Special Story: మినరల్​ లెస్ వాటర్.. ఖనిజ లవణాలను మాయం చేస్తున్న ఆర్వో

నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశం ఇవి ప్రకృతి సంపద. కానీ.. కొందరు వ్యాపారాల పేరిట వాటిని ఆక్రమించేస్తున్నారు.

Update: 2024-09-14 08:36 GMT

నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశం ఇవి ప్రకృతి సంపద. కానీ.. కొందరు వ్యాపారాల పేరిట వాటిని ఆక్రమించేస్తున్నారు. సామాన్యులకు కనీస అవసరాలను కూడా ఖరీదైన వ్యవహారంగా మార్చేస్తున్నారు. గతంలో అందరూ చెరువులు, బావుల నీళ్లే తాగేవారు. తాగే గ్లాసులు వారివారి స్థాయుల్లో ఉన్నా.. నీళ్లు మాత్రం అందరికీ ఒకటే ఉండేది. కానీ, ఇప్పుడు తాగే నీళ్లలోనూ స్థాయిబేధం వచ్చేసింది.. ఒక లీటర్​నీరు కనీసం 20 రూపాయల నుంచి లక్షల్లో పలుకుతున్నది. ఎంత డబ్బు ఉంటే అంత ఖరీదైనది కొనుగోలు చేయవచ్చు. నిజానికి ఇదంతా మార్కెట్​మాయాజాలం. మనిషికి అవసరమైన కనీస అవసరాలు తీర్చుకునేందుకు అందుబాటులో ఉన్నా.. వాటిని తీసుకోవడం అనాగరికమని ప్రచారం చేస్తూ ఆర్థికంగా దోచేస్తున్నారు.

మీరు ఇంకా ఉప్పు, బొగ్గుతో పళ్లు తోముకుంటున్నారా? ఇంత అనాగరికమా? అంటూ గతంలో ఓ టూత్‌పేస్ట్ భారతీయుల అలవాట్లను హేళన చేస్తూ తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకున్నది. ఇప్పుడు అదే సంస్థ మీ పేస్ట్‌లో ఉప్పు ఉందా? బొగ్గు ఉందా? అంటూ టీవీల్లో యాడ్లు ఇస్తున్నది. పిల్లలకు చెరుకు రసం, కొబ్బరినీళ్లు, పళ్ల రసాలు ఇవ్వాలన్నా ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు.. రోడ్డుపై ఉన్న వ్యాపారులనుంచి కొనుగోలు చేయడం లేదు. పేరున్న షాపుల్లోకి వెళ్లి ఖరీదైన బ్రాండ్లు మాత్రమే కొంటున్నారు. ఇది సోషల్​స్టేటస్​గా పొరబడుతున్నారు. మనకు చేతికి అందే దూరంలో ఉన్న సహజ వనరులను కార్పొరేట్​సంస్థలు లాగేసుకుంటున్నాయన్న స్పృహ ఎవరికీ ఉండటం లేదు. ఇదంతా కార్పొరేట్​సామ్రాజ్యాలు చేస్తున్న మాయా ప్రచారం. ఆ వలలో చిక్కి స్టేటస్​పేరిట మధ్యతరగతి ప్రజలు లేనిపోని కష్టాలు తెచ్చుకుంటున్నారు. మినరల్​వాటర్​పేరిట ప్రచారం అవుతున్న ఆర్వో వాటర్‌పై ప్రత్యేక కథనం. - హరీశ్​ఎస్పీ

ప్యూరిఫయర్లు.. రకాలు

మారుతున్న పరిస్థితులు.. తీరిక జీవితాల వల్ల చాలా మంది ఇళ్లలో వాటర్​ప్యూరిఫయర్లు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం సరఫరా చేసే నీటి నాణ్యత లేకపోవడం.. గతంలో వాడిన ఫిల్టర్లు వల్ల నీటిలోని మట్టిని ఆపుతున్నదే కానీ, మనిషికి అనారోగ్యానికి కలిగించే మూలకాలు ఆపడంలేదన్న వాదనలతో అందరూ వాటర్​ప్యూరిఫయర్లను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం మనదేశంలో మార్కెట్‌లో మూడు రకాల ప్యూరిఫయర్లు అందుబాటులో ఉన్నాయి. అవి 1. ఆర్​వో 2 యూవీ 3. యూఎఫ్.. ​

ఆర్‌వో

ఆర్వో (రివర్స్​ఆస్మోసిస్).. నీళ్లలోని ​లవణాలు, ఖనిజాలను పూర్తిగా నిరోధించే సాంకేతికత. ఇప్పుడు దాదాపు చాలా ఇళ్లలో ఇదే టెక్నాలజీ ప్యూరిఫయర్లు ఉన్నాయి. ఆర్వో ప్యూరిఫైయర్లలో మూడు ఫిల్టర్లు ఉంటాయి. శాండ్, కార్బన్, వాటర్​సాఫ్ట్​నర్​అనేవి ఉంటాయి. మామూలుగా బోర్​లేదా ట్యాప్​నుంచి వచ్చే నీళ్లు మొదట శాండ్​ఫిల్టర్ లోకి వస్తాయి. అక్కడినుంచి కార్బన్, సాఫ్ట్​నర్​ఫిల్టర్​లోకి వస్తాయి. అయితే, ఈ పంపింగ్​చాలా ఫోర్స్ తో ఉంటుంది. ఇందులో మెంబ్రేన్​అనే ఫిల్టర్​ఉంటుంది. వాటికి ఉండే రంధ్రాలు .0001 మైక్రాన్స్​సైజులో ఉంటాయి. మన వెంట్రుక సైజ్​30 మైక్రాన్లు అంటే ఆ రంధ్రాల సైజు ఎంత చిన్నదో అర్థం చేసుకోవచ్చు. చాలా ప్రెజర్​తో పంపింగ్​చేయడంతో శాండ్​, కార్బన్​ఫిల్టర్లలో దాదాపుగా నీళ్లలో ఉండే మలినాలు, మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీసే క్యాడ్మియం, ఫ్లోరైడ్, లెడ్ ఖనిజాలతోపాటు అవసరమైనవి ఖనిజాలు కూడా ఆగిపోతాయి. ఈ నీటిని టీడీఎస్​(టోటల్​డిసాల్వ్​డ్​సాలిడ్స్​) మిషిన్​తో పరిశీలిస్తే 0 పీపీఎం వస్తుంది. అంటే అందులో ఒక్కశాతం కూడా ఎలాంటి ఖనిజాలు లేవని అర్థం. అయితే, సాఫ్ట్​నర్​వల్ల నీళ్లకు రుచి వస్తుంది. ఈ సాంకేతికతో 2000 వరకు ఉన్న టీడీఎస్​30లోపు వచ్చేస్తుంది. దీనివల్ల 99.9% ఖనిజాలు, లవణాలు లేని నీళ్లు మనకు అందుతాయి.

యూవీ

యూవీ అంటే అల్ట్రా వయలెట్.. అత్యంత శక్తివంతమైన అల్ట్రావయలెట్​కిరణాలను నీటిలోకి పంపి ఖనిజాలు, లవణాలను నిర్వీర్యం చేస్తుంది. ఇందులో మెంబ్రేన్​ఫిల్టర్​ఉండదు. ఫలితంగా నిర్వీర్యం చేసినా ఖనిజాలు, లవణాల మూలకాలు నీటిలోనే ఉంటాయి. ఇందులోని ఫిల్టర్లు నీటిలోని మట్టిని, ఇతర మలినాలను అడ్డుకోగలదు. ఈ టెక్నాలజీతో టీడీఎస్​స్థాయి 300 పీపీఎంలోపు ఉన్న నీటిని శుభ్రం చేయవచ్చు. అంతకుమించి టీడీఎస్​ఉంటే యూవీ పెద్దగా ఉపయోగపడదు.

యూఎఫ్​

యూఎఫ్​అంటే అల్ట్రా ఫిల్ట్రేషన్. ఇది ఆర్​వో లానే పనిచేస్తుంది. అయితే, ఇందులో ఉండే మెంబ్రేన్​​ఫిల్టర్​రంధ్రాలు 0.01మైక్రాన్​సైజులో ఉంటాయి. అంతకంటే పెద్ద బ్యాక్టీరియా ఇతర ఖనిజలవణాలను అడ్డుకోగలదు. కానీ, అంతకంటే చిన్నగా ఉన్నవాటిని నిరోధించలేదు. ఇది టీడీఎస్​స్థాయి 500పీపీఎంలోపు ఉన్న నీటిని శుభ్రం చేస్తుంది.

ఆర్‌వో.. దుష్పరిణామాలు

యూవీ, యూఎఫ్​కన్నా ఆర్​వో పనితీరు అద్భుతంగా కనిపిస్తున్నా.. ఇందులో అత్యంత ప్రమాదకరమైన అంశం ఏమిటంటే.. ఈ నీళ్లవల్ల దాహం తీరుతుందే తప్ప మనిషికి ఒక్కశాతం కూడా ఉపయోగం లేదు. మనిషికి అనారోగ్యం కలిగించే మలినాలు, ఖనిజాలు తీసేయడం మంచిదే అయినా అవసరమైన వాటిని కూడా తీసేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్నది. దీర్ఘకాలం ఈ నీటిని వాడితే ముఖ్యంగా మోకాలు, వెన్నెముక సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నది. ఇప్పటికే చాలామంది వైద్యులు 60 ఏండ్లు పైబడినవారు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆర్​వో నీళ్లు తాగొద్దని హెచ్చరిస్తున్నారు.

టీడీఎస్​ కంట్రోలర్​

టీడీఎస్​తో కొలిస్తే నీటిలో కనీసం 50కి పైగా 300లోపుగా పీపీఎం లెవల్స్​ఉండాలి. అప్పుడు ఆ నీరు మనిషికి పూర్తి సురక్షితమైనదిగా చెప్పవచ్చు. అయితే, చాలామంది వాడుతున్న ఆర్వో ప్యూరిఫయర్లలో ఇది సున్నా శాతంగా ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమై.. కొత్తగా వచ్చే ఆర్వో ప్యూరిఫయర్లలో టీడీఎస్​కంట్రోలర్​ఉండేలా ఆదేశాలు జారీ చేసింది. అంటే ఆర్వో వల్ల తొలగిపోతున్న నీళ్లలోని ఖనిజాలను మళ్లీ అవసరం మేరకు ఇది చేర్చి మనిషికి అవసరమైన ఖనిజాలు అందేలా చేస్తుంది. ఈ ప్యూరిఫయర్లు కనీసం 50 పీపీఎం నుంచి 200లోపు ఉంటున్నాయి. ఇది వాడటం సురక్షితమైనదని చెప్పవచ్చు.

ఆర్వో vs మినరల్​ వాటర్​

ఇళ్లలోని ఆర్వో వాటర్.. మార్కెట్లో అమ్ముతున్న మినరల్​వాటర్​రెండూ ఒక్కటేనా? మినరల్​వాటర్​మంచిదా? అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. నిజానికి ఇవి రెండూ ఒక్కటే పేరుమోసిన బ్రాండ్లు అమ్మే నీళ్లలో కూడా ఎలాంటి ఖనిజలవణాలు ఉండవు. ఆర్వో నీళ్లు ఇవి రెండూ ఒక్కటే. అయితే, కొన్ని కంపెనీలు ప్రీమియం వాటర్​పేరిట అమ్ముతున్న నీళ్లలో ఖనిజ​లవణాలు ఉన్నాయి. అయితే, అవి రూ.వందలనుంచి వేల రూపాయల వరకు ఖరీదు చేస్తాయి. సామాన్యులకు అవి ఏమాత్రం అందుబాటులో లేవు. ఫిలికో అనే సంస్థ అమ్ముతున్న నీళ్ల బాటిల్​ఖరీదు అక్షరాలు రూ.1,16,000. యూరప్​కు చెందిన ఈ కంపెనీ ప్రపంచంలోని ఎత్తైన పర్వతాల వద్దనున్న మంచినీటి సరస్సుల నీటిని అమ్ముతున్నది. మనదేశంలోనూ హిమాలయ అనే సంస్థ హిమాలయ పర్వత సానువుల్లోని శివాలిక్​రేంజ్​వద్ద ఫ్యాక్టరీని పెట్టి అక్కడే బాటిలింగ్​చేసి దేశ, విదేశాల్లో విక్రయిస్తున్నది.

మరిగించిన నీళ్లు

చెరువులు, కాలువలనుంచి వచ్చే నీటిని ఎలాంటి ఫిల్టర్లు లేకుండా రెండు నుంచి మూడు నిమిషాలు మరిగించి చల్లార్చి తాగడం మంచిది. ఇలా వేడి చేయడం వల్ల హానికర ఖనిజాలు నాళనం అవుతాయి. మనిషికి అవసరమైన ఖనిజలవణాలు యాక్టివ్‌గా మారుతాయి. ఇవి అత్యంత సురక్షితమైనవి. అయితే, ఇండస్ట్రియల్​ఏరియాల్లో ఉండేవారు మాత్రం ఇది ఉపయోగకరం కాదు. పారిశ్రామిక వ్యర్థాల్లో క్యాడ్మియం, ఫ్లోరైడ్, లెడ్, నికెల్​లాంటి గుండెజబ్జు, క్యాన్సర్​కారకాలు నీటిని మరిగించినా పోవు. ఇవి ప్యూరిఫయర్లతోనే నిరోధించవచ్చు.

నీళ్లలో ఉండే మినరల్స్​           (ఎంజీ పర్ ​లీటర్)

బై కార్బోనైట్స్                                                   200

కాల్షియం                                                           75

మెగ్నీషియం                                                     30

క్లోరైడ్స్                                                              250

నైట్రేట్                                                             45

టోటల్ ఆర్సెనిక్                                                0.01

కాపర్                                                                0.05

సల్పేట్                                                            200

ఫ్లోరైడ్                                                               1

ఐరన్                                                              0.3

మెర్క్యూరీ                                                     0.01

జింక్                                                                  5

(పీహెచ్ స్థాయి 6.5 ‌‌- 7.5 మధ్య ఉండాలి.)

శరీరంలో నీటి శాతం

మెదడు         73

గుండె                 73

ఊపిరితిత్తులు        83

చర్మం             64

కిడ్నీలు                 79

కండరాలు             79

రక్తం                     90

ఎముకలు                 31

మనిషి శరీరంలో మొత్తంగా 60 శాతం నీళ్లు ఉంటాయి.

టీడీఎస్ ​శాతం వాడాల్సిన టెక్నాలజీ

100 నుంచి 300 యూవీ/యూఎఫ్​

300 నుంచి 500 యూవీ/ యూఎఫ్​

500 నుంచి 2000 ఆర్​వో

(నిపుణుల సూచన మేరకు..)

ఆర్​వో ఫ్యాక్ట్స్​

* సముద్రంలో నెలల తరబడి ఉండే నావికులకు మంచినీటిని ఇచ్చేందుకు ఆర్‌వో టెక్నాలజీని కనిపెట్టారు. ఇది ఖనిజలవణాలను తీసేయడమే దీని లక్షణం.

* కొన్ని ప్యూరిఫయర్​కంపెనీలు ఆర్వో/ యూవీ/ యూఎఫ్​/యూఎన్​టెక్నాలజీని అందిస్తున్నామని ప్రకటించుకుంటాయి. కానీ, అది పూర్తిగా అవాస్తవం. ఇవన్నీ వేర్వేరు పద్ధతుల్లో జరిగే ఫిల్టరైజేషన్. వీటిలో ఆర్వో అనేది చివరి​ప్రక్రియ. ఒకసారి ఆర్​వోతో ఫిల్టర్​చేశాక ఇక ఏ టెక్నాలజీ అవసరం ఉండదు.

* కొందరు ఆర్వో వాటర్​తాగితే తెల్లగా అవుతామని భావిస్తారు. కానీ, ఇది పూర్తిగా అవాస్తవం

* ఫిల్టర్​అయిన నీళ్లను రోజుల తరబడి ఫ్రిడ్జ్​లో ఉంచితే అందులో బ్యాక్టీరియా వస్తుంది. అది పైకి కనబడకపోయినా మనిషి ప్రమాదమే. ఒకరోజుకు మించి నిల్వ చేయకపోవడమే మంచిది.

* భూమిపై నీటి శాతం 70. అందులో సముద్రనీరు 97.5 మిగితా 2.5శాతం మాత్రమే తాగునీటికి ఉపయోగపడే మంచినీరు. అందులోనూ దాదాపుగా 69శాతం హిమాలయాలు, మంచు రూపంలో ఉంది. మిగిలిన 31శాతం మాత్రమే మనం వినియోగించుకోవడానికి మిగిలి ఉన్నది. ఇప్పుడు ఒక నీటిని ప్యూరిఫై చేయడానికి 3 లీటర్ల నీటిని వృథా చేస్తే భవిష్యత్​ఎలా ఉంటుందో ఊహించుకోవడమే కష్టం.

బ్లాక్​వాటర్​

క్రికెటర్​విరాట్​కోహ్లీ తాగడంతో దేశంలో బ్లాక్​వాటర్​చాలా ఫేమస్​అయ్యింది. అందులో పీహెచ్​స్థాయులు 8.5నుంచి 9 వరకు ఉంటాయి. ఇవి మనిషిని యాక్టివ్​గా ఉండేందుకు సహకరిస్తాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని కంపెనీలు లక్షల ధరపెట్టి ప్యూరిఫయర్​అమ్ముతున్నాయి. వాటి పీహెచ్​స్థాయి కూడా దాదాపుగా బ్లాక్​వాటర్​తో సమానంగా ఉంటుంది. అయితే, అధిక శారీరక శ్రమ చేసేవారికి మాత్రమే పీహెచ్​స్థాయి ఎక్కువ ఉండే నీళ్లు అవసరం. లేకపోతే లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదం లేకపోలేదు.

క్లీవ్‌ ల్యాండ్​‘ఫిజి’ స్టోరీ

అమెరికాలోని క్లీవ్​ ల్యాండ్​ రాష్ట్రంలో ఫిజి అనే మినరల్​ వాటర్ కంపెనీ తన బ్రాండ్​ ప్రమోషన్​ కోసం మా నీళ్లు లోకల్‌వి కావు.. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవి అంటూ విస్తృతంగా ప్రచారం చేసుకున్నది. ఒక దశలో ఛీ.. ఛీ.. ప్రభుత్వం సరఫరా చేసే ట్యాప్​ వాటర్ ​తాగుతున్నారా? ఇంత కన్నా దారుణం ఏమైనా ఉందా? అంటూ ఫోజులు కొట్టింది. దీంతో క్లీవ్​ల్యాండ్ ​వాటర్ ​సప్లై డిపార్ట్​మెంట్​కి ఒళ్లు మండి.. ఫిజి సహా ఆ రాష్ట్రంలో అమ్ముతున్న అన్ని నీళ్ల సంస్థలను చెక్​ చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఫిజి వాటర్​లో ప్రమాదకరమైన ఆర్సెనిక్​ లెవల్స్​ 6.31 ఉంటే ప్రభుత్వం సరఫరా చేస్తున్న నీటిలో సున్నా శాతం ఉందట. ఇంకేముంది కంపెనీ బండారం బయటపడింది. పైగా ఫిజి కంపెనీ నీటి ఉత్పత్తి కోసం సహజ వనరులను విపరీతంగా ఖర్చు చేస్తున్న విషయం కూడా వెలుగు చూసింది.


Similar News