మహారాష్ట్రకు తరలిపోతున్న తెలంగాణ పత్తి.. పెంచిన ధరపై రైతుల్లో నిరాశ

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లకు రంగం సిద్ధమవుతోంది.

Update: 2024-10-06 02:19 GMT

దిశ ప్రతినిధి, నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లకు రంగం సిద్ధమవుతోంది. ఆదిలాబాద్, భైంసా పత్తి కొనుగోళ్లకు అతిపెద్ద మార్కెట్లు కాగా, నిర్మల్, సారంగాపూర్, కుబీర్, జైనూర్, ఆసిఫాబాద్, ఇచ్చోడ, బోథ్ మార్కెట్ కమిటీల పరిధిలో సైతం పత్తి కొనుగోలు సాగుతాయి. ఈ ఏడాది పత్తి కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. అయితే ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టర్ రాజార్షీ షా ఆధ్వర్యంలో సీసీఐ పత్తి కొనుగోలు ధరలు ఖరారు చేశారు. నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు సైతం దీనిపై దృష్టి సారించారు. సీసీఐ ఇక్కడా ఆదిలాబాద్ జిల్లాలో ఖరారు చేసిన ధరలతో కొనుగోలు ధరలు ప్రకటించే అవకాశముంది. మరో 10 రోజుల్లో పత్తి పంట రైతు ఇళ్లకు చేరనుంది. పక్షం రోజుల వ్యవధిలో కొనుగోలు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

సిసిఐ ధర పెరిగింది రూ. 500 మాత్రమే..!

గత ఏడాది సీసీఐ కనీస మద్దతు ధర రూ. 7021తో పత్తి జిల్లా వ్యాప్తంగా అన్ని మార్కెట్లు కలుపుకొని 11,43,768 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు. ఇది లక్ష్యానికి మించి జరిగింది. అయితే ఈ ఏడాది సీసీఐ కనీస మద్దతు ధర రూ.501 పెంచి గత ఏడాది కంటే ఈ ఏడాది రూ.7521 కనీస మద్దతు ధరతో పత్తిని కొనుగోలు చేయనుంది. సిసిఐ క్వింటాలు పై కేవలం 500 రూపాయల ధర పెంచడం పట్ల రైతుల్లో కొంత నిరాశ కనిపిస్తోంది. దీంతో గత ఏడాది మాదిరి గానే ప్రైవేటు వ్యాపారుల వైపే రైతులు చూస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. సిసిఐ కన్నా ప్రైవేటు వ్యాపారులు క్వింటాలుకు వెయ్యి రూపాయల ధర అదనంగా ఇవ్వడంతో రైతులు ప్రైవేటు వైపు మొగ్గు చూపారు. అయితే ప్రైవేటు వ్యాపారులు రైతులను తూకం లో మోసం చేయడం పత్తిలో నాణ్యత లేదని కోతలు విధించడంతో రైతులు నష్టపోయారు. సిసిఐ ధరలు పెంచకుండా ప్రైవేటు వ్యాపారుల ఒత్తిడి ఉందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మరోవైపు ప్రైవేటు వ్యాపారులు వెంటనే డబ్బులు చెల్లిస్తుండడంతో రైతులు అటువైపే వెళుతున్నారు. సిసిఐ కొనుగోలు చేసిన తర్వాత నాలుగు నుండి వారం రోజుల తర్వాత డబ్బులు చెల్లిస్తున్న కారణంగా రైతులు ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏడాది 20 లక్షల క్వింటాళ్ల కొనుగోలు లక్ష్యంగా ఉంది. అయితే ఆ స్థాయికి మించి కొనుగోలు జరిగే అవకాశం కనిపిస్తోంది.

మహారాష్ట్ర పై వ్యాపారుల కొత్త ఎత్తుగడలు..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి పత్తి పెద్ద మొత్తంలో మహారాష్ట్ర తరలిపోతున్నది. దీని వెనక అక్కడి వ్యాపారుల కొత్త ఎత్తుగడలు ఉన్నాయి. నేరుగా రైతుల వద్దకు వెళ్ళి వాహనాలతో వచ్చి మహారాష్ట్ర వ్యాపారులు కొనుగోలు చేస్తున్న కారణంగా రైతులు అక్కడి వ్యాపారులకు అమ్మేందుకు సిద్ధ పడుతున్నారు. మార్కెట్ కు పత్తి తరలింపునకు బండ్లు, వాహనాల ఖర్చులు లేకుండా మహారాష్ట్ర వ్యాపారులే నేరుగా రైతుల వద్దకు వచ్చి పత్తి కొనుగోలు చేస్తుండడంతో రైతులు క్వింటాలకు వంద రూపాయలు తక్కువైనా సరే మహారాష్ట్ర వ్యాపారులకు అమ్మేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు మహారాష్ట్ర వ్యాపారులు నగదు కొనుగోలు చేసిన రోజే చెల్లిస్తూ ఉండడం కూడా ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నది.


Similar News