Rain Alert: రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. మరో రెండు రోజుల పాటు వర్షాలు
పశ్చిమ మధ్య, దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో నేడు గురువారం నుంచి మరో రెండు రోజుల పాట వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
దిశ, తెలంగాణ బ్యూరో: పశ్చిమ మధ్య, దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో నేడు గురువారం నుంచి మరో రెండు రోజుల పాట వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇది శుక్రవారం నాటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల , భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. కాగా శుక్రవారం నుండి శనివారం వరకు ములుగు, సూర్యాపేట, జనగామ, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. గురువారం నుండి శుక్రవారం వరకు ఈ రెండు రోజుల్లోన కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. కాగా శనివారం నుండి రాష్ట్రంలో పొడివాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.