రామగుండం థర్మల్ ప్లాంట్ నిర్మాణం జెన్‌కోకే ఇవ్వాలని నేటి నుంచి తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ నిరసన

రామగుండం థర్మల్ ప్లాంట్ నిర్మాణంలో సింగరేణి భాగస్వామ్యాన్ని ఒప్పుకోబోమని, జెన్కో ద్వారానే నిర్మాణం చేపట్టాలని తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.

Update: 2024-09-25 16:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రామగుండం థర్మల్ ప్లాంట్ నిర్మాణంలో సింగరేణి భాగస్వామ్యాన్ని ఒప్పుకోబోమని, జెన్కో ద్వారానే నిర్మాణం చేపట్టాలని తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని తమ సంఘం యూనియన్ ఆఫీసులో బుధవారం తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ నేతలు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో జెన్‌కోకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగా గురువారం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని నిర్ణయం తీసుకున్నారు. అయినా ప్రభుత్వం స్పందించకుంటే ఈనెల 30 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు అన్ని విద్యుత్ ఉత్పత్తి సంస్థల్లో గేట్ మీటింగ్ నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 4, 5 తేదీల్లో లంచ్ హవర్ డెమోనిస్ట్రేషన్‌ను అన్ని విద్యుత్ ఉత్త్పత్తి కేంద్రాల్లో, కార్పొరేట్ ఆఫీసుల్లో, విద్యుత్ సౌధలో చేయాలని నిర్ణయించారు.

అయినా సర్కార్.. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తదుపరి కార్యాచరణను అక్టోబర్ 5న తెలుపుతామన్నారు. విద్యుత్ శాఖ మంత్రి చొరవ తీసుకోవాలని, ప్రభుత్వ సంస్థ అయినా జెన్కో ద్వారానే రామగుండం థర్మల్ ప్లాంట్ నిర్మాణం జరిగేలా చూడాలని వారు కోరారు. ఈ సమావేశంలో జేఏసీ చైర్మన్ సాయి బాబా, కన్వీనర్ రత్నాకర్ రావు, కో చైర్మన్ శ్రీధర్, కో కన్వీనర్ బీసీ రెడ్డి, వైస్ చైర్మన్ అనిల్ కుమార్, వజీర్, శ్యామ్ మనోహర్, నాగతులసి రాణి, కరుణాకర్ రెడ్డి, రాంజీ, సదానందం, వెంకట్ నారాయణ రెడ్డి, సుధీర్ , శ్రీనివాస్, ఈశ్వర్ గౌడ్, వేణు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


Similar News