త్వరలో కొత్త క్లీన్, రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ

రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్లీన్, రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీని త్వరలో తీసుకురానున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2024-12-25 16:15 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్లీన్, రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీని త్వరలో తీసుకురానున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రీన్ ఎనర్జీకి పెరుగుతున్న డిమాండును అధిగమించడానికి, జాతీయస్థాయిలో పెట్టుకున్న లక్ష్యాలను అందుకోడానికి దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులతో వచ్చే ఏడాది జనవరి 3వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్ఐసీసీ)లో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ గ్రీన్ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ పాలసీపై చర్చిస్తామన్నారు. అందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కొత్త క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని తీసుకురానుందని చెప్పారు.

దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని వివరించారు. వివిధ రంగాల్లో విస్తరించి ఉన్న విభిన్న ఆర్థిక వ్యవస్థను కలిగి ఉందన్నారు. తెలంగాణ గరిష్ట విద్యుత్ డిమాండ్ 2023-24 లో 15,623 మెగావాట్లుగా ఉందని, 2027-28 నాటికి 20,968 మెగావాట్లకు చేరుకుటుందన్నారు. 2034-35 నాటికి 31,809 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని భట్టి తెలిపారు. 2023-24లో 85,644 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరగగా.. 2027-28 నాటికి 1,15,347 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమవుతుందని అంచనా వేశారు. 2034-35లో నాటికి 1,50,040 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమని పేర్కొన్నారు. అందుకోసం తెలంగాణ 2030 నాటికి 20 వేల మెగావాట్ల క్లీన్, గ్రీన్ విద్యుత్ ను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టంచేశారు.


Similar News