TG Govt. వీఆర్వో, వీఆర్ఏ‌లకు బిగ్ అలర్ట్.. ఆ రెవెన్యూ పోస్టులకు నోటిఫికేషన్!

రాష్ట్రంలో 10,954 గ్రామస్థాయి రెవెన్యూ ఆఫీసర్ పోస్టులకు ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది.

Update: 2025-03-14 01:30 GMT
TG Govt. వీఆర్వో, వీఆర్ఏ‌లకు బిగ్ అలర్ట్.. ఆ రెవెన్యూ పోస్టులకు నోటిఫికేషన్!
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 10,954 గ్రామస్థాయి రెవెన్యూ ఆఫీసర్ పోస్టులకు ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. రాత పరీక్ష ద్వారానే వీటిని భర్తీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించిన ప్రభుత్వం.. ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన విధి విధానాల ముసాయిదాను అధికారులు రెడీ చేసి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి అందజేసినట్లు సమాచారం. ఈ అసెంబ్లీలో సమావేశాల్లోపు సీఎం రేవంత్ రెడ్డి పరీక్షకు సంబంధించిన ముసాయిదాను పరిశీలించి తుది రూపమిచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పరీక్ష నిర్వహణ, సిలబస్ కోసం టీజీపీఎస్సీ అధికారులతో సంప్రదింపులు పూర్తయ్యాయి.

విమర్శలకు తావివ్వకుండా..

పరీక్షల ద్వారానే నియామకాలు చేపడుతామని మంత్రి పొంగులేటి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అలా అయితేనే ఎలాంటి విమర్శలు రావని ప్రభుత్వం భావిస్తున్నది. వీఆర్ఏ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగం పొందిన వీఆర్వోలు సైతం పరీక్ష రాయాల్సిందేనని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే 6-24 ఏళ్ల రెవెన్యూ సర్వీసు కలిగి ఉన్న వారిని వెనక్కి తీసుకోవడానికి పరీక్ష ఏమిటని సదరు వీఆర్వోలు ప్రశ్నిస్తున్నారు.

పరీక్ష ఎలా?

పరీక్ష చాలా సింపుల్ గా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సాధారణ ప్రశ్నలతో పాటు రెవెన్యూ శాఖకు సంబంధించిన అంశాలే ప్రధానంగా ఉండనున్నట్లు తెలిసింది. గ్రామ స్థాయిలో పని చేసే రెవెన్యూ అధికారికి ఏ స్థాయి అవగాహన ఉండాలో అదే తరహాలో ప్రశ్నావళి ఉంటుందని సమాచారం. అంటే ఏమేం పనులు చేశారో, నియామకం తర్వాత చేయనున్నారో.. వాటికి సంబంధించిన అంశాల ప్రాతిపదికనే ఎగ్జామ్ ఉండనున్నట్లు తెలిసింది. ఈ పరీక్ష కోసం పుస్తకాలు తిరగేయాల్సినంత పని ఉండదంటున్నారు. ఇతర సిలబస్ పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉండదని కూడా చెబుతున్నారు. అనుభవం కలిగిన వారే కావడం వల్ల పని ఆధారిత పరీక్ష రాయడం పెద్ద కష్టమేం కాదని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే పరీక్ష మోడల్, తేదీ వంటివి ప్రకటించే చాన్స్ ఉంది. ఏపీపీఎస్సీ, టీఎస్ పీఎస్సీ ద్వారా ఎంపికైన వీఆర్వోలు ఈ పరీక్షను ఇంకా తేలిగ్గా రాయగలరన్న అభిప్రాయం ఉంది.

పోస్టుకు పేరేమిటి?

నేటికీ గ్రామ స్థాయి రెవెన్యూ అధికారి పేరుపైన క్లారిటీ రాలేదు. గతంలో వీఆర్వోగా, అంతకు ముందు వీఆర్ఏ, పట్వారీ వంటి పేర్లతో పిలిచారు. ఇప్పుడు ఆ పేర్లకు బదులుగా మరేదైనా పెట్టాలని నిర్ణయించారు. సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేసినప్పుడే 20 దాకా పేర్లు ప్రస్తావించారు. వాటిలో గ్రామ పరిపాలన అధికారి(జీపీఏ), విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (వీఏవో), గ్రామ పరిపాలన ఆఫీసర్ (జీపీవో), గ్రామ ప్రజాపాలన అధికారి (జీపీపీఏ/జీపీపీవో).. ఇలా అనేకం వినిపించాయి. వీటిలో జీపీఏ అంటే విమర్శలకు గురయ్యే చాన్స్ ఉంది. అంటే ఊరు మొత్తాన్ని ఆయనకు జీపీఏ (జనరల్ పవర్ ఆఫ్ అటార్న్) చేశారా? అని ప్రతిపక్షాల నుంచి విమర్శించడానికి మార్గం ఏర్పడుతుందని భావించారు. జీపీవో అంటే జనరల్ పోస్ట్ ఆఫీస్ అనుకోవచ్చు. కానీ ఊరికి, దానికి సంబంధం లేదు. అలాగే జీపీవో కాకపోతే గ్రామ ప్రజాపాలన అధికారిగా పేరు పెడితే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఎలాగూ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా రోజుల నుంచి ఇది ప్రజాపాలన అంటూ ప్రచారం చేస్తున్నది. దాని కిందనే అనేక పథకాలకు దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నది. ఆ అప్లికేషన్ల పరిశీలన కూడా చాలా వరకు గ్రామ స్థాయి రెవెన్యూ అధికారికి అప్పగించే అవకాశం ఉంది. అందుకే ఈ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.

గ్రామానికొక్కరు సాధ్యమేనా?

రెవెన్యూలోకి వచ్చేందుకు గత డిసెంబర్ 23-28 మధ్య వీఆర్వోలు, వీఆర్ఏల నుంచి ప్రభుత్వం ఆప్షన్లు తీసుకున్నది. 33 జిల్లాల నుంచి 9,654 మంది గూగుల్ ఫారాల ద్వారా తామంతా రెవెన్యూ శాఖకు రావడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆప్షన్ ఇచ్చారు. వీరిలో వీఆర్వోలు 5,130 మంది, వీఆర్ఏలు 3,534 మంది ఉన్నారు. వీఆర్ఏలు 16 వేల మందికి ఉండగా 5,987 మంది మాత్రమే ఆప్షన్ ఇచ్చారు. రెవెన్యూ శాఖలో కొందరు జూనియర్ అసిస్టెంట్లుగా ఉన్నారు. అలాగే కొందరు వార్డు ఆఫీసర్లుగా ఉన్నారు. వీరిలో కొందరికి రెవెన్యూ శాఖకు రావడానికి ఆసక్తి చూపలేదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 10,954 పోస్టులు మంజూరయ్యాయి. ఇప్పుడీ రాత పరీక్షకు హాజరయ్యే వారి సంఖ్య 9,654 మంది మాత్రమే. అంటే పోస్టుల కంటే పరీక్ష రాసే వారు తక్కువే. గ్రామానికొక్కరు కూడా లేరు. అయితే రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారినే ఎంపిక చేయనున్నారు. మిగతా పోస్టుల భర్తీ ప్రక్రియ జరగడానికి ముందే సర్దుబాటు చేయొచ్చునని సీసీఎల్ఏ సీఎమ్మార్వో ప్రాజెక్టు డైరెక్టర్ మందా మకరంద్ అభిప్రాయపడ్డారు. కొన్ని రెవెన్యూ గ్రామాలు చాలా చిన్నవిగా ఉన్నాయి. అలాంటి వాటికి రెండింటికి ఒకరిని నియమించడం ద్వారా పోస్టుల భర్తీ ఈజీగానే పూర్తవుతుందన్నారు.

సర్వీస్ మ్యాటర్స్ సమస్యే

పూర్వ వీఆర్ఏల్లో విద్యార్హత ఆధారంగా ఏకంగా ఒక్కొక్కరికి డబుల్ ప్రమోషన్ సైతం ఇచ్చారు. సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి రెగ్యులరైజ్ చేశారు. డైరెక్ట్ రిక్రూట్ వీఆర్వోల విషయంలోనే రాత పరీక్ష పేరుతో పునర్ నియామకం అంటుండడం ద్వారా ఆవేదనకు గురవుతున్నారు. తాము పోటీ పరీక్షలో పాసై వచ్చామని, ఇప్పుడు వీఆర్ఏలతో సమానంగానే పరిగణించడం ద్వారా అన్యాయమై పోతామంటున్నారు. వీఆర్వోలు, వీఆర్ఏల సర్వీస్ మ్యాటర్స్ విషయంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని డైరెక్ట్ రిక్రూట్ వీఆర్వోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని ప్రభుత్వం పరిష్కరించడం పెద్ద సమస్యగా మారుతుందంటున్నారు.

Read More..

LRS: అస్తవ్యస్తంగా LRS దరఖాస్తుల పరిష్కారం.. పట్టించుకోని సర్కార్  

CM Revanth: సీఎం రేవంత్ క్లాస్ వర్కవుట్.. నేతల మధ్య కుదిరిన కో-ఆర్డినేషన్  

Tags:    

Similar News