TG Govt.: భూ సమస్యలతో రైతులు ఉక్కిరిబిక్కిరి.. ‘రెవెన్యూ ట్రిబ్యునల్స్’ మస్ట్!
భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల మెనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

దిశ, తెలంగాణ బ్యూరో: భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల మెనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది.ఆ మేరకు భూభారతి చట్టంలో ఈ అంశాన్ని పొందుపర్చింది. అయితే ఆ వ్యవస్థ ఏర్పాటయ్యే దాకా.. సీసీఎల్ఏనే ట్రిబ్యునల్ బాధ్యతలు నిర్వర్తించాలన్న నిబంధన ఉన్నది. కానీ సామాన్యులెవరు హైదరాబాద్‌కు వచ్చి సీసీఎల్ఏకు మొర పెట్టుకోవడం అంత ఈజీ కాదు. ఆదిలాబాద్ నుంచి రాజధానికి వచ్చి సీసీఎల్ఏకు సమస్య చెప్పుకునేంతగా ఆర్థికంగా రైతులు ఎదగలేదు. అందుకే కనీసం ఉమ్మడి జిల్లాల వారీగానైనా అత్యవసరంగా రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉన్నది.
‘భూభారతి’ పేరుతో తప్పించుకుంటున్న అధికారులు
అన్నింటికీ భూభారతినే పరిష్కారమని ఆర్ఐలు, డీటీలు, తహశీల్దార్లు, ఆర్డీవోలు చెబుతున్నారు. ప్రస్తుతం వాళ్లు పరిష్కరించే స్థాయిలోని అప్లికేషన్లకు సైతం భూభారతి పేరిట కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆఖరికి విస్తీర్ణం మిస్సింగ్ కేసుకు కూడా కొత్త చట్టానికి ముడిపెడుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న తహశీల్దార్లు రంగారెడ్డి జిల్లాలోనూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్ట్-బీ భూ సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న రైతులు భూభారతిపై అనేక ఆశలు పెట్టుకున్నారు. అయితే కొత్త చట్టంలో ట్రిబ్యునల్స్ అంశాన్ని ప్రస్తావించడంతో.. ఇక ఎక్కువ కాలయాపన చేస్తే ప్రజల్లో నెగెటివ్ ధోరణి పెరుగుతుందని రెవెన్యూ వర్గాలు సైతం అభిప్రాయపడుతున్నాయి.
‘ఆటోలాక్’తో అనేక ఇబ్బందులు
గత ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ధరణి’ పోర్టల్ లక్షలాది మంది రైతుల జీవితాలను ‘ఆటో లాక్’ చేసింది. తరతరాలుగా వచ్చిన భూములపై హక్కులను ప్రశ్నార్థకం చేసింది. ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్ భూములను కాపాడుతామని, వాటిని ఆటోలాక్ చేస్తామని అప్పటి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ఆ తర్వాత వెంట వెంటనే జీవోల ద్వారా అమలు చేశారు. కొత్తగా రెండు విభాగాలు సమర్పించిన జాబితాలన్నింటినీ ‘ధరణి’ పోర్టల్ లో ఆటో లాక్ చేశారు. వాటిపై క్రయ విక్రయాలు జరగకుండా నిషేధించారు. భవన నిర్మాణాలకు అనుమతులను నిరాకరించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే తాతముత్తాతల కాలం నుంచి హక్కుదారులుగా ఉన్న నిజమైన హక్కుదారులను కూడా వాటిలో చేర్చడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ఏ అధికారి కూడా వారి గోడు వినిపించుకోవడం లేదు. కొన్ని ప్రాంతాల్లో ఎకరం సేకరిస్తే వారి సర్వే నంబరులోని పూర్తి భూమిని నిషేధిత జాబితాలో చేర్చారు. ఓ వైపు ప్రభుత్వానికి నష్టం కలిగించారు. మరో వైపు వేలాది మంది హక్కులను కాలరాజేస్తున్నారు. అవసరాలకు ఆ భూములు అమ్ముకోవాలనుకుంటే ధరణి పోర్టల్ అడ్డొస్తున్నది.
పరిష్కారమెప్పుడు?
అప్పట్లో పార్ట్-బీ కింద పెట్టిన 18.50 లక్షల ఎకరాలపై నేటికీ పేచి నడుస్తున్నది. ఇలాంటి అనేక భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఏర్పాటే పరిష్కార మార్గమని ఆర్వోఆర్ చట్టంలో స్పష్టం చేశారు. రెవెన్యూ రికార్డులు, ఇనాం, జాగీర్, పీఓటీ, టెనెన్సీ, ఎండోమెంట్, భూదాన్, వక్ఫ్ భూసమస్యలకు పరిష్కారం చూపేందుకు రెవెన్యూ ట్రిబ్యునల్ అత్యవసరం. భూభారతి చట్టం అమల్లోకి రాగానే ట్రిబ్యునల్స్ ఏర్పాటు ప్రక్రియను మొదలు పెట్టాలని రైతులు కోరుతున్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి అధికారికంగా భూభారతి అమల్లోకి వస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. అదే క్రమంలో కనీసం ఉమ్మడి జిల్లాకొక్కటైనా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్న డిమాండ్ వినిపిస్తున్నది.
ఐదేండ్లుగా అన్నీ బంద్
2021 సెప్టెంబర్ 7న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి సీసీఎల్ఏ రెఫరెన్స్ నం.ఏఎస్ఎస్. 1(1)/463/2020, తేదీ.7.9.2020 ద్వారా ఆదేశించారు. దీని ప్రకారం మళ్లీ ఆదేశాలు జారీ చేసే వరకు ల్యాండ్ మ్యాటర్స్ ముట్టుకోవద్దు. ఒకవేళ ఏదైనా ఆర్డర్ జారీ చేసినా చెల్లదు. ఈ ఆదేశాలను రెవెన్యూ శాఖలోని అధికారులందరికీ వర్తింపజేయాలని కలెక్టర్లకు సూచించారు. ఏదైనా ఈ ఉత్తర్వును ఉల్లంఘిస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని.. ఇది చాలా ముఖ్యమైనదంటూ చీఫ్ సెక్రటరీ, సీసీఎల్ఏ(ఎఫ్ఏసీ) సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. ఐదేండ్లయ్యింది. ఇప్పటి వరకు జారీ చేసిన ఉత్తర్వులను సమీక్షించలేదు. దీంతో ఆర్వోఆర్ మినహా అన్ని సమస్యలు పెండింగులో పడ్డాయి. ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లు చేయదగ్గ, పరిష్కరించాల్సిన కేసులన్నీ మూలకు వేశారు. ఏ ఒక్క సమస్యా పరిష్కరించడం లేదు. కనీసం ఆ ఫైలు కూడా ముట్టుకోవడం లేదు. దీంతో వేలాది మంది తమ దరఖాస్తులను పరిష్కరించాలని అధికారులకు మొర పెట్టుకుంటున్నారు. ఇనాం, జాగీర్, పీఓటీ, టెనెన్సీ వంటి కేసుల్లో నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాలు, ఓఆర్సీలు ఇచ్చే ప్రక్రియకు బ్రేకులు వేశారు. అయితే కొందరు రాజకీయ పలుకుబడిన కలిగిన పెద్దలకు, సంస్థలకు మాత్రం ఓఆర్సీలు, ఎన్వోసీలు జారీ చేశారు.
పార్ట్ –బీకి ట్రిబ్యునల్ బెటర్
తహశీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్లకు పార్ట్-బీ అప్పగించడం వల్ల మళ్లీ అప్పీల్‌కు వెళ్లాల్సి రావడం తప్పనిసరి. గతంలో వారంతా రిజెక్ట్ చేసినవి కావడం వల్లే పార్ట్-బీ కింద నమోదయ్యాయి. పైగా జిల్లా స్థాయిలోనే ట్రిబ్యునల్ ఉండడం ద్వారా కోర్టులకు భారం తగ్గుతుంది. ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ దిశగా అడుగులు వేయాలంటే సమస్యల తీవ్రతను తగ్గించుకోవాల్సిందే. అన్నింటికి సీసీఎల్ఏ వరకు వెళ్లకుండా జిల్లా స్థాయి ట్రిబ్యునల్ లోనే తేల్చుకోవడం ద్వారా రైతులకు భారం తగ్గుతుంది.
పార్ట్-బీ ల్యాండ్స్
కారణం - విస్తీర్ణం (ఎకరాల్లో)
ఆధార్ ఉండి బయోమెట్రికల్ లేనిది - 24,942
ఆధార్ తప్పులు - 29,712
ఆధార్ ఇవ్వనిది - 2,59,515
ఆధార్లేకుండా.. (ఎన్ఆర్ఐ, కంపెనీలు) - 28,392
విస్తీర్ణం తక్కువ/ఎక్కువ - 49,328
ఇనాం కింద సెటిల్ కానిది - 14,619
భూదాన్ ల్యాండ్ - 2,932
ఎండోమెంట్ - 15,994
వక్ఫ్ ల్యాండ్ - 9,632
ఫారెస్ట్ (రెవెన్యూ రికార్డుల్లో) - 34,612
ఫారెస్ట్ సరిహద్దు వివాదాలు - 21,673
ప్రభుత్వ భూమి - 93,308
గవర్నమెంట్ అసెట్, కంప్లీట్ సర్వే నంబర్ - 8,018
గవర్నమెంట్ అసెట్ పార్టిలీ సర్వే నంబర్ - 4,381
ఫుల్ సర్వే నంబర్ అక్వయిర్డ్ - 4,447
పార్టిలీ సర్వే నంబర్ అక్వయిర్డ్ - 1,822
అనధికారిక కబ్జా - 16,879
సివిల్‌కోర్టు కేసులు - 34,755
విరాసత్‌లో వివాదాలు - 29,651
ఎల్‌టీఆర్ కేసులు - 31,155
పీవోటీ కేసులు - 78,543
రెవెన్యూ కోర్టు కేసులు - 27,880
సాదాబైనామా కేసులు - 1,04,859
సోల్డ్ అవుట్ - 1,37,475
నాలా కంప్లీట్ సర్వే నంబర్లు - 1,38,139
రీజన్ నాట్ స్పెసిఫైడ్ - 5,07,091