్కడ 30 మంది కార్మికులు పని చేస్తున్నారని, వర్షం కారణంగా వారంతో లోపలి వైపు వెళ్లగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కూలిపోయిన ఐరన్ రాడ్లు అన్ని రోడ్డు వైపున పడిపోయాయి. ఇదే ప్రాంతంలో బస్డాండ్ ఉండేదని ఇటీవల బస్డాండ్ ను అధికారులు తొలగించినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది కూలిన ఐరన్ రాడ్లను తొలగించారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతం కావడంతో జనసంచారం ఉన్న సమయంలో ఈ ఘటన జరిగి ఉంటే ప్రమాద తీవ్రత పెద్దగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు.