ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ వ్యసనం.. అప్పుల ఊబిలో కుటుంబాలు.. పెరిగిపోతున్న ఆత్మహత్యలు

ఆన్‌లైన్‌ గేములతో అంతా పోగొట్టుకుంటూ.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కారణంగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

Update: 2024-10-06 02:38 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఆన్‌లైన్‌ గేములతో అంతా పోగొట్టుకుంటూ..  ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కారణంగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ హృదయ విదారక ఘటనలు మన కండ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. బయట పడినవి కొన్ని మాత్రమే. వెలుగులోకి రానివి మరెన్నో..! ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ వ్యసనానికి బలైన కుటుంబాలు ఇంకెన్నో..ఆన్‌లైన్‌ బెట్టింగ్ కు నిజామాబాద్ జిల్లాలో ఓ కుటుంబం బలైంది. రెక్కాడితే గాని డొక్కాడని పేద రైతు కూలీ కుటుంబం ఉన్నంతలో సంతోషంగా సాగుతున్న ఆ కుటుంబంలో ఆన్ లైన్ బెట్టింగ్ అప్పులు ముగ్గురి ఊపిరిని లాగేశాయి. కన్న కొడుకు చేసిన ఆన్ లైన్ బెట్టింగ్ అప్పులు తల్లిదండ్రులపై కొడుకు కూడా బలి కావాల్సి వచ్చింది. ఈ హృదయ విదారక ఘటన జిల్లాలోని ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఇంట్లో ముగ్గురు సభ్యులు దూలానికి ఉరేసుకుని తెల్లారే సరికి స్థానికులకు విగతజీవిగా కనిపించడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. వారి మృతదేహాలను చూసిన ప్రతి ఒక్కరు కంట తడి పెట్టి రోదించడం చూపరుల హృదయాలను ద్రవింప జేస్తోంది.

జిల్లాలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన రంగనేని సురేష్, హేమలత దంపతులు. వీరు వ్యవసాయ కూలీలు. ఉన్నకొద్దిపాటి భూమిలో సాగుచేసుకుని వచ్చిన పంటతో పాటు,రోజుకూలీ ద్వారా వచ్చిన డబ్బులతో ఉన్న ఒక్కగానొక్క కొడుకు హరీష్ ను పోషిస్తున్నారు. హరీష్ గత కొంత కాలంగా ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్ లకు అడిక్ట్ అయ్యాడు. దీంతో పాటు ఆన్ లైన్ డబ్బులు పెట్టి ఆడే రమ్మీ, ఐపీల్ బెట్టింగ్ తదితర గేమ్ లకు బానిసయ్యాడు. ఈ ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్ ల మాయలో పడి దాదాపు రూ. 20 లక్షలు అప్పు చేశాడు. ఈ విషయం తల్లి దండ్రులకు తెలియడంతో ఊళ్లోవారికి, బంధువులకు తెలిస్తే ఉన్న పరువు పోతుందనే భయంతో తమకున్న అరెకరం పొలాన్ని అమ్మేసి తన కొడుకు చేసిన అప్పులను తండ్రి సురేష్ తీర్చేశాడు. అప్పులు తీర్చగా మిగిలిన కొన్ని డబ్బులతో ఉన్నంతలో చిన్నగా ఇల్లు కట్టుకుందామని ఇంటి నిర్మాణం కూడా ఇటీవలే మొదలు పెట్టారని తెలిసింది.

ఉన్న ఒక్కగానొక్కకొడకు గట్టిగా మందలిస్తే చెట్టంత ఎదిగిన కొడుకు మనస్తాపానికి గురై ఏదైనా అఘాయిత్యానికి పాల్పడతాడేమోననే భయంతో సురేష్ ఆయన భార్య హేమలత కొడుకును మందలించకుండా మరోసారి ఇలాంటి పనులు చేయొద్దని కాళ్లావేళ్లా పడి వేడుకున్నారు. కొడుకు మారాడనే నమ్మకంతో చిన్నగా ఇల్లు కట్టుకోడానికి కూడా ఇటీవలే నిర్మాణం పనులు కూడా మొదలు పెట్టినట్లు తెలిసింది. ఇంటి నిర్మాణం పనులు కూడా చేతిలో ఉన్న డబ్బులు ఖర్చవడంతో ఇంటి నిర్మాణం కూడా ఆగిపోయిందని గ్రామస్థులు చెపుతున్నారు. హరీష్ కొద్దిరోజులు ఆన్ లైన్ బెట్టింగ్ వైపు వెళ్లకుండా సరిగానే ఉన్నప్పటికీ మళ్లీ ఆన్ లైన్ బెట్టింగ్ ల వైపే ధ్యాస మళ్లింలించాడు. ఇలా రోజురోజూ ఈ గేమ్ లు ఆడుతూ మళ్లీ ఎక్కువ మొత్తంలో అప్పులు చేసినట్లు తెలిసింది.

ఒక్కొక్కరుగా కొడుక్కు అప్పులిచ్చిన వాళ్లు ఇంటి మీదకు రావడంతో కొడుకు చేసిన అప్పుల గురించి తండ్రికి తెలిసింది. హరీష్ కు అప్పులిచ్చిన వారు తమ అప్పులు తీర్చాలంటూ సురేష్ హేమలత దంపతులపై ఒత్తిడిపెంచడంతో తీవ్ర వేధనకు గురయ్యారు. కుటుంబ పోషణే కష్టమవుతున్న తమకు రూ.లక్షల్లో అప్పులు తీర్చడం జరగని పని అని ఆలోచించి ఏం చేయాలో అర్థం కాక పరువు కోసం ఆత్మహత్యనేశరణ్యమని భావించినట్లున్నారు. శుక్రవారం తమింట్లోనే కొడుకు, భార్యతో సహా కుటుంబ యజమాని సురేష్ కూడా ఇంట్లోని దూలానికి ఉరేసుకుని ఆత్యహత్య చేసుకుని తనువు చాలించారు.

జిల్లాలో గతంలోనూ ఇలాంటి ఘటనలు..

గతంలోనూ ఇలాంటి సంఘటనలు జిల్లాలో చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తున్నాయి. జక్రాన్ పల్లి మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నా టీచరు హైదరాబాదులో ఉంటున్న తన కొడుకు చేసిన ఆన్ లైన్ యాప్ లలో రుణాలు తీసుకొనడంతో అప్పులు తిరిగి చెల్లించమంటూ వారి ఒత్తిళ్లు ఎక్కువవడంతో మనస్థాపానికి గురైన యువకుడు తన తండ్రికి బాధంతా చెప్పుకున్నాడు. దాదాపు రూ. 4 లక్షల వరకు కొడుకు చేసిన అప్పులు వెంటనే తీర్చేయడంతో ఆన్ లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు ఆగిపోయాయి. లేదంటే అప్పులిచ్చిన ఆన్ లైన్ యాప్ ల నిర్వాహకుల టార్చర్ కు యువకుడు ఒక దశలో ఆత్మహత్య ప్రయత్నం దాకా వెళ్లాడు.

భయపడుతూనే చివరి ప్రయత్రంగా తండ్రితో మాట్లాడి తను చేసిన తప్పును చెప్పి భారం దించుకోవాలని ఆలోచించడం, ధైర్యం చేసి తండ్రికి ఫోన్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తండ్రి చెప్పిన ధైర్యంతో కొడుకు ఆత్మహత్యప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఓ పక్క కొడుకుతో ఫోన్ లో మాట్లాడుతుండగానే హైదరాబాద్ లో తన ఫ్రెండ్ ను అప్రమత్తం చేసి నిమిషాల వ్యవధిలో తన కొడుకు అద్దెకుంటున్న ఇంటికి పంపడంతో ఉన్న ఫలంగా ఆ యువకుడిని నిజామాబాద్ లో ఉంటున్న తన తండ్రికి వద్దకు తీసుకు రావడం, కొడుకు చేసిన అప్పులను అప్పటికప్పుడు చెల్లించడంతో తన ఉన్న ఒక్కగానొక్క కొడుకును కాపాడుకున్నాడు. ఇలాంటి ఘటనలు ఇంకా ఎన్నో జరిగాయని తెలుస్తున్నప్పటికీ వెలుగులోకి రావడం లేదు.

గతంలో కమ్మర్ పల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతు దాదాపు నాలుగైదేళ్ల క్రితం ఆఫ్ లైన్ లో ఏదో ఆస్తి కొనుగోలు చేసి మోసపోయిన కేసులో తన కొడుకు చేసిన అప్పులు తీర్చడానికి విలువైన వ్యవసాయ భూమిని అమ్మి అప్పులు తీర్చేశాడో తండ్రి. లక్షల్లో మోసంపోయిన ఈ ఘటనలో తన కొడుకును కాపాడుకోడానికి తనకున్న విలువైన భూమిని ఉన్నఫలంగా అమ్మేసి కొడుకును దక్కించుకున్నాడు. గతంలో నిజామాబాద్ లో ఓ ప్రజా ప్రతినిధి పన్నెండేళ్ల కొడుకు ఆండ్రాయిడ్ మొబైల్ లో పబ్జీ గేముకు బాసిసయ్యాడు. చదువును నిర్లక్ష్యం చేస్తూ పొద్దస్తమానం ఫోన్ తో ఆడుతుంటే తల్లిదండ్రులు మందలించారు. అలిగి ఏడుస్తూ బెడ్ రూంలోకి వెళ్లిన అబ్బాయి ఎంతసేనైనా బయటికి రాకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూస్తే ఫ్యాన్ కువేలాడుతూ కనిపించాడు. ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చిన కొన్నయితే వెలుగులోకి రానివి ఎన్నో ఉన్నాయి.

అనాలోచిత నిర్ణయాలతో కుటుంబాలు బలి..

తమ పిల్లలకు తల్లి దండ్రులు ఇస్తున్న స్వేచ్ఛను పిల్లలు సన్మార్గంలో కాకుండా వక్రమార్గంలో వాడేసుకుంటున్నారు. తమకు నచ్చిన ఆలోచనే కరెక్టని, తాము నమ్మిన సిద్ధాంతమే సరైనదనే అనాలోచిత నిర్ణయాలతో అడ్డగోలుగా అలవాట్లకు బానిసలవుతున్నారు. చేసుకుంటున్న వ్యసనాలకు, అలవాట్లకు బానిసవుతున్న యువత తమకు తెలియకుండానే నిండా ఊబిలో కూరుకుపోతున్నారు. వారే కాకుండా తమ కుటుంబాన్ని కూడా ఆ ఊబిలోకి లాగేస్తున్నారు. పోలీసులు, మేధావి వర్గాలు ఎంతగా మోటివేట్ చేస్తున్నా యువతలో ఎందుకనో మార్పు రావడం లేదు. ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట పడటం లేదు.


Similar News