కాంగ్రెస్ వ్యూహం భారీ సక్సెస్.. KCR స్ట్రాటజీతోనే బీఆర్ఎస్‌ను దెబ్బకొట్టిన సీఎం రేవంత్..!

రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య ప్రస్తుతం 74కు చేరుకున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్.. మ్యాజిక్ ఫిగర్

Update: 2024-07-14 02:44 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య ప్రస్తుతం 74కు చేరుకున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్.. మ్యాజిక్ ఫిగర్ కన్నా అధికంగా కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించడంతో ఆ సంఖ్య 65కు చేరింది. మరోవైపు సీపీఐతో కుదిరిన ప్రీ-ఎలక్షన్ భాగస్వామ్యంతో గెలిచిన ఆ పార్టీ ఎమ్మెల్యే సపోర్టు ఎలాగో ఉన్నది. అప్పటికే అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం మొదలెట్టాయి. ‘ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు.. ఆరు నెలల్లో కూలిపోక తప్పదు..’ అంటూ కామెంట్స్ చేశాయి.

వీటిపై సీరియస్ అయిన సీఎం రేవంత్.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేస్తామనడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, అలాంటి ఆటలు సాగనివ్వమంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. అనంతరం ‘ఆపరేషన్ ఆకర్ష్’ వ్యూహానికి కాంగ్రెస్ పదును పెట్టింది. దీంతో అప్పటి నుంచి నేటి వరకు బీఆర్ఎస్ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 74కు చేరుకుంది. ఈ సంఖ్యతో సేఫ్ జోన్‌లోకి వచ్చిన కాంగ్రెస్.. ఈ నెలాఖరుకు మరింత శక్తివంతంగా మారనున్నది.

కౌంటర్ వ్యూహం

బీజేపీ, బీఆర్ఎస్ నేతల కామెంట్లతో అలర్టయిన అధికార పార్టీ.. మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే ఎపిసోడ్ మొదలు 11 రాష్ట్రాల్లో జరిగిన ఘటనలను పరిగణనలోకి తీసుకున్నది. తెలంగాణలో అలాంటిది రిపీట్ కాకుండా పకడ్బందీగా వ్యవహరించింది. బీఆర్ఎస్, బీజేపీ కుట్రలకు పాల్పడే ప్రమాదముందని గ్రహించిన టీ కాంగ్రెస్.. ఏఐసీసీతో సంప్రదింపులు జరిపిన తర్వాత వలసలను ఆకర్షించే వ్యూహానికి పదునుపెట్టింది. ఒకవైపు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య స్నేహం కొనసాగుతూ ఉన్నదని ఓపెన్‌గానే సీఎం రేవంత్ కామెంట్స్ చేస్తూనే.. ఆ రెండు పార్టీలు జాయింట్‌గా చేసే కుట్రలకు రాజకీయంగా బ్రేక్ వేయడంలో కౌంటర్ వ్యూహాన్ని మొదలు పెట్టారు.

బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలకు ఆస్కారం లేకుండా ముందస్తు స్ట్రాటజీతో గులాబీ పార్టీకి చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకున్నారు. రానున్న రోజుల్లో మరో డజను మందిపైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేలా చేస్తున్న కసరత్తు ముగింపు దశకు చేరుకున్నది. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ పూర్తయ్యే నాటికి బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు అడుగులు పడుతున్నాయి. మొత్తం 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ గూటికి చేర్చుకోవాలని అధికార పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటికే తొమ్మిది మందిని చేర్చుకోగా.. మరో 17 మందిని చేర్చుకుని బీఆర్ఎస్ ఎల్పీ విలీనంతో దీనికి ముగింపు పలకాలని భావిస్తున్నది. కాంగ్రెస్ అనుకున్న వ్యూహం పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 90 మార్కు దాటుతుంది.

కాంగ్రెస్‌లో పెరిగిన ధీమా

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడం సాధ్యంకాదనే మెసేజ్ తెలంగాణ సమాజానికి వెళ్లిపోయింది. ఇకపైన అలాంటి ప్రయత్నాలు చేసే అవకాశం బీజేపీ, బీఆర్ఎస్‌కు లేకుండా పోయాయని హస్తం నేతలు ధీమాతో ఉన్నారు. బీఆర్ఎస్‌ పార్టీలో ప్రస్తుతం 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. ఆ పార్టీలో చివరకు మిగిలేది నలుగురైదుగురు మాత్రమేనని కాంగ్రెస్ నేతలు పదేపదే వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో బీజేపీవైపు ఎవ్వరూ వెళ్లే చాన్స్ లేదని, శాసనసభాపక్షం విలీనానికి అవసరమైన సంఖ్య కన్నా ఎక్కువ మందే కాంగ్రెస్‌లోకి వచ్చి చేరుతారన్నది హస్తం పార్టీ నేతల వాదన.

కేసీఆర్ అనుసరించిన వ్యూహన్నే రేవంత్ సైతం..

బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసిన గులాబీ పార్టీ ఇప్పుడు అదే తరహా ఫలితాన్ని రుచి చూస్తున్నది. మొదటి దఫాలో మ్యాజిక్ ఫిగర్‌కు మూడు సీట్లు మాత్రమే ఎక్కువ తెచ్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్.. కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నది. స్థిరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే చేర్చుకున్నట్టు అప్పట్లో గులాబీ నేతలు సమర్ధించుకున్నారు. రెండోసారి గులాబీ పార్టీకి 88 సీట్లు వచ్చినా కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేసేందుకు హస్తం పార్టీకి చెందిన పన్నెండు మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నది.

వీటిని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. అప్పుడు కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్నే ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి అమలు చేస్తూ ఆ పార్టీని డిఫెన్సులోకి నెట్టారు. ఆ బాధను కేసీఆర్ స్వయంగా స్వయంగా అనుభవించాలని ఓ కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించడం గమనార్హం. అప్పట్లో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరుతూ ఉంటే.. ‘మేం చేర్చుకోవడట్లేదు.. స్వచ్చందంగా వారే వచ్చి చేరుతున్నారు.. నియోజకవర్గాల అభివృద్ధి కోసం వచ్చారు..’ అంటూ కేసీఆర్, కేటీఆర్ అసెంబ్లీ వేదికగానే ఫిరాయింపులపై వివరణ ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ సైతం అదే పాట పాడుతుండడంతో అప్పటి పరిస్థితులను సమర్ధించుకోలేక.. ఇప్పటి పరిణామాలను జీర్ణించుకోలేక గులాబీ లీడర్లు కన్‌ప్యూజన్‌లో పడ్డారు.

అసెంబ్లీలో కాంగ్రెస్ బలం ఎవ్వరూ ఊహించని తీరులో పెరుగుతుండడంతో రానున్న రోజుల్లో సెంచరీ మార్కు చేరినా ఆశ్చర్యం లేదని ఓ కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు. దీంతో బీఆర్ఎస్‌ బలం నలుగురికే పరిమితమవుతుందనే కామెంట్లను ఆయన ధ్రువీకరించినట్లయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరం చేసే అవకాశాలే లేవని, ఇప్పటివరకూ బెదిరించిన బీజేపీ, బీఆర్ఎస్‌ పెద్దలు వారి సభ్యులను కాపాడుకోవడంపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని సదరు నేత చెప్పుకొచ్చారు.


Tags:    

Similar News