TG Govt.: సెకండ్ ఫేజ్ ఇందిరమ్మ ఇండ్లు.. లబ్ధిదారుల ఎంపికలో వాళ్ల నిర్ణయమే ఫైనల్

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది.

Update: 2025-03-17 01:47 GMT
TG Govt.: సెకండ్ ఫేజ్ ఇందిరమ్మ ఇండ్లు.. లబ్ధిదారుల ఎంపికలో వాళ్ల నిర్ణయమే ఫైనల్
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే మొదటి విడత కింద లబ్ధిదారులను ఎంపిక పూర్తవగా.. పలు ఇండ్ల నిర్మాణాలు సైతం మొదలయ్యాయి. ఇప్పటికే రెండో దశలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని సర్కారు భావించినా.. ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఎట్టకేలకు కోడ్ సైతం ముగియడంతో సెకండ్ ఫేజ్ కోసం జిల్లాల వారీగా కలెక్టర్లు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తూ.. అర్హతలను బట్టి ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు.

6,600 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా జనవరి 26న ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించగా.. మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసింది. మొత్తం 562 గ్రామాల నుంచి 71,482 మంది లబ్ధిదారులను సెలక్ట్ చేశారు. వెంటనే వాటిని గ్రౌండింగ్ చేసి.. అదే రోజున వారందరికీ మంజూరు పత్రాలను అందజేసింది. ప్రస్తుతం మొదటి దశలో భాగంగా.. స్థలం ఉన్న వారికి ఇండ్లు మంజూరయ్యాయి. ఆ జాబితాలను ఇప్పటికే నియోజకవర్గాల వారీగా వెల్లడించారు. వాటిలో నుంచి సుమారు 6,600 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభమైనట్టు అధికారులు చెబుతున్నారు. మరోవైపు.. డిసెంబర్ 2023లో ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం గ్రామీణ ప్రాంతాల్లో 68,83,835 దరఖాస్తులు వచ్చాయి.

జీహెచ్ఎంసీ పరిధిలో 10,70,659 దరఖాస్తులు అందాయి. మొత్తంగా మొత్తంగా 84.54 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. వీటిలో నుంచి 80.24 లక్షలను ఫైనల్ చేసినట్టు వెల్లడించారు. వీరిలో 23 లక్షల మందికి ఇండ్ల నిర్మాణాలకు స్థలాలు ఉన్నాయని.. 21.50 లక్షల మందికి స్థలాలు లేవని చెప్పారు. వీటినే మూడు విభాగాలుగా డివైడ్ చేసినట్టు వెల్లడించారు. ఇప్పటికే మొదటి విడత నిర్మాణాలు ప్రారంభం కాగా.. రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నది. రెండో విడతల భాగంగా మిగతా వాటన్నింటి ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు.

జిల్లా కలెక్టర్లే ఫైనల్

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో కలెక్టర్లదే ఫైనల్ నిర్ణయం. ఇప్పటికే ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన దరఖాస్తులన్నీ కలెక్టర్ల వద్దే ఉన్నాయి. వాటిలో నుంచే గ్రౌండ్ లెవల్ సర్వే నిర్వహించి ఎక్కడా అవకతవకలకు అవకాశం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. మండలాలు, గ్రామాల వారీగా జాబితాలను, లబ్ధిదారులను అర్హతలను పరిశీలిస్తూ రాష్ట్రస్థాయికి ఫైనల్ లిస్ట్ పంపిస్తున్నారు. రెండో విడతకు సంబంధించి జిల్లా కలెక్టర్ల నుంచి గృహ నిర్మాణ శాఖకు ఒక్కొక్కటిగా చేరుకుంటున్నాయి. ఈ జాబితాలన్నీ అందగానే పూర్తిస్థాయిలో ఇండ్లను మంజూరు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా.. ఒక్కో ఇంటికి ప్రభుత్వం రూ.5 లక్షలు సాయం అందిస్తున్న విషయం తెలిసిందే.

మూడు దశలుగా లబ్ధిదారుల ఎంపిక

ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మూడు దశల్లో లబ్ధిదారులను ఎంపిక చేశారు. మొదటి విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 562 గ్రామాల నుంచి 71,482 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. వీరిలో ఎల్-1, ఎల్-2, ఎల్-3 విభాగాల కింద సెలక్ట్ చేశారు. ఖాళీ జాగా ఉండి ఇల్లు లేని వారిని ఎల్-1 జాబితాలో చేర్చారు. ఖాళీ జాగాతో పాటు గుడిసె, మట్టిమిద్దెలు, రేకుల షెడ్లు ఉన్న వారినీ ఇదే జాబితాలో చేర్చారు. సొంత స్థలం లేని వారిని ఎల్-2లో పొందుపర్చారు. సొంత ఇల్లు ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్‌-3 జాబితాలో చేర్చారు. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కోసం ఓ యాప్‌ను సైతం ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అలాగే.. ఇండ్ల నిర్మాణాల్లోనూ, డబ్బుల పేమెంట్‌లోనూ ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శాటిలైట్‌లో నమోదైన రికార్డు ప్రకారమే నాలుగు దశల్లో రూ.5 లక్షల సాయాన్ని లబ్ధిదారులకు అందించనున్నారు.

వారం రోజుల్లో మొదటి విడత బిల్లులు

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 6,600 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా.. వాటికి సంబంధించి మొదటి విడత బిల్లులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వారం రోజుల్లోనే ఫస్ట్ పేమెంట్ చేసేందుకు రెడీగా ఉన్నట్టు గృహనిర్మాణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల నిర్మాణాలు ప్రారంభం కావడంతో అవి బేస్‌మెంట్ లెవల్ పూర్తయ్యేందుకు సమయం పడుతుండడంతో బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగినట్టు తెలిపారు. ఇప్పుడు నిర్మాణలు ఊపందుకున్నాయని, వెంటవెంటనే బిల్లులు చెల్లిస్తామని వెల్లడించారు.

Tags:    

Similar News