Ponguleti: అందుకోసమే కొత్త రెవెన్యూ చట్టం.. క్లారిటీ ఇచ్చిన పొంగులేటి

వీఆర్వో వ్యవస్థపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-19 10:25 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: వీఆర్వోల అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. వీఆర్వోలుగా పని చేసిన వారిని తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలనే తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని విజ్ఞప్తి చేసింది. రెవెన్యూ వ్యవస్థపై గతంలో ఎన్నోసార్లు కుట్ర జరిగిందని కానీ ఈ శాఖను కాపాడింది మాత్రం కాంగ్రెస్ పార్టీనే అని ట్రెసా ప్రతినిధులు చెప్పారు. శాఖాపరమైన తప్పొ్ప్పులు ఉంటే పటిష్టమైన చట్టం తీసుకువచ్చి సరిచేయాలని అవినీతి రహిత పాలనకు మేమంతా ఏకాభిప్రాయంతో మద్దతుఇస్తున్నామన్నారు. అదే సమయంలో మాకూ ఆత్మగౌరవంతో బతికే అవకాశం ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వం తమను దొంగల్లా చిత్రీకరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకురాబోయే కొత్త రెవెన్యూ చట్టాన్ని గ్రామీణ స్థాయిలో రైతులకు మేలు చేకూర్చేలా పకడ్బందీగా అమలు చేసే బాధ్యత తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాపై సోమవారం బేగంపేట హరిత ప్లాజా హోటల్ లో ట్రెసా ఆధ్వర్యంలో చర్చ వేదిక జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిప్యూటీ కలెక్టర్లు, ట్రెసా ప్రతినిధులు హాజరైన ఈ కార్యక్రమంలో కొత్త రెవెన్యూ చట్టంపై సలహాలు, సూచనలను అధికారులు స్వీకరిస్తున్నారు.

బీఆర్ఎస్ నేతలను ఆ దేవుడు కూడా క్షమించడు:

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. వేసే అడుగు వల్ల సామాన్య ప్రజలకు, భూస్వాములకు, రైతులకు మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం జరగకూడదనేది ఈ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నిదానంగా అడుగులు వేస్తున్నామన్నారు. రాత్రికి రాత్రే అద్భుతాలు చేసి విఫలం కావొద్దనేది సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ ఆలోచన అన్నారు. గత ప్రభుత్వాలు తీసుకువచ్చిన చట్టాల ఫలితాలు మంచికి బదులు చెడు చేశాయన్నారు. గత ప్రభుత్వంలో ఒకరిద్దరు తీసుకున్న నిర్ణయం వల్ల కొన్ని లక్షల మంది చెడును అనుభవించారని ఆరోపించారు. సబ్ కమిటీల ద్వారా ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదన్న విమర్శలకు స్పందించిన మంత్రి.. నిజంగా ఆ ఉద్దేశమే మా ప్రభుత్వానికి ఉంటే సబ్ కమిటీని కూడా వేసే వారిమి కాదన్నారు. కొత్త రెవెన్యూ చట్టం ఆమోదించుకోవాలనుకుంటే మొన్నటి అసెంబ్లీలోనే జరిగిపోయేది. కానీ లొసుగులు లేని చట్టం తీసుకురావాలనే ఉద్దేశంతో అందరి అభిప్రాయాలను తీసుకుంటున్నామన్నారు. ధరణి కాన్సెప్టే మార్పు కావాలనే దానికి నిదర్శనం అన్నారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని మనమంతా ఓపెన్ గా చెప్పామని దీనికే ప్రజలు మద్దతు ఇచ్చారన్నారు. తప్పుచేసిందే కాకుండా ఆ తప్పును సరిదిద్దికోకుండా బుకాయిస్తున్నారని బీఆర్ఎస్ నేతలను ఆ దేవుడు కూడా క్షమించడన్నారు. తమ తప్పులను ఇకనైనా గ్రహిస్తే భవిష్యత్ లో నైనా కొంత స్థానమైనా ప్రజల్లో దక్కుతుంది. కానీ విస్మరిస్తే మొన్నటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కంటే ఘోరమైన ఫలితాలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ చట్టంలోని లొసుగులను తెలుసుకోవడంతో పాటు సామాన్యుల నుంచి మేధావుల వరకు అభిప్రాయాలను తీసుకుంటున్నామన్నారు. పదవులు ఎవరికి శాశ్వతం కాదని కానీ తన హయంలో తీసుకువస్తున్న చట్టంలో ఎలాంటి లొసుగులు లేకుండా తీసుకురావాలన్నదే తన ఉద్దేశం అన్నారు. సామాన్యుల నుంచి అనేక సలహాలు, సూచనలు వస్తున్నాయని తుది చట్టం ఈ దేశానికి ఓ మోడల్ గా ఉండేలా ఉండాలనేది ఇందిరమ్మ ప్రభుత్వం లక్ష్యం అన్నారు.

త్వరలో ప్రమోషన్ల క్యాలెండర్ విడుదల:

రెవెన్యూ వ్యవస్థలోని సమస్యలు, ప్రమోషన్ల అంశాలు తమ దృష్టికి వచ్చిందన్నారు. గత ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిని కలవాలంటేనే కనీసం వారం రోజులు పట్టేదని కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదన్నారు. మీరు మేము కలిసి పని చేసే విషయంలో ఈ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవన్నారు. ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న ఆలస్యం జరిగినా పక్కాగా ఉండేలా తీసుకుంటామన్నారు. ఈ రాష్ట్రంలో సుమారు 10,954 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. గత సీఎం వ్యక్తిగత కారణాల వల్ల వీఆర్వో, వీఆర్ఏలను ఇతర శాఖల్లోకి పంపించారు. కానీ గ్రామానికి రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారి ఎవరైనా ఉన్నారా అనే ఆలోచన లేకపోవడం బాధాకరం అన్నారు. రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసి గౌరవించుకోవడంలో ఈ ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉందన్నారు. కొత్త చట్టం తయారు చేయబోతున్నామని దీని ద్వారా ఆర్వోఆర్ లో ఉన్న తప్పులను సవరిస్తామన్నారు. మళ్లీ రెవెన్యూ కోర్టులు ప్రారంభిస్తామని, గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పెడతామన్నారు. వీటన్నింటిని అమలు చేసే విషయంలో చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. మీకు వ్యక్తిగతంలో మీకు ఏ కష్టం ఉన్నా ఓ సోదరుడిలా మీకు నేనున్నాను. ఈ వ్యవస్థ ఒక మంచి పేరు తీసుకురావాలంటే ఒక రేవంత్ రెడ్డో, ఒక శ్రీనివాస్ రెడ్డో కలిస్తే కాదన్నారు. మా ఇద్దరి ద్వారానే ఈ వ్యవస్థ బాగుపడుతుందని అనుకుంటే అది మా ఇద్దరి అవివేకమే అవుతుందన్నారు. మనందరి కలిసి పని చేస్తేనే ప్రజలు హర్షిస్తారన్నారు. ప్రమోషన్ల విషయంలో క్యాలెండర్ విడుదల చేయబోతున్నానన్నారు. ఎవరి పైరవీలు అక్కర్లేకుండానే మీపని తీరు ఆధారంగా ప్రమోషన్లు, పోస్టులు ఇస్తామన్నారు. త్వరలోనే ఉద్యోగ సంఘాలతో భేటీ అయి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాన్నారు. ఈ చట్టం తయారు చేసే విషయంలో మరిన్ని సూచనలు చేయాలన్నారు. ఎవరికో లబ్ధి చేకూర్చడం కోసమే ఈ కొత్త చట్టం తీసుకురావడం లేదని, కేవలం తెలంగాణ రాష్ట్రంలో భూమి కలిగిన ప్రతిఒక్కరికి భరోసా కల్పించడం కోసమే ఈ కొత్త చట్టం తీసుకువస్తున్నామన్నారు.

Tags:    

Similar News