TG High Court: చార్మినార్, హైకోర్టులను కూడా కూల్చేస్తారా..! ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు

హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.

Update: 2024-09-30 06:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైడ్రా (HYDRA) కూల్చివేతలపై హైకోర్టు (High Court) ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ మేరకు ఆ సంస్థ కమిషనర్‌ రంగనాథ్‌ (Commissioner Ranganath) వర్చువల్‌గా, అమీన్‌పూర్ తహసీల్దార్ కోర్టుకు నేరుగా హాజరయ్యారు. హైడ్రా తరపున న్యాయవాది కటిక రవీందర్ రెడ్డి, పిటినషర్ అడ్వకేట్ నరేందర్ వాదనలు వినిపించారు. ముందుగా కోర్టులో పెండింగ్‌లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారనే అంశంపై తహసీల్దార్ వివరణ ఇచ్చారు. విచారణ సందర్భంగా ధర్మాసనం ‘హైడ్రా’పై ప్రశ్నల వర్షం కురిపించింది. కేవలం శని, ఆదివారాలు, సూర్యాస్తమయం తరువాతే కూల్చివేతలు ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నించింది. సెలవు రోజుల్లోనే అందరికీ నోటీసులు ఇచ్చి అత్యవసరంగా కూల్చివేయడానికి కారణం ఏంటని అడిగింది. శని, ఆదివారాల్లో నిర్మాణాలను కూల్చివేయొద్దని గతంలో కోర్టు తీర్పులు ఉన్నాయనే విషయాన్ని ధర్మాసనం హైడ్రాకు గుర్తు చేసింది.

జనం ఇళ్లు ఖాళీ చేయనంత మాత్రాన అత్యవసరంగా కూల్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. కోర్టు ఆర్డర్ల విషయం కూడా తెలియదా అంటూ తహసీల్దార్‌ను ప్రశ్నించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఆదివారం ఎందుకు పని చేయాలని కోర్టు ఆక్షేపించింది. ఉన్నతాధికారులను మెప్పించేందుకు ఎవరూ చట్ట విరుద్ధంగా పని చేయవద్దని ధర్మాసనం సూచించింది. ఇళ్ల కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా..? చనిపోయే వ్యక్తిని కూడా చివరి కోరిక అడుగుతారు కదా అని మండిపడింది. పొలిటికల్ బాస్‌లను సంతృప్తి పరిచేందుకు అత్యుత్సాహంతో పని చేయకూడదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక నుంచి అధికారులు చట్ట వ్యతిరేకంగా పని చేస్తే నేరుగా ఇంటికి వెళ్లాల్సి వస్తుందని కోర్టు వార్నింగ్ ఇచ్చింది. అనంతరం అమీన్‌పూర్ (Ameenpur) కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ సమాధానమిస్తూ.. ఎమ్మర్వో (MRO) విజ్ఞప్తి మేరకే తాము చర్యలు తీసుకున్నామని ధర్మసనానికి తెలిపారు. అందుకు కోర్టు.. ఎమ్మార్వో అడిగితే కూల్చివేతలకు యంత్రాలు, సిబ్బందిని సమకూర్చుతారా?.. అయన అడిగితే చార్మినార్ (Charminar) , హైకోర్టు (High Court) కూడా కూల్చేస్తారా అని ప్రశ్నించింది.   

ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బందుల పాలు చేస్తారా, అసలు ఆదివారం కూల్చివేతలు చేపట్టవచ్చా అని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ (Hydra Commissioner Ranganath)ను కోర్టు ప్రశ్నించింది. కేవలం అడిగిన వాటికే సమాధానం ఇవ్వాలంటూ ధర్మాసనం ఆయనను వారించింది. మూసీ (Moosi)పై కూడా 20 లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు అయ్యాయని హైకోర్టు (High Court) తెలిపింది. ఈ క్రమంలో రంగనాథ్ రిప్లై ఇస్తూ.. కూల్చివేతలకు యంత్రాలు, సిబ్బంది కోరడంతోనే సమకూర్చామని తెలిపారు. ‘హైడ్రా’ (HYDRA) ఇదే విధంగా ముందుకు వెళితే.. స్టే ఇవ్వాల్సి వస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. అనంతరం రంగనాథ్ మాట్లాడుతూ.. కోర్టులపై తమకు అపారమైన నమ్మకం, గౌరవం ఉన్నాయని తెలిపారు.

జీఓ నెం.99 (Government Order) ప్రకారం.. ‘హైడ్రా’కు ఎన్నో విధులు ఉన్నాయని, మిగతావి ఏ మాత్రం పట్టించుకోకుండా కేవలం కూల్చివేతలపైనే దృష్టి పెట్టారని హైకోర్టు (High Court) పేర్కొంది. ట్రాఫిక్ (Traffic) సమస్యపైనా హైడ్రాకు బాధ్యత ఉందని.. ఆ విషయం గురించి ఏ మాత్రం పట్టించుకోవట్లేదని విమర్శలు గుప్పించింది. సబ్ రిజిస్ట్రార్ (Sub Registrar) రిజిస్ట్రేషన్లు చేస్తేనే కదా సామాన్యులు ఇళ్లు నిర్మిస్తున్నారని తెలిపింది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో సామాన్యులు నష్టపోతున్నారని కోర్టు తెలిపింది. ఒక్కరోజులో హైదరాబాద్‌ (Hyderabad)ను మార్చాలనుకోవడం సరికాదని, కమిషనర్ రంగనాథ్, అమీన్‌పూర్ (Ameenpur) ఎమ్మార్వో పనితీరు అసంతృప్తికరంగా ఉందని ధర్మాసనం పేర్కొంది. హైడ్రా ఏర్పాటు అభినందనీయమేనని.. పనితీరే చాలా అభ్యంతరకరంగా ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. 


Similar News