Telangana : కల్తీ విత్తనాల్ని అరికట్టేందుకు చర్యలు.. రైతు కమిషన్ సమావేశం
సీఎం రేవంత్ రెడ్డి రైతులకు పెద్దన్నగా ఉండి పాలన సాగిస్తున్నారని తెలంగాణ వ్యవసాయం, రైతు కమిషన్ అభివర్ణించింది.
దిశ, డైనమిక్ బ్యూరో: మూడు రోజుల పాటు జరిగిన రైతు పండుగ విజయవంతంగా సాగిందని, సీఎం రేవంత్ రెడ్డి రైతులకు పెద్దన్నగా ఉండి పాలన సాగిస్తున్నారని తెలంగాణ వ్యవసాయం, రైతు కమిషన్ అభివర్ణించింది. ఈ మేరకు ఆదివారం వ్యవసాయ, రైతు కమిషన్ కార్యాలయంలో చైర్మన్ కోదండ రెడ్డి (Kodanda Reddy), సభ్యులు కెవిన్ రెడ్డి , గోపాల్ రెడ్డి, మరికంటి భవాని, చెవిటి వెంకన్నతో సమావేశమైన పర్యావరణ, సామాజిక వేత్త దొంతి నరసింహారెడ్డి వివిధ అంశాలపై చర్చించారు. రైతు బాంధవుడిగా సీఎం రేవంత్ పనిచేస్తున్నారని కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 18 వేల కోట్ల రుణమాఫీ చేసిందని, నిన్న రైతు పండగలో మరో 3 వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నట్లు సీఎం ప్రకటించడం సంతోషమన్నారు.
ఇక ఇదే సమావేశంలో లాభసాటి వ్యవసాయం, గిట్టుబాటు ధర, కల్తీ విత్తనాలు అరికట్టడం, భూసారం పెంపు, మార్కెటింగ్ తోపాటు, కేంద్ర నిధులను తీసుకొచ్చే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సైన్స్ లేని రోజుల్లో రైతులు కరువు కట్టలు వేసుకొని వ్యవసాయం చేసేవారని, ఆ సమయంలో నే సహకార బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చేవారని గుర్తు చేశారు. ఇక రైతులకు మార్కెట్ దగ్గర చేయడం, కల్తీ విత్తనాల్ని అరికట్టడానికి చేపట్టాల్సిన చర్యలు, సమగ్ర, సహకార వ్యవసాయం ఎలా చేయాలనే అంశాలపై చర్చించారు. అదేవిధంగా భూమి సారం ఎలా పెంచాలి అనే అంశంపై కమిషన్ చర్చించింది.