Disha Special Story: మానవ సంబంధాలు కాదు.. పని సంబంధాలు! ఇండియాలో ఉద్యోగులకు హెవీ వర్క్ ప్రెషర్
‘పనిభారం తట్టుకోలేక కుప్పకూలిన 26 ఏండ్ల మహిళా ఉద్యోగి’, ‘వర్క్ ప్రెషర్ భరించలేక 38 ఏండ్ల టెకీ సూసైడ్’.. ఇటీవల జరిగిన ఈ వరుస ఘటనలు వార్తల్లో విస్తృతంగా చర్చనీయాంశమయ్యాయి.
‘పనిభారం తట్టుకోలేక కుప్పకూలిన 26 ఏండ్ల మహిళా ఉద్యోగి’, ‘వర్క్ ప్రెషర్(Work pressure) భరించలేక 38 ఏండ్ల టెకీ సూసైడ్’(Techie Suicide).. ఇటీవల జరిగిన ఈ వరుస ఘటనలు వార్తల్లో విస్తృతంగా చర్చనీయాంశమయ్యాయి. కేరళ(Kerala)కు చెందిన యువ ఉద్యోగి అన్నా సెబాస్టియన్ (Anna Sebastian) ఉద్యోగంలో చేరిన నెలల వ్యవధిలోనే పని ఒత్తిడి తాళలేక కుప్పకూలిపోయింది. పుణె(Pune)లోని ఓ బహుళ జాతి కంపెనీలో ఆమె పని చేయగా, ఆ సంస్థలోని పనివిధానంతోనే తన కూతురు అన్నా సెబాస్టియన్ ప్రాణాలు కోల్పోయిందని అనిత సెబాస్టియన్(Anitha Sebastian) ఆరోపించారు. కార్పొరేట్ కంపెనీ(Corporate companies)లో పనిగంటల విధానం, వర్కింగ్ ఎన్విరాన్‌మెంట్(Working Environment) గురించి అగాస్టియన్ కంపెనీ(Augustian Company) యాజమాన్యానికి ఆమె రాసిన లేఖ పనివాతావరణంపై మౌలికమైన ప్రశ్నలను లేవనెత్తింది. కార్పొరేట్ వర్క్ కల్చర్(Corporate work culture)లో ఉద్యోగుల భద్రత(Employee safety), ఆరోగ్యం(health)పైన సందేహాలను బయటపెట్టింది. కేంద్ర ప్రభుత్వం (Central Govt) సైతం స్పందించి కార్పొరేట్ కంపెనీల్లో పని ఒత్తిడిపైన కమిటీ వేసేలా చేసింది. ఈ క్రమంలోనే పలు దేశాల్లో అమలులో ఉన్న ‘రైట్ టు డిస్‌కనెక్ట్(Right to disconnect)ను’ భారత్(India)లోనూ తీసుకురావాలనే డిమాండ్ తెరమీదకు వచ్చింది. -శ్రీకాంత్.ఏ
మానవ సంబంధాలు కాదు పని సంబంధాలు!
యువ ఉద్యోగి అన్నా సెబాస్టియన్ ఈ ఏడాది మార్చిలోనే ఉద్యోగంలో చేరారు. ఎన్నో ఆశలు, ఆకాంక్షలు, ఆలోచనలతో కార్పొరేట్ ప్రపంచంలో కెరీర్‌లో ఎంతో ఎత్తుకు ఎదగాలనే సంకల్పంతో అడుగులు వేశారు. ఆమెకు అది తొలి ఉద్యోగం కాగా, కంపెనీ టార్గెట్స్ పూర్తి చేసేందుకు గంటల తరబడి సమయం వెచ్చించాల్సి వచ్చేంది. ఈ క్రమంలోనే చివరికి తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నదని అన్నా సెబాస్టియన్ తల్లి అనిత ఆరోపించారు. జూన్ 20న ఆమె పని ఒత్తిడి తాళలేక కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచింది. గత 4 నెలల్లో ఆమె కేవలం 3 రోజులు మాత్రమే సెలవు తీసుకోవడం గమనార్హం. రోజుకు కనీసంగా 16 గంటలకుపైనే వర్క్ చేసిందని అనిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లెక్కన వారంలో 112 గంటలకు పైగా సమయం ఆఫీసు కోసం తన కూతురు వెచ్చించిందని వివరించారు. సంస్థలో పని చేసే సహోద్యోగులు, సీనియర్లు పనిభారం తట్టుకోలేక ఉద్యోగానికి రాజీనామా చేయగా, తాను మాత్రం కెరీర్‌లో ఎదగాలనే భావనతో అన్నా సెబాస్టియన్ తీవ్రంగా శ్రమించి.. చివరకు తన ప్రాణాలనే ఫణంగా పెట్టిందని అనిత బాధాతప్తహృదయంతో వెల్లడించారు. కూతురి మరణంతో తాను శోకసంద్రంలో ఉన్నానని అయితే, తన కూతురు లాంటి స్థితి మరొకరికి రాకూడదని, పనివాతావరణంలో మార్పులు జరగాలని ఆమె ఆకాంక్షించారు. తన కూతురు అంత్యక్రియలకు కనీసంగా ఆఫీసు తరఫున ఎవరైనా హాజరై సంతాపం తెలపకపోవడాన్ని లెటర్‌లో ప్రస్తావించారు. సంస్థకు, ఉద్యోగికి మధ్య ఉన్న సంబంధం కేవలం పని సంబంధితమైనది కాకూడదనే విషయాన్ని చర్చకు తీసుకొచ్చారు. మానవ సంబంధాలకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. ఈ క్రమంలోనే లోక్‌సభలో కాంగ్రెస్ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) సైతం అనితతో మాట్లాడారు. మనకు స్వాతంత్ర్యం 1947లో వచ్చినప్పటికీ, పిల్లలు ఇంకా బానిసల్లానే పని చేస్తున్నారని, అన్నా పని చేసిన సదరు బహుళ జాతి కంపెనీలో శని, ఆదివారాల్లోనూ పని ఉంటున్నదని, కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారికి కనీస సమయం ఇవ్వడం లేదని విషయాన్ని వివరించారు. పని ప్రదేశంలో ఉద్యోగికి సురక్షిత పనివాతావరణం, ఒత్తిడి లేని పని గంటల విధానం గురించి తాను పార్లమెంటు(Parliament)లో మాట్లాడుతానని ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ హామీ ఇవ్వడం గమనార్హం.
పని ఒత్తిడిపై విచారణ
అన్నా సెబాస్టియన్ మరణం తర్వాత కార్పొరేట్ కంపెనీల్లో పని విధానంపైన విస్తృతమైన చర్చ జరుగుతోంది. కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగులపై పనిఒత్తిడిపై సమీక్షించేందుకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ(Union Minister Mansukh Mandaviya) కమిటీని వేశారు. జాతీయ మానవ హక్కుల సంఘం(National Human Rights Commission) అన్నా సెబాస్టియన్ కేసును సుమోటోగా తీసుకుని విచారణ ప్రారంభించింది.
పనిచేస్తేనే దేశాభివృద్ధి
దేశం అభివృద్ధి చెందాలంటే యువత వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ( Infosys founder) నారాయణమూర్తి (Narayanamurthy) వెల్లడించిన అభిప్రాయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వారానికి ఒక రోజు సెలవు తీసుకుంటే మిగతా 6 రోజుల్లో రోజుకు 12 గంటలు యంత్రం మాదిరిగా పని చేయడం సాధ్యం కాదని పేర్కొంటున్నారు. వర్క్ ఫోర్స్ చేత అధిక గంటలు పని చేయించి ఉత్పాదకత పొందాలనే భావన సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగులను పీల్చి పిప్పి చేయాలనుకున్నా, తక్కువ మందితో ఎక్కువ పని చేయాలనుకున్నా ఆశించిన మేర ఫలితాలు రాకపోవచ్చని వెల్లడిస్తున్నారు. ఉద్యోగులకు చక్కటి పని వాతావరణం కల్పించడం ద్వారా మాత్రమే సానుకూల ఫలితాలు సాధించొచ్చని చెబుతున్నారు.
అత్యధిక పని.. భూటాన్(Bhutan)లో
అన్నా సెబాస్టియన్ వార్త మరువకముందే మరో ఉద్యోగి కుప్పకూలిన వార్త వినాల్సి వచ్చింది. దాదాపుగా ఒకే వారంలో రెండు నిండు ప్రాణాలు ఒత్తిడి తాళలేక బలైపోయాయి. చెన్నయ్‌కు చెందిన 38 ఏండ్ల టెకీ కార్తికేయన్ హెవీ వర్క్ ప్రెషర్ తాళలేక సూసైడ్ చేసుకున్నారు. గత 15 ఏండ్లుగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్(Software Engineer)గా పని చేస్తు్న్న కార్తీకేయన్ డిప్రెషన్‌కు ట్రీట్‌మెంట్ తీసుకుంటూనే ప్రెషర్ భరించలేక ఆత్యహత్య చేసుకున్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ(International Labor Organization)(ILO) ప్రకారం వారంలో ఒకరోజు కంపల్సరీగా ఉద్యోగి రెస్ట్ తీసుకోవాలి. మిగతా రోజుల్లో 48 గంటలు పని చేయాలి. రోజుకు 8 గంటల పనివిధానం మాత్రమే అమలులో ఉండాలని కార్మిక చట్టాలు చెబుతున్నాయి. కానీ, ఆచరణలో ఎక్కువ పని గంటల విధానంతో ఉద్యోగుల శ్రమ దోపిడీ జరుగుతున్నది.
వివిధ దేశాల్లో ఉద్యోగుల పనిగంటలను పరిశీలిద్దాం.
2018లో బెల్జియంలో తొలిసారి అమలులోకి ‘రైట్ టు డిస్‌కనెక్ట్’
దక్షిణాసియా దేశాలైన భారత్(India), భూటాన్(Bhutan), బంగ్లాదేశ్(Bangladesh), పాకిస్థాన్(Pakistan)ల్లో ఉద్యోగులు ప్రపంచంలో అన్ని దేశాలకంటే ఎక్కువ గంటల పని చేస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆఫీసుల్లో క్షణం తీరిక లేని వాతావరణం ఉద్యోగులను ఇబ్బంది పెడుతోందని, పని సంస్కృతి మారాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలని, పని ప్రదేశంలో ఉద్యోగులకు సానుకూల వాతావరణంపై ప్రభుత్వాలు పాలసీ రూపొందించాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా(Australia), ఫ్రాన్స్(France), ఇటలీ(Italy), బెల్జియం(Belgium) వంటి దేశాల్లో ఇప్పటికే ఉద్యోగుల ప్రయోజనార్ధం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ (Right to disconnect)చట్టం అమలవుతోంది. వర్క్‌లైఫ్ బ్యాలెన్స్‌కు ఈ చట్టాలు ఉపయోగపడుతున్నాయని ఎంప్లాయీస్ చెబుతున్నారు. 2018లో తొలిసారి ఈ ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ చట్టాన్ని బెల్జియం తీసుకొచ్చింది. దీని ప్రకారం ఉద్యోగులు డ్యూటీ ముగిసిన తర్వాత సంస్థ కార్యకలాపాల గురించి పట్టించుకోనక్కర్లేదు. ప్రైవేటు రంగంలో 20 మంది కంటే ఎక్కువ ఉద్యోగులుండే సంస్థకు ఈ చట్టం వర్తిస్తుంది. అక్టోబర్ 2022లో ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ చట్టానికి బెల్జియం దేశం సవరణలు చేసి చట్టాన్ని మరింత బలోపేతం చేసింది.
భారత్‌లోనూ అమలు చేయాలనే డిమాండ్
దేశంలో ప్రైవేటు రంగంలో ఉద్యోగులకు ఆకర్షణీయమైన వేతనం(salary), అలవెన్సులు(Allowances) ఉంటున్న మాట వాస్తవమే. కాగా, అదేస్థాయిలో వారికి స్ట్రెస్ ఉంటోందని, వారు పనిఒత్తిడితో సతమతమవుతున్నారని పలువురు చెబుతున్నారు. బహుళ జాతి కంపెనీల్లో పనివాతావరణం పూర్తిగా భరించలేని స్థాయికి చేరుతోందని, క్షణం తీరిక లేకుండా ఉద్యోగులపైన తీవ్ర ఒత్తిడి కలిగించేలా ఉంటోందని వివరిస్తున్నారు. ఉత్పాదకత కోసం మనిషిని యంత్రం మాదిరిగా పని చేయించి పీల్చి పిప్పి చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. టార్గెట్స్, డెడ్‌లైన్స్ కంప్లీట్ చేయడం కోసం ఉద్యోగులు నిర్దిష్ట పని గంటల కంటే ఎక్కువ పని చేస్తున్నారనేది స్పష్టమౌతోందంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుత హైబ్రిడ్, వర్క్ ఫ్రం హోం పని విధానంలో ఉద్యోగులు పని గంటలతో సంబంధం లేకుండా 24/7 ఉద్యోగధ్యాసలో ఉంటున్నారని వెల్లడిస్తున్నారు. ఆఫీసు నుంచి వచ్చే ఈమెయిల్స్, వర్క్ అసైన్‌మెంట్స్ అనుక్షణం అందుబాటులో ఉండాల్సిన సిచ్యువేషన్స్ ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో పని ప్రదేశంలో సురక్షిత వాతావరణం, నిర్దిష్ట పనిగంటల విధానం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ ద్వారా వచ్చే అవకాశముంటుందని ఉద్యోగులు అంటున్నారు. భారత్‌లోనూ ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ చట్టం తీసుకురావాలని కోరుతున్నారు.