రాష్ట్రంలో పెరిగిపోతున్న ఆ వ్యాధులు.. ఊరూరా హెల్త్ చెకప్స్ కోసం సర్కార్ కీలక నిర్ణయం

రాష్ట్ర ఆరోగ్య శాఖ కీలక ముందడుగు వేసింది.

Update: 2024-06-13 09:56 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఆరోగ్య తెలంగాణ సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కార్ మరో కీలక ముందడుగు వేసింది. పెరుగుతున్న జీవనశైలి వ్యాధులను ముందస్తుగా గుర్తించి వాటిని అడ్డుకునేలా ఊరూరా హెల్త్ చెకప్స్ నిర్వహించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 26-70 ఏళ్ల వయసున్న అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నది. ఇందుకోసం అవసరమైన ఎక్విప్మెంట్స్‌తో కూడిన మొబైల్ ల్యాబ్‌లను సిద్ధం చేయనున్నట్లు వైద్యారోగ్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్ఎం) కార్యక్రమంలో భాగంగా నిర్వహించబోయే ఈ కార్యక్రమానికి కేంద్రం 60 శాతం, రాష్ట్ర సర్కార్ 40 శాతం నిధులు సమకూర్చనున్నాయి. గ్రామీణ స్థాయి నుంచి ముందస్తు పరీక్షలు నిర్వహించడం ద్వారా ఆయా వ్యాధులను నిర్ధారించి వాటికి సకాలంలో చికిత్స అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

చేసే వైద్యపరీక్షలు ఇవే..

మారుతున్న జీవనశైలి కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో హృద్రోగాలు, క్యాన్సర్, మధుమేహం, బీపీ వంటి వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వ్యాధిని ముందుగా గుర్తిస్తే సరైన చికిత్స అందించడం ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మామోగ్రామ్, ఈ2డీ ఏకో, పాప్‌స్మైర్, ఈసీజీ ఇతర అన్ని రకాల రక్తపరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార, రొమ్ము, మధుమేహం, అధిక రక్తపోటు, నోటి క్యాన్సర్లు, గుండె జబ్బులకు సంబంధించి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. పురుషుల్లో నోటి క్యాన్సర్‌, షుగర్, బీపీ, గుండె వ్యాధులపై పరీక్షలు నిర్వహిస్తారు. దీనికి అనుగుణంగా సెటప్ చేసిన మొబైల్‌ ల్యాబ్‌లో వైద్యులతోపాటు నర్సులు ఇతర టెక్నీషియన్లు అందుబాటులో ఉండనున్నారు.

ఇంటి వద్దకే మందులు...

గ్రామాల్లో నిర్వహించిన వైద్య పరీక్షల అనంతరం అవసరాన్ని బట్టి పెద్దాసుపత్రులకు రెఫర్ చేస్తారు. క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్నట్లుగా భావిస్తే హైదరాబాద్ ఎంఎన్‌జే ప్రభుత్వ క్యాన్సర్ ఆస్పత్రికి తరలిస్తారు. ఒకవేళ షుగర్, బీపీ వంటి సమస్యలుంటే బాధితులకు ఉచితంగా మందులు అందిస్తారు. గ్రామాలకు సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు వారిని అనుసంధానం చేసి అక్కడి నుంచి ప్రతి నెలా మెడిసిన్ అందించేలా చర్యలు తీసుకోనున్నారు. ఆస్పత్రికి రాలేనివారికి ఇళ్ల వద్దకు ఆరోగ్య సిబ్బంది వెళ్లి అందజేయనున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News