సుర్రుమంటున్నది..! రాష్ట్రంలో ఠారెత్తుతున్న ఎండలు

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి.

Update: 2023-04-13 01:45 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్టోగ్రతలతో జనాలు బెంబేలెత్తుతున్నారు. ఉదయం 11 గంటల దాటితే బయటకు వెళ్దామా? వద్దా ? అన్న ఆలోచనలో పడేస్తున్నాయి. మధ్యాహ్నం అయితే సుర్రుమంటున్నది. ఏ ఇద్దరు కలిసినా హీటెక్కిస్తున్న ఎండలపైనే చర్చించుకుంటున్నారు. ఉష్ణోగ్రతలు ఇలా అనూహ్యంగా పెరిగిపోతుండటానికి ఎల్ నినో కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈఏడాది తీవ్ర ఎండలు ఉంటాయని పేర్కొంటున్నారు. గడిచిన వారం రోజులుగా గరిష్ట ఉష్టోగ్రతలు 32 డిగ్రీల సెల్సియస్‌కు పైగానే నమోదవుతున్నది. గత శుక్రవారం గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

ఎల్‌నినో ఎఫెక్టేనా.?

వేసవి మొదట్లోనే ఎండలు దంచి కొడుతుండగా.. లానినో వెళ్లిపోయి ఈసారి ఎల్‌నినో వచ్చినట్టుగా వాతావరణ నిపుణులు చెప్పారు. భూమధ్య రేఖ వెంట పసిఫిక్​మహా సముద్రంపై అసాధరణ స్థాయిలో వేడి ఉత్పన్నమైతే ఎల్‌నినో.. అసాధారణ చల్లదనం ఏర్పడితే దానిని లా‌నినో అంటారని తెలిపారు. వీటిని ఆసిలేషన్​సిస్టమ్‌గా పిలుస్తారని వివరించారు. ఈ రెండు పరిణామాలు ప్రతీ మూడు నాలుగేళ్లకు భ్రమణంలో సంభవిస్తుంటాయని చెప్పారు. గడిచిన రెండున్నరేళ్లకు పైగా లా‌నినో ఎఫెక్ట్ ఉండటంతోనే వర్షపాతం ఎక్కువగా నమోదైందన్నారు.

ఉష్ణోగ్రతలు కూడా మరీ అంత ఎక్కువగా లేవన్నారు. ప్రస్తుతం లా నినో వెళ్లిపోయి ఎల్‌నినో వచ్చిందని వివరించారు. ఫలితంగా ఈసారి ఎండలు ఏప్రిల్‌లో 42 డిగ్రీల సెల్సియస్‌కు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని చెప్పారు. మేలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని.. చెబుతూ గరిష్ట ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్​దాటే అవకాశాలు ఉన్నాయన్నారు. ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడానికి అడవులు అంతరిస్తుండటంతో పాటు వాతావరణ కాలుష్యం కర్బన ఉద్గారాలు కూడా కారణమని విశ్లేషించారు. ఏటా లక్షల సంఖ్యలో వాహనాలు పెరిగిపోతున్న కారణంగా ఏర్పడుతున్న కాలుష్యం, పరిశ్రమల నుంచి వస్తున్న పొల్యూషన్ మొత్తంగా వాతావరణాన్ని దెబ్బ తీస్తున్నాయని పేర్కొంటున్నారు.

పట్టణాల్లో మరీ అధికం

ఈసారి ఎండలు పట్టణాల్లో జనానికి చుక్కలు చూపించటం ఖాయమని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఒకటి రెండు జిల్లాలు మినహాయించి మిగతా ప్రాంతాల్లో పల్లెల్లో ఎంతో కొంత పచ్చదనం, చెట్లు ఉండగా.. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనా కాస్త చల్లగానే ఉంటుందన్నారు. ఇది హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నల్గొండ తదితర పట్టణాల్లో ఉండదన్నారు.

పైగా పట్టణ ప్రాంతాల్లో పెరిగిపోతున్న వాహనాలు, పరిశ్రమల కాలుష్యంతోనూ సమ్మర్‌లో ఉక్కపోత మరింతగా పెరిగిపోతుందన్నారు. ప్రస్తుతం కాస్త ఎక్కువ సంఖ్యలో చెట్లు ఉన్నాయంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్‌లోని ఎన్‌జీ రంగా అగ్రికల్చర్​వర్సిటీకి వెళ్లాల్సిందేనన్నారు. ఈ ప్రాంతాలకు వెళితే ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయన్నారు.

అవసరమైతే తప్ప..

ఎండలు ఎక్కువగా ఉండే పగటి వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటున్నారు. లేదంటే వడదెబ్బతో పాటు డీహైడ్రేషన్, డయేరియా వంటి వాటి బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వాటర్​మిలన్, నిమ్మకాయ రసం, సీ విటమిన్​అధికంగా ఉండే పండ్లను తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎండాకాలంలో మజ్జిగ కూడా చాలా మంచిదని చెప్పారు.

Tags:    

Similar News