వచ్చే ఎన్నికల్లో పొత్తులపై T- BJP చీఫ్ బండి సంజయ్ కార్లిటీ
రాష్ట్రంలో బీజేపీకి ఏ పార్టీతో పొత్తు ఉండదని, సింహం సింగిల్‌గానే వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీజేపీకి ఏ పార్టీతో పొత్తు ఉండదని, సింహం సింగిల్‌గానే వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పొత్తులు ఉంటాయని ఇతర పార్టీలు చేస్తున్న ప్రచారానికి ఆయన తెరదించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 1999లో చంద్రబాబు ప్రత్యామ్నాయంగా మారారని, 2004లో కాంగ్రెస్, 2014లో బీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా కనిపించిందని, కానీ నేడు బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగిందని, ప్రతి ఒక్కరూ తమ పార్టీ వైపే చూస్తున్నారని వెల్లడించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. ప్రజా సమస్యలపై కొట్లాడే పార్టీ బీజేపీ అని, ఎన్ని కేసులు పెట్టినా, అరెస్టులు చేసినా ఎదురించి యుద్ధం చేస్తున్న వారు బీజేపీ కార్యకర్తలని ఆయన పేర్కొన్నారు. అందుకే కుటుంబ పాలనను అంతం కావాలని కోరుకుంటున్నారన్నారు.
బీజేపీ అధికారంలోకి వస్తే.. మహిళలపై అత్యాచారాలు చేసే లుచ్చాగాళ్ల అంతు చూస్తామని బండి సంజయ్ సంచలన కామెంట్లు చేశారు. యూపీ తరహాలో బుల్డోజర్లతో వారి ఇండ్లు కూల్చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో మహిళలను చితి మంటలపై పేరుస్తున్న మూర్ఖుడు కేసీఆర్ అని ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో రోజురోజుకూ హత్యలు, ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, మహిళలకు భద్రత కరువైందని బండి ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ గూండాలు వైఎస్ షర్మిల సహా మహిళలను దారుణంగా కించపరుస్తుంటే సహించాలా? అని ఉద్ఘాటించారు. అమ్మాయిల విషయంలో తప్పు చేస్తే గుడ్లు పీకేస్తానని కేసీఆర్ గతంలో చేసిన హెచ్చరికలన్నీ ఉత్తమాటలేనని చురకలంటించారు. ప్రధాని మోడీ ఎస్టీ సామాజికవర్గానికి చెందిన మహిళను రాష్ట్రపతిగా చేయడంతోపాటు మహిళలకు ఉన్నత పదవులిచ్చి గౌరవించారన్నారు.
దేశ రక్షణ మంత్రిగా నిర్మలా సీతారామన్‌ను నియమించిన ఘనత బీజేపీకి దక్కిందన్నారు. రూ.40 లక్షల కోట్ల దేశ బడ్జెట్ ను సీతారామన్ చేతిలో పెట్టారన్నారు. 12 మంది మహిళా మంత్రులను, 8 మంది గవర్నర్లను, నలుగురిని సీఎంలుగా చేసిన ఘనత నరేంద్రమోడీదని కొనియాడారు. సీఎం కేసీఆర్ చేతగానితనంవల్ల ప్రీతి మరణిస్తే మహిళా మోర్చా దమ్ము చూపించిందన్నారు. బీజేపీ మహిళా మోర్చా, యువ మోర్చా సమావేశాలు సహా ఏ మీటింగ్ పెట్టినా పోలీసులు బందోబస్తు పెడుతున్నారని పేర్కొన్నారు. ప్రీతిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని బండి ఆరోపించారు. సైఫ్ అనే సైకో హత్య చేశాడన్నారు. సీఎంవో నుంచి వచ్చిన ఫోన్ తో ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేస్తున్నారని బండి సంజయ్ విమర్శలు చేశారు. బండి సంజయ్ అంటే కేసీఆర్ కొడుకు కేటీఆర్ కు భయం పట్టుకుందని, ఆయన పేరును ప్రస్తావించొద్దని కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడని బండి సంజయ్ విమర్శలు చేశారు.