ఇళ్ల నిర్మాణం. కేంద్ర సాయం కోసం తెలంగాణ లేఖ

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ ఏడాది బడ్జెట్​లో పెట్టిన కొత్త పథకానికి

Update: 2022-03-19 02:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ ఏడాది బడ్జెట్​లో పెట్టిన కొత్త పథకానికి కేంద్ర ప్రభుత్వ నిధులు అనివార్యమయ్యాయి. పట్టణ పరిధిలో ఖాళీ స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి రూ. 3 లక్షలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాదిలో కనీసం 4 లక్షల ఇండ్లు టార్గెట్​ అని, పట్టణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 1.70 లక్షల వరకు ఉంటుందని వెల్లడించారు. అయితే, ప్రధానమంత్రి ఆవాస్​ యోజన (పట్టణ) పథకం నుంచి రాష్ట్రానికి 1.69,500 ఇండ్లు మంజూరు చేయాలని ఈ పథకం నోడల్​ ఏజెన్సీ మెప్మా నుంచి డైరెక్టర్​ సత్యనారాయణ లేఖ పంపించారు. ఈ నిధులకు రాష్ట్రం నుంచి మరో రూ. 1.50 లక్షలు కలుపుకుని రూ. 3 లక్షల సాయం చేసేందుకు ప్లాన్​ చేస్తున్నారు. మరోవైపు పీఎంజీఏవై (గ్రామీణ) పథకంలో నిధులు అడిగేందుకు సర్కారు అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వం చేసిన పొరపాటుతో ఈ నిధులు రావడం కష్టంగానే మారింది.

రూ. 1.50 లక్షలు సర్దుబాటు

రాష్ట్ర ప్రభుత్వం నుంచే నిధులు ఇస్తామని చెప్పుకున్నా.. కేంద్ర సాయం కోసం తెలంగాణ ప్రభుత్వం లేఖ పంపింది. వాస్తవానికి సొంత జాగా ఉంటే ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల ఇస్తామని ప్రకటించారు. కానీ, ఇప్పటి వరకు దానిపై అడుగు ముందుకు పడలేదు. కనీసం మార్గదర్శకాలు కూడా లేవు. కానీ తాజాగా బడ్జెట్​లో మాత్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టుతున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు ప్రకటించారు. దీన్ని మంత్రి కేటీఆర్​ కూడా మరోసారి ప్రకటించుకున్నారు. దీంతో చాలా మంది ఆశలు పెట్టుకున్నారు.

అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ నిధుల కోసం కేంద్రంపై భారం వేసింది. అంతేకాకుండా కేంద్రం కూడా ఈ ఏడాదితో ఈ పథకానికి ముగింపు పలుకాలని యోచిస్తోంది. దేశంలోని చాలా రాష్ట్రాలకు సగటున 30 లక్షల ఇండ్లు మంజూరు చేశారు. వాటికి దాదాపుగా 80 శాతం నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు జమ చేశారు. ఉదాహరణగా పక్కనే ఉన్న ఏపీకి పీఎంజీఏవై, పీఎంఏవై (పట్టణ) కింద 31 లక్షల ఇండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలని భావిస్తోంది. పలు రాష్ట్రాలకు సైతం లేఖలు రాసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు కూడా సమాచారమిచ్చింది. ఈ నెల 24న ఈ పథకంపై నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్రం ప్రకటించగా.. పలు రాష్ట్రాలు మాత్రం కొనసాగించాలని కేంద్రానికి నివేదించాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం తమకు ప్రధానమంత్రి ఆవాస్​ యోజనా పట్టణ పథకం కింద 1.69 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపించారు.

పాత వాటితోనే ప్రాబ్లం

పీఎంఏవై (గ్రామీణ) కింద గతంలో రాష్ట్రానికి 50,959 ఇండ్లు మంజూరయ్యాయి. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణానికి కేంద్రం రూ. 72 వేలు ఇస్తోంది. మంజూరు చేసిన అనంతరం ఇండ్ల పనులు ప్రారంభించాలంటూ తొలుత రూ. 190 కోట్లు విడుదల చేసింది. మొత్తం రూ. 381 కోట్లు రావాల్సి ఉంది. అయితే, తెలంగాణ ప్రభుత్వం డబుల్​ బెడ్​ రూం ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించినా.. లబ్ధిదారుల ఎంపిక చేయలేదు. పీఎంజీఏవై నిబంధనల ప్రకారం లబ్ధిదారుల జాబితాను కేంద్రానికి పంపిస్తేనే పూర్తిస్థాయి నిధులు రాష్ట్రానికి జమ అవుతాయి. ఈ నిబంధనలతో కేంద్ర నిధులు వాడాల్సిన అవసరం లేదంటూ కేసీఆర్​ నిర్ణయించినట్లు అధికారులు వివరించారు. దానికి సంబంధించిన యూసీలు కూడా పంపించలేదు. ఫలితంగా పీఎంజీఏవై నిధులు రాలేదు. ప్రస్తుతం 50,959 ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితా పంపిస్తే మిగిలిన సొమ్ము ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు గతంలోనే లేఖ పంపించింది. కానీ, రాష్ట్రం నుంచి రిప్లే ఇవ్వలేదు. డబుల్​ బెడ్​ రూం ఇండ్లు పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అప్పగించకపోవడంతోనే లబ్ధిదారుల జాబితా పంపించడం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News