టార్గెట్ రాహుల్.. బీజేపీ దూకుడుకు కారణమిదేనా?

ప్రతి పార్టీకి గెలిపించే ‘గేమ్ ఛేంజర్’ ఒకరు ఉంటారు.

Update: 2023-03-28 08:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి పార్టీకి గెలిపించే ‘గేమ్ ఛేంజర్’ ఒకరు ఉంటారు. ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొట్టడం, ప్రజల్లో విశ్వాసం కల్పించడం వంటి బాధ్యతలను భూజానికెత్తుకుంటారు. ఆ లీడర్‌ని నమ్మే ప్రజలు ఓట్లేస్తారు. కేంద్రంలో రెండు దఫాలుగా అధికారంలోకి వచ్చిన బీజేపీకి మోడీ అన్ని తానై వ్యవహరించారు. మోడీ నాయకత్వంపై నమ్మకంతో దేశ ప్రజలు రెండు సార్లు ప్రధానిగా అవకాశమిచ్చారు. ఇలా ఆయా రాష్ట్రాల్లోనూ ప్రధాన పార్టీలకు గెలిపించే సత్తా ఉన్న నాయకులపై ఆధారపడే ప్రభుత్వాలు ఏర్పాటవుతున్నాయి.

అక్కడ రాహుల్.. ఇక్కడ కేసీఆర్

అయితే కాంగ్రెస్‌లో రాహుల్‌కు ఆల్టర్నేట్ ఫేస్ కనిపించకపోవడం, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నిలవరించడమే టార్గెట్‌గా బీజేపీ తన మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. రానున్న కాలంలో కాంగ్రెస్‌తోనే తమకు ముప్పు అని, ప్రతిపక్షాల్లో ప్రధాని విషయంలో భేదాభిప్రాయాలు ఉన్న విషయాన్ని గమనించి కమలదళం రాహుల్ గాంధీని టార్గెట్ చేసింది. పార్టీ మొత్తాన్ని దెబ్బ తీయాలంటే నాయకున్ని దెబ్బ తీయాలనే చందంగా బీజేపీ దూకుడు పెంచింది.

సేమ్ ఫార్ములా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ విషయంలోనూ అమలు చేస్తోంది. అందుకే లిక్కర్ స్కాం విషయంలో వేగం పెంచింది. కవిత విషయంలో ఈడీ అసలు తగ్గడం లేదు. ఇతర ఏ లీడర్లను దెబ్బతీసిన పార్టీ ప్రతిష్ట మసకబారదని భావించి డైరెక్ట్‌గా కీలక వ్యక్తులను టార్గెట్ చేసింది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని, స్టేట్‌లో బీఆర్ఎస్ టార్గెట్‌గా బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది.

గురి గాంధీలపైనే..

అయితే గతంలో కాంగ్రెస్ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని బీజేపీ ఆరోపించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను టార్గెట్ చేసింది. ఆ సందర్భంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ఇతర పార్టీల కన్నా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి క్షేత్ర స్థాయిలో క్యాడర్ ఉంది. దీంతో చెట్టు కొమ్మలను కాకుండా నేరుగా వేర్లపైనే బీజేపీ గురి పెట్టింది. అందుకే గాంధీలపై ఫోకస్ పెట్టి కార్యచరణ మొదలు పెట్టింది.

సోనియా గాంధీకి రాజకీయాల్లో రిటైర్మెంట్ వయసు రావడం, ప్రియాంక గాంధీ ఇప్పుడిప్పుడే యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రావడం కారణంగా రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుంది. రాహుల్ కాంగ్రెస్‌కు గత వైభవాన్ని తెచ్చే బాధ్యతను భూజానికెత్తుకున్నారు. ఈ సందర్భంలోనే బీజేపీ, మోడీలపై పలు సందర్భాల్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే రాహుల్ గాంధీ జోడో యాత్ర ఎఫెక్ట్‌పై నజర్ పెట్టిన బీజేపీ మునుపెన్నడూ లేనంత వేగంగా రాహుల్‌పై చర్యలకు ఉపక్రమించింది.

ప్రతిపక్షాలన్నీ ఒక తాటిపైకి వచ్చే ఛాన్స్ ఉండటం, రాహుల్ గాంధీ కాంగ్రెస్‌లో కీ రోల్ పోషించడంపై ఉన్న అనుమానాల నేపథ్యంలో ఎలాగైనా రాహుల్‌ను ఇరుకున పెట్టాలని భావించింది. అనుకున్నదే తడవుగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంలో సక్సెస్ అయింది. రాహుల్ గాంధీ మాత్రం తగ్గెదేలే.. అంటూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. జైలుకి పంపితే పంపండంటూ తెగువ చూపుతున్నారు.

అయితే రానున్న రోజుల్లో రాహుల్ భవితవ్యం ఎలా ఉండనుంది.. తమకు మద్దతు ఇస్తున్న ప్రతిపక్షాలతో కలిసి నడిచేందుకు సై అంటారా అనే అంశాలు ఆసక్తిగా మారాయి. ఇక కేంద్రంలో రాహుల్ గాంధీ ఫ్యూచర్‌లో ఏ పాత్ర పోషించబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది. మరి రాహుల్ విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయం సరైందా.. కాదా అనేది రానున్న ఎన్నికలు తేల్చనున్నాయి.   

Tags:    

Similar News