TG Govt.: మహిళా సంఘాలకు యూనిఫాం.. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు సైతం

తెలంగాణ చరిత్రలో మొదటిసారి మహిళా సమాఖ్య సభ్యులకు యూనిఫాం చీరలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది.

Update: 2024-12-13 02:19 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ చరిత్రలో మొదటిసారి మహిళా సమాఖ్య సభ్యులకు యూనిఫాం చీరలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు ఉచితంగా వీటిని అందజేయాలని నిర్ణయించింది. ఈ చీరల కోసం ప్రత్యేకంగా డిజైన్లు తయారు చేయిస్తున్నారు. గురువారం సచివాలయంలో మహిళా సంఘాల కోసం తయారు చేయిస్తున్న చీరలను మంత్రి సీతక్క పరిశీలించారు. సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ చీరల తయారీని మంత్రి సీతక్కకు చూపించారు.

త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ యూనిఫాం చీరలను ఫైనలైజ్ చేయనున్నారు. ఆ తర్వాత 63 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. అంగన్ వాడీ టీచర్లు, ఆయాలకు ఇచ్చే చీరల ఎంపిక కూడా పూర్తవుతోంది. చీరలను పరిశీలించిన మంత్రి సీతక్క మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ, ఇతర అధికారులకు అంగన్వాడీలకు ఇచ్చే చీరలకు సంబంధించి పలు సూచనలు చేశారు. స్వయం సహాయక బృందాల సభ్యులకు ఉచిత చీరల పంపిణీకి చేనేత, జౌళీ శాఖలు తయారు చేయనున్నాయి. ప్రస్తుత అంచనా ప్రకారం రాష్ట్రంలో 63.86 లక్షల మంది మహిళలు సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. వారికి ఏటా రెండేసి చొప్పున అంటే ఒక కోటి 27లక్షల 72వేల చీరలు పంపిణీ చేయాల్సి ఉంటుంది.

మర మగ్గాలతోనే తయారీ..

గతేడాది బతుకమ్మ చీరల పంపిణీ పథకం కింద రూ.335 కోట్లు ఖర్చు చేసి కోటి మందికి ఒక్కో చీర చొప్పున పంపిణీ చేశారు. వాటిని సిరిసిల్లలో తయారు చేయించారు. సీఎం రేవంత్‌రెడ్డి చేనేత చీరలు పంపిణీ చేస్తామని ప్రకటించినా అంతపెద్ద మొత్తంలో తయారీ సామర్థ్యం రాష్ట్రంలో లేదని అధికారులు గుర్తించారు. ఒక్కో చీరకు ఆరు మీటర్ల చొప్పున 7.66 కోట్ల మీటర్ల వస్త్రం అవసరం. రాష్ట్రంలో ప్రస్తుతం చేనేత వస్త్రాల సామర్థ్యం 7 లక్షల మీటర్ల మేరకే ఉంది. ఈ క్రమంలో మరమగ్గాల(పవర్‌లూమ్‌) చీరలనే అందించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. పథకంలో చేనేతకూ భాగస్వామ్యం కల్పిస్తూ కొంత మేరకు ఆర్డర్లు ఇవ్వాలని యోచిస్తున్నారు. గతంలో ఉన్న బతుకమ్మ చీరలపై విమర్శల దృష్ట్యా మహిళా సంఘాలకు ఇచ్చే వాటిని ప్రత్యేకంగా తయారు చేయించాలని భావిస్తున్నారు.

తయారీకి ఆరు నెలలు

పథకం విధివిధానాలు ఖరారై.. ఆర్డర్‌ ఇస్తే 1.27 కోట్ల చీరల తయారీకి ఆరు నెలల వరకు సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన వచ్చే ఏడాది ఉగాది వరకు తయారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో బతుకమ్మ ఉచిత చీరల పథకానికి చేనేత, జౌళి శాఖ నిధులనే వెచ్చించారు. ఈసారి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని నిధులను వెచ్చించాలని చేనేత శాఖ యోచిస్తోంది. ఆర్థిక అంచనాలు, తయారీ విధానంతోపాటు లబ్ధిదారుల వివరాలు ఇవ్వాలని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) నుంచి ఇప్పటికే సమాచారాన్ని అధికారులు కోరారు.

Tags:    

Similar News