సాంకేతిక నైపుణ్యాలకు డెస్టినేషన్‌గా హైదరాబాద్

సాంకేతిక నైపుణ్యానికి కేరాఫ్ గా హైదరాబాద్ నిలవాలని, ప్రపంచానికి నైపుణ్యం కలిగిన యువతను అందించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Update: 2024-09-25 16:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : సాంకేతిక నైపుణ్యానికి కేరాఫ్ గా హైదరాబాద్ నిలవాలని, ప్రపంచానికి నైపుణ్యం కలిగిన యువతను అందించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చడమే కాదని, నైపుణ్యం అందించడంలోనూ హైదరాబాద్ కేరాఫ్‌గా మారుస్తామని, దీంతో సాంకేతిక నైపుణ్యానికి హైదరాబాద్ డెస్టినేషన్ గా నిలపాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి తెలిపారు. మాసబ్ ట్యాంక్ లోని జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ(జేఎన్ఏఎఫ్ఏయూ) ఆడిటోరియంలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) మినీ డిగ్రీ నైపుణ్య శిక్షణ ప్రోగ్రామ్ ను ప్రారంభించారు. తెలంగాణలోని 38 కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి కోర్సును ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో పదేండ్లలో నిరుద్యోగం పెరిగిందని బీఆర్ఎస్ పై పరోక్ష విమర్శలు చేశారు. పదేండ్లలో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించలేదన్నారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని ప్రజా ప్రభుత్వం గుర్తించిందని రేవంత్ చెప్పారు. అందుకే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు అందించినట్లు తెలిపారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి 35 వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల చేశామని, రాబోయే రెండు, మూడు నెలల్లో మరో 35 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు. 2 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టినా తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీరదని రేవంత్ పేర్కొన్నారు. ప్రతిభ ఉన్నా.. నైపుణ్యం లేకపోతే ఉద్యోగ అవకాశాలు రావని సీఎం తెలిపారు.

అందుకే ఈ సమస్యను గుర్తించి నైపుణ్య శిక్షణ అందించే చర్యలు చేపట్టినట్లు రేవంత్ వివరించారు. తెలంగాణలో ప్రతీ ఏటా 3 లక్షల మంది డిగ్రీ పట్టాలు పొంది బయటకు వస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. కానీ వారికి ఇండస్ట్రీ అవసరాలకు సంబంధించి నైపుణ్యం లేకపోవడంతో ఉద్యోగాలు పొందలేకపోతున్నారన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాన్ని అందించాలనే బీఎఫ్ఎస్ఐతో చర్చలు జరిపి వారు ఇచ్చిన ప్రతిపాదనలతో ప్రణాళిక రూపొందించినట్లు స్పష్టంచేశారు. డిగ్రీ పట్టా పొంది నాటికి విద్యార్థులకు నైపుణ్యాన్ని అందించాలనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సీఎం చెప్పారు. నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి అవసరమైన నిధులను కూడా వాళ్లే సమకూర్చినట్లు వివరించారు.

దీనికి సహకరించడంపై సీఎం వారిని అభినందించారు. ఈ శిక్షణ తర్వాత యువతకు బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్, ఇన్సూరెన్స్ సెక్టార్లలో ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ప్రపంచానికి నైపుణ్యం కలిగిన యువతను అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ పేర్కొన్నారు. పదేండ్లలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరక్క కొంతమంది తెలంగాణ యువత గంజాయి, డ్రగ్స్ కు బానిసలయ్యారన్నారు. ఇటీవల పట్టుబడిన వారిలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉండటం ఆందోళనకరమని ముఖ్యమంత్రి తెలిపారు. డ్రగ్స్, గంజాయిని నియంత్రించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. వ్యసనాల నుంచి యువతను బయటపడేయాలంటే ఉపాధి ఒక్కటే మార్గమని ఆయన వివరించారు.

ప్రమాణాల్లేని ఇంజినీరింగ్ కాలేజీలు క్లోజ్

రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు సీఎం రేవంత్ తెలిపారు. కనీస ప్రమాణాలు పాటించని ఇంజనీరింగ్ కాలేజీల అనుమతులు రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. కళాశాలలో కనీస ప్రమాణాలు కూడా పాటించకపోవడం పై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాంటి యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా తెలంగాణలో 65 ఐటీఐలను అప్ గ్రేడ్ చేసి టాటా టెక్నాలజీస్ సహకారంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా(ఏటీసీ) మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. రాబోయే రెండేళ్లలో అన్ని ఐటీఐలను కూడా ఏటీసీలుగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఐటీఐ కాలేజీలనే కాకుండా పాలిటెక్నిక్ కాలేజీలను కూడా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు సీఎం స్పష్టంచేశారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా విద్యార్థులకు నైపుణ్యం అందించబోతున్నట్లు ఆయన వివరించారు. హైదరాబాద్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చడమే కాకుండా.. నైపుణ్యం అందించడంలోనూ కేరాఫ్ గా మార్చనున్నట్లు ధీమా వ్యక్తంచేశారు. ప్రపంచ వేదికపై హైదరాబాద్ ను విశ్వనగరంగా నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

అందుకు ప్రతి ఒక్కరూ సహకారం అవసరమని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రాబోయే ఏడాదిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీని సైతం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివిన విద్యార్థులు ప్రపంచంలోనే పలు పెద్ద సంస్థలకు సీఈవోలుగా ఉన్నారని గుర్తు చేశారు. అలాంటి వారి సహకారం తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు. ఇదిలా ఉండగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎక్విప్ సంస్థ రూ.2.5 కోట్ల చెక్కును ముఖ్యమంత్రికి అందించింది. విద్యార్థుల డేటా తో రూపొందించిన ఎక్విప్ స్కిల్ పోర్టల్ ను ముఖ్యమంత్రి ఈ వేదికపై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, బీఎఫ్ఎస్ఐ కన్సార్టియం ప్రతినిధులు మమతా మాదిరెడ్డి, రమేష్ ఖాజా, ఎక్విప్ సంస్థ ప్రతినిధులు హేమంత్ గుప్తా, జీ సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


Similar News