ఊసరవెల్లి కూడా సిగ్గుతో తలదించుకుంటోంది: కాంగ్రెస్ నేతలపై లక్ష్మణ్ ఫైర్

ఊసరవెల్లి కూడా సిగ్గుతో తలదించుకుంటోందని కాంగ్రెస్ నేతలపై లక్ష్మణ్ ఫైర్ అయ్యారు...

Update: 2024-12-25 16:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుతం రాజకీయాల్లో నాయకులు ఎప్పటికప్పుడు రంగులు మారుస్తున్నారని, అలాంటి రంగులు మార్చే నాయకులతో ఊసరవెల్లి కూడా సిగ్గుతో తలవంచుకుంటోందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఎద్దేవాచేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం వాజ్ పేయ్ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వాజపేయ్ విలువలతో కూడిన ఒక అజాత శత్రువు అని కొనియాడారు. రాజకీయాల కంటే దేశమే ముఖ్యమని నమ్మిన వ్యక్తి అని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ దౌత్య సంబంధాల మేరకు లాహోర్ బస్ యాత్ర చేపట్టిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో వాజ్ పేయ్ పాత్ర కీలకమన్నారు. ఇద్దరు ఎంపీలు ఉన్న బీజేపీ నేడు ప్రపంచంలో అతి పెద్ద పార్టీగా అవతరించిందని, దీనిలో వాజపేయ్ పాత్ర మరువలేనిదన్నారు.

రాజ్యాంగాన్ని, అంబేద్కర్ ను అవమానిపరిచిన కాంగ్రెస్ ఇవాళ రాజ్యాంగంపై మొసలి కన్నీరు కారుస్తోందని చురకలంటించారు. అనంతరం నిర్వహించిన సుపరిపాలన దినోత్సవ సభలో మాట్లాడుతూ.. పార్లమెంట్ లో ఒక్క ఓటుతో ప్రభుత్వం పడిపోతుందని తెలిసినా, నైతిక విలువల కారణంగా రాజీనామా చేసి తిరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి తీసుకొచ్చారని గుర్తుచేశారు. తెలంగాణలో రాజకీయాల్లో పూటకో కండువా కప్పుకుంటూ రాజకీయాలు చేస్తున్నారని, ఏ పార్టీ నాయకులు ఏ పార్టీలోకి మారుతారో తెలియని పరిస్థితి ప్రస్తుతం ఉందన్నారు. దేశాన్ని మత ప్రాతిపదికన రెండు ముక్కలు అవ్వడానికి ప్రధాన కారణం నెహ్రూయేననేది రేవంత్ రెడ్డి తెలుసుకోవాలని చురకలంటించారు. నాడు పాకిస్తాన్ దాదాపు 75 వేల కిలోమీటర్ల మేర భారతదేశాన్ని ఆక్రమించుకుందంటే దానికి కాంగ్రెస్ అని మండిపడ్డారు.

భారత్-చైనా సరిహద్దుకు సంబంధించి స్పష్టమైన రేఖాచిత్రాన్ని కూడా కాంగ్రెస్ రూపొందించలేకపోయిందని ఫైరయ్యారు. దీంతో దేశ సరిహద్దు ఆక్రమణకు గురైందన్నారు. 1971లో పాకిస్తాన్ తో యుద్ధ సమయంలో 93,000 మంది పాకిస్తానీ యుద్ధ ఖైదీలను బంధీలుగా చేసుకుని భారత్ గెలిచినప్పటికీ.., ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎలాంటి షరతులు లేకుండా ఆ సైనికులను విడుదల చేసిందని పేర్కొన్నారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో భారత సైనికులు పాకిస్తాన్ లో సర్జికల్స్ స్ట్రయిక్స్ చేస్తే.. రుజువులు ఏవంటూ కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ హీన చరిత్ర బయటపడుతుండటంతో దేశంలో తుడుచుకుపోయిన కాంగ్రెస్.. తెలంగాణలో మిణుమిణుకుమంటోందని ఎద్దేవాచేశారు. రాబోయే రోజుల్లో రేవంత్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారని వ్యాఖ్యానించారు.


Similar News