ఐదు గ్రామాల వాపస్‌పై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు

విభజన చట్టంలోని సమస్యలపై ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలు, విజ్ఞప్తులకు అనుగుణంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తొలి సమావేశంలోనే కొన్ని కీలక నిర్ణయాలు జరిగాయి.

Update: 2024-07-08 02:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: విభజన చట్టంలోని సమస్యలపై ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలు, విజ్ఞప్తులకు అనుగుణంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తొలి సమావేశంలోనే కొన్ని కీలక నిర్ణయాలు జరిగాయి. రాష్ట్రాల మధ్య వైషమ్యాలు, ప్రజల మధ్య విభేదాలకు ఆస్కారం లేకుండా మంత్రులు, అధికారుల సమక్షంలో జరిగిన చర్చలు, తీసుకున్న నిర్ణయాలపై రెండు రాష్ట్రాల తరఫున సానుకూల స్పందన వ్యక్తమైంది. రోడ్ మ్యాప్ తయారీపై ప్రధాన దృష్టి పెట్టిన ఇద్దరు ముఖ్యమంత్రులు ఆచరణ సాధ్యమయ్యే నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో విలీనం చేసిన ఐదు పంచాయతీలను వాపస్ చేయాలన్న ప్రతిపాదనకు సానుకూల స్పందన వచ్చింది. దీనిపై తక్షణం ఎక్సర్‌సైజ్ మొదలుపెట్టాలని ఇద్దరు సీఎంలు ఒక నిర్ణయానికి వచ్చారు.

ఆలయ భూములకు లీగల్ సమస్యలు

కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడిన రోజుల వ్యవధిలోనే ప్రత్యేక ఆర్డినెన్సును తీసుకొచ్చి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసింది. ఈ ఆర్డినెన్స్ ద్వారా విభజన చట్టానికి అవసరమైన సవరణలను చేసింది. ఆ ఏడు మండలాల్లో భాగంగా ఉన్న భద్రాచలం మండల పరిధిలో ఉన్న ఏటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకల పాడు, గుండాల, పురుషోత్తమపట్నం గ్రామ పంచాయతీలు సైతం ఏపీలో విలీనమయ్యాయి. భద్రాచలం పట్టణం మాత్రం తెలంగాణలో ఉండిపోగా అక్కడి సీతారామస్వామి ఆలయానికి చెందిన దేవాలయ భూములు మాత్రం ఈ ఐదు పంచాయతీల్లోకి వెళ్లిపోయాయి. ఆలయ భూముల నిర్వహణలో తలెత్తిన లీగల్ చిక్కుల కారణంగా ఈ ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలోనే కలపాలని అక్కడ గ్రామాల ప్రజలు దీర్ఘకాలంగా తెలంగాణ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. గ్రామ సభల్లో తీర్మానాలు సైతం జరిగాయి.

ఎజెండాలో పంచాయతీల రీ-ట్రాన్స్‌ఫర్ అంశం

భద్రాచలం మండల పరిధిలోని ఐదు పంచాయతీలను ఏపీలో విలీనం చేయడం ద్వారా కేవలం ఆలయ భూముల వివాదం మాత్రమే కాకుండా ప్రజలకు నిత్యం రాకపోకలకు సమస్యలు ఉత్పన్నమయ్యాయి. భద్రాచలం నుంచి సమీప గ్రామాల్లోకి వెళ్లాలంటే ఏపీ సరిహద్దు లోకి వెళ్లి తిరిగి తెలంగాణలో అడుగు పెట్టాల్సి వస్తున్నది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమవుతున్నారని తెలియగానే ఐదు పంచాయతీల ప్రజలు స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు రాతపూర్వక విజ్ఞప్తులు చేశారు. తిరిగి వీటిని తెలంగాణలో కలిపేయాలని విన్నవించారు. దీనికి కొనసాగింపుగా జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.

వాపస్ ఇవ్వడానికి ఏపీ సానుకూలం

తెలంగాణ సీఎం రేవంత్ ఈ అంశాన్ని ఏపీ సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంలో ప్రతిపాదించారు. చంద్రబాబు నుంచి సానుకూల స్పందన రావడంతో అధికారుల స్థాయిలో కార్యాచరణకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది. దీంతో ఐదు పంచాయతీల ప్రజల్లో సంతోషం వ్యక్తమైంది. పదేండ్లుగా నలుగుతున్న ఈ వ్యవహారం ఒక్క మీటింగుతోనే కొలిక్కి రావడం విశేషం.

ఐదు పంచాయతీల పునః బదిలీ ఇలా..

తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం ఈ ఐదు గ్రామ పంచాయతీల ను ఏపీ తిరిగి అప్పగించాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది. వీలైతే ఈ నెల చివరి వారంలో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లోనే ప్రభుత్వం ఈ అంశాన్ని టేకప్ చేసే అవకాశాలున్నాయి. ఇతర పార్టీలకు సైతం ఈ అంశంలో భిన్నాభిప్రాయం లేనందున ప్రభుత్వ తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభిస్తుంది. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ సైతం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఆమోదం పొందుతుంది. దాదాపు 94% (164 మంది ఎమ్మెల్యేలు) సభ్యులు అధికార పార్టీ కూటమికి చెందినవారే కావడంతో అక్కడ ఏకగ్రీవంగానే ఆమోదం లభించనున్నది. ఈ రెండు రాష్ట్రాల తీర్మానాలు కేంద్ర హోంశాఖకు చేరుతాయి. రెండు తీర్మానాల నిర్ణయం ఒక్కటే కావడంతో హోంశాఖకు అభ్యంతరం ఉండదని విశ్లేషకుల భావన. వెంటనే దీన్ని పార్లమెంట్‌లో టేబుల్ చేసి ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టానికి సవరణలు చేయడానికి ప్రయత్నం మొదలవుతుంది.

త్వరలోనే పరిష్కారం..

కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉన్నందున ఈ తీర్మానం నెగ్గేలా సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుంటారన్న మాటలు వినిపిస్తున్నాయి. విభజన చట్టానికి సవరణలు చేయడం ద్వారా ఏడు మండలాలను, వాటి పరిధిలోని ఈ ఐదు గ్రామ పంచాయతీలు ఏపీలో విలీనమైనందున ఆ ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణకు అప్పగించడానికి మరోసారి అదే చట్టానికి సవరణలు చేయవలసి ఉంటుంది. ఈ వ్యవహారం రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశమే కావడంతో పార్లమెంటులోని ఇతర పార్టీల ఎంపీలకు ఇబ్బంది ఉండదని, వ్యతిరేకత రాదని అంచనా. రెండు రాష్ట్రాల తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకుని వీలైనంత తొందర్లోనే కార్యరూపం దాల్చేలా కేంద్రం వ్యవహరిస్తుందన్న అభిప్రాయం ఏపీ, తెలంగాణ ఎమ్మెల్యేల నుంచి వ్యక్తమవుతోంది.


Similar News