FANCY NUMBER : 9 మ్యాజిక్.. రూ.90 కోట్లు కురిపించిన ఫ్యాన్సీ నంబర్

లక్షలు పెట్టి కారు కొనడమే కాదు.. దాని నంబర్ నంబర్ కోసమూ లక్షల రూపాయలు కుమ్మరిస్తున్నారు.

Update: 2024-12-20 08:24 GMT

దిశ, వెబ్‌డెస్క్ : లక్షలు పెట్టి కారు కొనడమే కాదు.. దాని నంబర్ నంబర్ కోసమూ లక్షల రూపాయలు కుమ్మరిస్తున్నారు. లక్కీ నంబర్, ఫ్యాన్సీ నంబర్ అంటూ కారు ధరకు సరితూగే డబ్బులు చెల్లిస్తూ నంబర్లు దక్కించుకుంటున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల ఆర్టీఏ ఆఫీసుల్లో ఫ్యాన్సీ నంబర్లు కోట్లు కుమ్మరిస్తున్నాయి. తన ఫేవరేట్ నంబర్ కోసం సామాన్యుడి నుంచి కోటీశ్వరుడి వరకు పోటీపడుతున్నారు. 2024 జనవరి నుంచి డిసెంబర్ ప్రారంభం వరకు కేవలం ఫ్యాన్సీ నంబర్లతోనే రవాణ శాఖ రూ.90 కోట్లను సంపాదించుకుంది.

తెలంగాణలో మొత్తం 56 ఆర్టీఏ కార్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో ఫ్యాన్సీ నంబర్ల విక్రయాల కోసం అధికారులు ఆక్షన్స్ నిర్వహిస్తుంటారు. ఈ వేలం ఫీజు రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటుంది. కానీ నచ్చిన నంబర్ కోసం వాహనదారులు లక్షలు రూపాయలు చెల్లించి నంబర్ దక్కించుకుంటున్నారు. వేలంలో ప్రధానంగా 1, 9, 99, 999, 9999 నంబర్లు ఉంటాయి. మిగతా ఆర్టీఏ కార్యాలయాలతో పోల్చుకుంటే ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసు సిరీస్ నంబర్ 09 కావడంతో ఇక్కడ ఫ్యాన్సీ నంబర్ల కోసం విపరీతమైన పోటీ ఉంటుంది. ఇటీవల ఓ వాహనదారుడు 9999 నంబర్ కోసం రూ.25.5 లక్షలు చెల్లించారంటే తొమ్మిదో నంబర్ ఎంత మ్యాజిక్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

ఈ ఏడాది ఫ్యాన్సీ నంబర్ల ద్వారా ప్రభుత్వానికి రూ.90 కోట్ల ఆదాయం రాగా, కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు ఆర్టీఏ ఆఫీసు ద్వారానే రూ.74 కోట్ల ఆదాయం వచ్చినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గ్రేటర్‌లోని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల ఆర్టీఏ కార్యాలయాల్లో నవంబర్ వరకు 73,463 మంది ఫ్యాన్సీ నంబర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరి నుంచి ఫీజు రూపంలోనే రూ.32.57 కోట్లు రాగా, వేలంలో అదనంగా మరో 40.99 కోట్లు ప్రభుత్వానికి సమకూరాయి. డిసెంబర్ ముగిసే నాటికి కేవలం ఫ్యాన్సీ నంబర్ల ద్వారానే ప్రభుత్వానికి రూ.100 కోట్ల ఆదాయం దాటనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  

Tags:    

Similar News