ఆ రూ. 15 కోట్లు ఎక్కడివి? మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసులో అనుమానాలు
దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్య కుట్ర కేసులో నిందితులను పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ మేడ్చల్ కోర్టు అనుమతించింది. నాలుగు రోజుల పాటు విచారించేందుకు సైబరాబాద్ పోలీసులకు అవకా
దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్య కుట్ర కేసులో నిందితులను పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ మేడ్చల్ కోర్టు అనుమతించింది. నాలుగు రోజుల పాటు విచారించేందుకు సైబరాబాద్ పోలీసులకు అవకాశం కల్పించారు. మరికొద్దిసేపట్లో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోనున్నారు. ఏ1 నిందితుడు రాఘవేంద్రరాజుతో పాటుగా ఆయన సోదరులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అమరేందర్‌రాజు, మధుసూదన్‌రాజు, నాగరాజు సహా మొత్తం 8 మంది నిందితులను పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమను వేధింపులకు గురి చేశాడని, ఆర్థికంగా ఇబ్బందులపాలు చేయడంతో హత్య చేసేందుకు కుట్ర చేసినట్లు ప్రాథమిక రిపోర్టులో సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. మంత్రి హత్యకు రూ. 15కోట్లు సుఫారీ ఒప్పందం చేసుకున్నట్లు కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే వారిని అరెస్ట్ చేసి, మేడ్చల్ కోర్టుకు తరలించారు. వారిని విచారించాలని మేడ్చల్కోర్టులో పోలీసులు పిటిషన్ వేయగా.. సోమవారం విచారించిన కోర్టు నాలుగు రోజుల కస్టడీకి అనుమతిచ్చింది.
ఈ నేపథ్యంలో పోలీసులు విచారణకు సిద్ధమవుతున్నారు. ఎక్కడ చంపాలనుకున్నారు, సుఫారీ గ్యాంగ్ వివరాలను రాబట్టకోనున్నారు. అంతేకాకుండా మంత్రి హత్యకు సుఫారీ రూ. 15 కోట్లు ఎలా సర్దుబాటు చేస్తారనేదే ఇప్పుడు కీలకంగా మారింది. ఇందులో ఏదైనా రాజకీయ కోణం ఉందా అనే అనుమానాలు సైతం ఉన్నట్లు ముందుగానే పోలీసులు ప్రకటించారు. కానీ, రిమాండ్ రిపోర్టులో మాత్రం మంత్రి వేధింపులు ఎక్కువవడంతోనే హత్య కుట్ర చేసినట్లు వెల్లడించారు. నిందితుల విచారణ సందర్భంగా ఇవన్నీ బయటకు వచ్చే అవకాశాలున్నాయి. అయితే, పోలీసులు ఏ విధంగా బయటకు లీకులిస్తారనేది మాత్రం సందేహంగానే ఉంది.
మరోవైపు పోలీసులు ఇప్పటి వరకు నిందితులను మీడియా ముందుకు తీసుకురాలేదు. నిందితుల తరుపున కుటుంబ సభ్యులు ఈ హత్య కుట్రను కొట్టి పారేశారు. అంతేకాదు.. నాలుగు రోజుల ముందుగానే మహబూబ్‌నగర్‌లోని ఇండ్ల నుంచి అదుపులోకి తీసుకుని, కట్టుకథ అల్లి, సుచిత్ర దగ్గర నడిరోడ్డుపై కత్తులతో తిరుగుతుంటే ఆరెస్ట్ చేశారని చెప్పుతున్నారని, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికకు సంబంధించిన అఫడవిట్ కేసు కీలక దశకు వచ్చిన నేపథ్యంలోనే ఈ కథను అల్లారంటూ ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసుల విచారణ కీలకంగా మారింది.