BJP : స్థానిక ఎన్నికలను ఎలా ఎదుర్కొందాం.. బీజేపీకి సెల్ఫ్‌గోల్ టెన్షన్..!

పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటిన కాషాయ పార్టీ తమ తదుపరి లక్ష్యంగా స్థానిక సంస్థలను ఫిక్స్ చేసుకుంది.

Update: 2024-07-30 02:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటిన కాషాయ పార్టీ తమ తదుపరి లక్ష్యంగా స్థానిక సంస్థలను ఫిక్స్ చేసుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడుకు చెక్ పెట్టినట్లే.. లోకల్ బాడీ ఎలక్షన్స్‌లోనూ సత్తా చాటాలని భావించింది. కేంద్రం కేటాయించిన నిధుల వల్లే గ్రామీణ ప్రాంత అభివృద్ధి సాధ్యమైందనేది పార్లమెంటు ఎన్నికల్లో సక్సెస్ అయ్యేందుకు ఒక కారణం. కానీ కేంద్రం తాజా బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు అనుకున్న స్థాయిలో అలాట్ చేయకపోవడంతో బీజేపీ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లయింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ఎదుర్కోవాలనే ఆలోచనలో పడ్డారు.

బీజేపీని కార్నర్ చేస్తున్న కాంగ్రెస్

పొరుగున్న ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు భారీగా కేటాయింపులు చేసి తెలంగాణకు నిధులు ఇవ్వడకపోవడంతో బీజేపీయే.. కాంగ్రెస్‌కు విమర్శనాస్త్రం అందించినట్లయింది. ఈ అంశంపై శాసనసభ సమావేశాల్లో సమయం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ ప్రశ్నలు సంధిస్తూనే ఉంది. తెలంగాణపై కాషాయ పార్టీకి సవతి తల్లి ప్రేమ అంటూ నాయకులు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణకు బీజేపీ ‘గాడిద గుడ్డు’ మాత్రమే ఇచ్చిందనే వ్యంగ్యాస్త్రాలతో కూడిన ఫ్లెక్సీలు మళ్లీ వెలిశాయి. గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ‘గాడిద గుడ్డు’ అస్త్రాన్ని ప్రయోగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ సందర్భంగా మరోసారి గాడిద గుడ్డు అంశాన్ని హస్తం పార్టీ తెరపైకి తీసుకొచ్చింది.

నేతలు కౌంటర్ ఎటాక్‌ చేయట్లే..

కాంగ్రెస్ నేతల విమర్శలకు కౌంటర్ ఎటాక్స్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో బీజేపీ నేతలు ఉన్నారు. ఒకరిద్దరు లీడర్లు మినహా ఇతర నేతలెవరూ దీనిపై నోరు మెదపడం లేదు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కౌంటర్లు మినహా ఇతర నేతలెవరూ కౌంటర్ ఎటాక్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. మిగతా ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎత్తుకున్న పాత పాటనే మళ్లీ పాడుతున్నారు. తొమ్మిదేండ్లుగా కేటాయించిన నిధులు చెబుతున్నారే తప్ప.. ఈసారి కేటాయింపుల ప్రస్తావనను మాత్రం టచ్ చేయట్లేదు. అంతేగాక వారి వారి సెగ్మెంట్ అభివృద్ధిపై మాత్రమే స్పందించి ఈ అంశాన్ని అటకెక్కిస్తున్నారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమార్ కేవలం ప్రెస్ నోట్లకే పరిమితమయ్యారు. మిగతా ఎంపీలు పూర్తిగా మౌనం వహిస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో రాష్ట్ర నాయకత్వం ఉంది. ఇలాంటి పరిస్థితిలో స్థానిక సంస్థల ఎన్నికలను బీజేపీ ఎలా ఎదుర్కొంటుందనేది చూడాలి.

Tags:    

Similar News