‘చిత్తశుద్ధిలేని పాలన చేస్తోంది బీజేపీనే’.. ఎంపీ చామల సంచలన వ్యాఖ్యలు

కేంద్రంలో బీజేపీ చిత్తశుద్ధి లేని పాలనను కొనసాగిస్తున్నదని భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి ఆరోపించారు.

Update: 2025-03-14 14:14 GMT
‘చిత్తశుద్ధిలేని పాలన చేస్తోంది బీజేపీనే’.. ఎంపీ చామల సంచలన వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్రంలో బీజేపీ చిత్తశుద్ధి లేని పాలనను కొనసాగిస్తున్నదని భువనగిరి ఎంపీ చామల కిరణ్​ కుమార్​రెడ్డి ఆరోపించారు. గాంధీ భవన్​లో శుక్రవారం వేణు, చరణ్, శ్రీకాంత్ ​యాదవ్​లతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ ఫ్లోర్​లీడర్ ​ఏలేటి మహేశ్వర్​రెడ్డి పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాకపోతే రాజీనామా చేసి ప్రజా తీర్పు కోరాలని అసెంబ్లీలో మాట్లాడడాన్ని తప్పుబట్టారు. బీజేపీ నేత అయిన మహేశ్వర్​రెడ్డి కాంగ్రెస్ ​పార్టీలో ఏఐసీసీ ఇంప్లిమెంటేషన్​ కమిటీ చైర్మన్​గా పనిచేశారని, బీజేపీలో చేరిన ఆయనకు ప్రస్తుతం ఆ పార్టీ పాలన పై అవగాహన లేదని విమర్శించారు.

వాస్తవానికి కాంగ్రెస్​ పార్టీలో ఆయనకు ఇచ్చిన గుర్తింపు బీజేపీలో ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. దాంతోనే మహేశ్వర్​రెడ్డి గుర్తింపు కోసమే 14 నెలల కాంగ్రెస్​పాలనపై మాట్లాడుతున్నరనేది క్లియర్​కట్​గా కనిపిస్తోందన్నారు. నిజానికి 11 ఏళ్లుగా కేంద్రంలో పాలన కొనసాగిస్తున్న బీజేపీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేసిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. చిత్తశుద్ధి లేని పాలన చేస్తున్నది బీజేపీ అని, ఈ విషయంలో ముందుగా ఏలేటి మహేశ్వర్ ​రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు తీరుపై మాట్లాడాలని సూచించారు.

‘‘దేశవ్యాప్తంగా ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ, ఆ లెక్కల ప్రకారం చూస్తే తెలంగాణ వాటా 80 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి? ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు జమ చేస్తామన్నారు.. అవి ఏమయ్యాయి” అని చామల కిరణ్​కుమార్​ రెడ్డి ఈ సందర్భంగా ప్రశ్నించారు. బీజేపీకి లోబడి ఉండే బడాబాబులకేమో లక్షల కోట్ల రూపాయల బ్యాంకు బకాయిలను కేంద్రం మాఫీ చేసింది, దేశంలో లూటీలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వారిని కేంద్రం తలుచుకుంటే అరెస్టు చేయలేదా? అని పేర్కొన్నారు.

సామాన్యుడు ఏదైనా లోన్ కట్టకపోతే అరెస్టు చేసే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. అసలు తెలంగాణకు నిధులు రాకుండా అడ్డుపడుతున్నదే కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డియే అని ఆరోపించారు. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయని ఎంపీ చామల స్పష్టం చేశారు. దక్షణాది రాష్ట్రాలు ఈనెల 22న ఏర్పాటు చేసిన అఖిల పక్ష మీటింగ్​కు ఎంపీ కిషన్​రెడ్డి తెలంగాణ రాష్ట్రం పక్షాన నిలబడాలని ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్​ కుమార్​రెడ్డి సూచించారు.


Similar News