వాళ్లను కించపర్చవద్దు.. BSNLకు మాజీ ఎంపీ ​లేఖ

వాళ్లను కించపర్చవద్దంటూ BSNLకు మాజీ ఎంపీ వినోద్ కుమార్ ​లేఖ రాశారు..

Update: 2024-12-25 16:41 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మొబైల్​ఫోన్​సందేశం పేరిట జడ్జిలు, పోలీసులను అధికారులను కించపర్చవద్దని బీఎస్ఎన్ఎల్ హైదరాబాద్ సీజీఎంకు బీఆర్‌ఎస్​మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన లేఖ రాశారు. తాజాగా దేశంలో రోజురోజుకు సైబర్‌క్రైంలు పెరుగుతూపోతున్నాయని, వీటిని అరికట్టేందుకు గాను, ప్రజలను జాగృత పరిచేందుకు గాను ప్రస్తుతం నెట్‌వర్క్‌లు ఫోన్‌రింగ్‌ కావడానికి ముందు ప్రజలకు ఒక సమాచారాలను అందిస్తున్నాయని, ఇందులో కొన్ని తప్పులు వస్తున్నాయన్నారు. ‘మీకు పోలీసులు, జడ్జిలు, వీడియో కాల్స్‌ చేస్తూ సైబర్‌ క్రైంలకు పాల్పడవచ్చు, అలాంటి కాల్స్‌ మీకేమైనా వస్తే వెంటనే అప్రమత్తమై సైబర్‌ క్రైం పోలీసులకు సమాచారం ఇవ్వండి’ అంటూ వినిపిస్తున్నదని, అయితే అందులో ‘జడ్జిలు, పోలీసులే నేరుగా వీడియో కాల్‌ చేసి సైబర్‌ క్రైంలకు పాల్పడవచ్చు’ అనే అర్థం వస్తున్నదని, ఇందులో ‘పోలీసులు, జడ్జిల పేరిట’ అని రావాల్సిన సమాచారం తప్పుగా వస్తున్నదని మాజీ ఎంపీ బి.వినోద్ కుమార్ అన్నారు. ఈ సమాచారం జడ్జిలను, పోలీసు అధికారులను కించపరిచే విధంగా ఉన్నదని, ఈ తప్పుడు సమాచారాన్ని సరిచేయవలిసందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మొబైల్‌ నెట్‌వర్క్‌ల కంపెనీలను కోరుతున్నానని బి.వినోద్ కుమార్ ఆ లేఖలో రాశారు.

నాటికీ నేటికి ఎంతో తేడా ఉందన్నారు. కొన్ని దశాబ్దాల కిందట ఏదేని సమాచారాన్ని పోస్టుకార్డు ద్వారా చేరవేసేందుకుగాను వారం రోజులకుపైగా సమయం పట్టేదని, ఆ తర్వాత ల్యాండ్‌ఫోన్‌ అందుబాటులోకి రాగా ప్రస్తుతం సెల్‌ఫోన్‌ సమాచారాన్ని క్షణాల్లో చేరవేస్తున్న విషయాన్ని అధికారులు గుర్తించాలన్నారు. సెల్‌ఫోన్‌ ఒక్కటి అందుబాటులో ఉంటే సరిపోదని , దానికి తోడు నెట్‌వర్క్‌ కూడా ఉండాల్సిందేనన్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ నెట్‌వర్క్‌ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ను మొదట అందుబాటులోకి వచ్చాక మరి కొన్ని ప్రైవేట్​ సంస్థలు ముందకు వచ్చి ఈ పోటీ ప్రపంచంలో ‘మేము తక్కువ ధరకే మా నెట్‌వర్క్‌ అందిస్తామని పదులకొద్దీ నెట్‌వర్క్‌లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయన్నారు.

దేశంలో ఎలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినా ఈ మొబైల్‌ నెట్‌వర్క్‌లు ప్రజలను జాగృతపరిచేందుకుగాను ముందుంటున్నాయని, ఈ ఆధునిక కాలంలో సెల్‌ఫోన్‌ ప్రాధాన్యాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని మాజీ ఎంపి బి. వినోద్​ కుమార్​అన్నారు. అందులో భాగంగానే ఎదుటి వ్యక్తికి ఫోన్‌ చేసినప్పుడు మనకు వినిపించే సాధారణ రింగ్‌కు ముందుగా కొన్ని విలువైన సూచనలు చేస్తుంటాయని, ఇది ఆహ్వానించదగిన పరిణామమేనన్నారు. అంతకుముందు ఈ సేవలు అరకొరగా అమలు చేసినప్పటికీ యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్‌-19 మహమ్మారి తర్వాత ఈ తరహా సేవలు విస్తృతమయ్యాయని వినోద్​కుమార్​ అన్నారు. నెట్‌వర్క్‌లు ఆయా ప్రభుత్వాలతో అనుసంధానమై ఆ సేవలను కొనసాగిస్తున్నాయని, నాటి నుంచి నేటిదాకా ప్రకృతి విపత్తులు, మానవ విపత్తుల వంటివేవి ఎదురైనా ఈ నెట్‌వర్క్‌లు ముందుండి వాటి బాధ్యతను నిర్వర్తిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.


Similar News