టూరిస్ట్ స్పాట్‌గా షుగర్ ఫ్యాక్టరీ

Update: 2023-06-05 02:30 GMT

దిశ, మల్లాపూర్: నిజాం షుగర్ ఫ్యాక్టరీ చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. మూతబడ్డ ఫ్యాక్టరీని రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెరిపించాలని రైతుల నుంచి డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు ఫ్యాక్టరీ పునరుద్ధరణపై రైతుల పక్షాన నిలిచాయి. కాంగ్రెస్ నేతలు ప్రతి నెలలో ఒక రోజు షుగర్ ఫ్యాక్టరీకి మండలంలోని ఒక గ్రామం నుంచి పాదయాత్రగా వెళ్లి నిరసన తెలుపుతున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా బీజేపీ నేతలు సైతం ఫ్యాక్టరీ తెరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో నిజాం షుగర్ ఫ్యాక్టరీ పొలిటికల్ టూరిస్ట్ స్పాట్ గా మారింది. ఎన్నికల ఏడాది కావడంతో అధికార బీఆర్ఎస్ ఫ్యాక్టరీ రీ ఓపెన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడటమే మిగిలింది.

ఇది కథ

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ 1980-81 లో అప్పటి మంత్రి వెంకటేశ్వరరావు సహకారంతో స్థాపించారు. దాదాపు 35 ఏళ్లు నిరంతరాయంగా నడిచింది. రాష్ట్రం ఆవిర్భవించాక 2015 డిసెంబర్‌లో ఫ్యాక్టరీ యాజమాన్యం లే ఆఫ్ నిర్ణయంతో మూతపడింది. అప్పటి రైతులు ఫ్యాక్టరీ తెరవాలని పోరాడుతున్నా సర్కారు పట్టించుకోవడం లేదు. దాదాపు 100 కోట్ల మెషినరీ తుప్పు పట్టి పోయింది. ఫ్యాక్టరీ తెరిపిస్తే కార్మికులకు ఉపాధి లభిస్తుంది. గత ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చెరుకు ఫ్యాక్టరీ తెరిపిస్తానని..గెలిపిస్తే సొంత డబ్బులతో నడిపిస్తానని హామీ ఇచ్చారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గత ఎన్నికల హామీల్లో భాగంగా 100 రోజుల్లో ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని తెలిపారు. ఇద్దరు గెలిచినా ఇంతవరకు హామీలు నెరవేర్చలేదు. ఎన్నికల సమీపిస్తుండగా మళ్లీ ఇద్దరు నేతలు ప్రచారంలో ఎలా ముందుకెళ్తారో చూడాల్సి ఉంది.

మా ప్రభుత్వం వచ్చాక తెరుస్తాం

రైతు ప్రభుత్వం అని చెప్పే బీఆర్ఎస్ ఎనిమిదేళ్లుగా ఫ్యాక్టరీ ఎందుకు తెరిపించడం లేదో చెప్పాలి. తెరిచే వరకు కాంగ్రెస్ పోరాడుతుంది. లేదుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఫ్యాక్టరీ తెరుస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో యాత్రలో హామీ ఇచ్చారు.-వాకిటి సత్యం రెడ్డి, కాంగ్రెస్ జిల్లా కిషన్ సెల్ అధ్యక్షుడు

దగ్గర ఉంటే ఖర్చు ఆదా

మూడెకరాల్లో చెరకు సాగు చేశాను. కామారెడ్డి ఫ్యాక్టరీ తరలించగా ట్రాన్స్ పోర్ట్ ఖర్చు టన్నుకు రూ.1.300 అవుతుంది. ఫ్యాక్టరీ అందుబాటులో ఉంటే ఖర్చు తగ్గుతుంది. ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వంలో చలనం రావడం లేదు. రైతులంతా ఏకమై వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర సర్కార్ కు తగిన బుద్ధి చెప్తాం. - మామిడి రాజశేఖర్ రెడ్డి, చెరుకు రైతు

Tags:    

Similar News