Congress: పంచాయతీ ఎన్నికలపై ఫోకస్..! సంక్షేమ పథకాలే ఆయుధంగా కాంగ్రెస్ దూకుడు
కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగుతున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగుతున్నది. లోకల్ బాడీస్ ఎన్నికల్లో ఏకపక్షంగా ఫలితాలను సాధించాలని ఈ మేరకు రకరకాల వ్యూహాలను అమలు చేస్తున్నది. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం వల్ల రాజకీయంగా మరింత సుస్థిరతను సాధించవచ్చని అంచనా వేస్తున్నది. ఇప్పటికే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ తగిలింది. ఓటు బ్యాంకు సైతం భారీగా పడిపోయింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆ పార్టీని గట్టి దెబ్బతీయాలని కాంగ్రెస్ పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేస్తున్నది. ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు కొత్తగా మరికొన్నింటిని ఇంప్లిమెంట్ చేసేందుకు సిద్ధమైంది. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని ప్రయత్నిస్తున్నది.
సంక్రాంతి తరువాత ఎన్నికలు..?
గ్రామాల్లో సర్పంచుల కాల పరిమితి ముగిసి ఏడాది కావస్తున్నా.. ఇంకే ప్రత్యేక అధికారుల పాలనే కొనసాగుతున్నది. ఈ క్రమంలో సంక్రాంతి తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అందుకే.. దానిని టార్గెట్‌గా పెట్టుకొని.. ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలను అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నది. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్టు సమాచారం. దీనికోసం అవసరమైన చట్ట సవరణలను ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో పూర్తిచేశారు.
పథకాలపై ప్రభుత్వం ఫోకస్
ఎన్నికలకు ముందు పథకాలను అమలు చేయడం ద్వారా వీలైనంతా మైలేజీ పొంది ఎక్కువ స్థానాల్లో విజయం సాధించొచ్చని అధికార పార్టీ ఆలోచిస్తున్నది. అందులో భాగంగానే ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు నెలకు రూ.వెయ్యి, కొత్త రేషన్‌కార్డుల ప్రక్రియ ప్రారంభం, పెండింగ్‌లో ఉన్న మాజీ సర్పంచ్‌ల బిల్లుల విడుదల వంటివి ప్లాన్ చేస్తున్నది. ఈ నెల 28న కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వ్యవసాయ కూలీలకు నెలకు రూ.వెయ్యి చొప్పున ఇచ్చే పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నది. ఆరు నెలలకు సంబంధించిన మొత్తాన్ని (రూ.6వేలను) ఒకేసారి ఇవ్వనున్నది. దీనికోసం లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చురుగ్గా సాగుతున్నది. ఇక.. ఆరు గ్యారంటీల్లో రైతు భరోసా ప్రధానమైంది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారు. సంక్రాంతి తరువాత వీరి ఖాతాల్లో నిధులు జమ చేయనున్నది. ఈనెల 30న జరగనున్న కేబినెట్‌సమావేశంలో మార్గదర్శకాలకు ఆమోదముద్ర వేయనున్నది. ఈ పథకం ద్వారా ప్రతి గ్రామంలో భారీ సంఖ్యలో రైతులను సంతృప్తి పర్చవచ్చని అధికార పార్టీ ఆలోచన.ణ
ఇందిరమ్మ ఇండ్లు.. రేషన్ కార్డులు
పదేండ్లలో ఇండ్ల నిర్మాణాల విషయంలో బీఆర్ఎస్వ్యవహరించిన తీరుపై గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల మంది లబ్ధిదారులను ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేయడం ద్వారా గ్రామాల్లో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. మొదట స్థలాలు ఉన్న వారికే ఇండ్లను కేటాయించనున్నారు. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియనూ ప్రభుత్వం ప్రారంభించనున్నది. అలాగే.. మాజీ ప్రజాప్రతినిధుల పెండింగ్ బిల్లులను సైతం విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నది. దీంతో కొన్ని సంవత్సరాలుగా బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న మాజీ ప్రజాప్రతినిధుల్లోనూ కాంగ్రెస్ పట్ల సానుభూతి ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇరకాటంలోకి బీఆర్ఎస్
ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బీఆర్ఎస్‌ను ఇరకాటంలోకి నెట్టి బలహీనమైంగా మార్చడం ద్వారా కిందిస్థాయిలో పోటీ లేకుండా, సులువుగా స్థానాలు గెలువవచ్చనే అంచనాలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. గులాబీ పార్టీ అధికారంలో ఉండగా చేసిన అక్రమాలన్నింటినీ ఒక్కొక్కటిగా తవ్వుతూ బయటకు తీస్తున్నది. ఈ క్రమంలో ఫార్ములా ఈ-కారు రేసు కేసు నమోదైంది. ఒకవైపు ఏసీబీ, మరోవైపు ఈడీ విచారణ ప్రక్రియను మొదలెట్టాయి. కేటీఆర్జైలుకు వెళ్తే పార్టీ కేడర్ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఫోన్ట్యాపింగ్వ్యవహారంలో విచారణకు హాజరయ్యారు. రాబోయే రోజుల్లో మరికొంత మంది విచారణకు హాజరవుతారని సమాచారం.